గిరిజన ప్రాంతాల్లో చట్టాలు గిరిజనేతర సన్నకారు రైతుల పాలిట శాపంగా మారాయా? ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ రైతాంగంలో ఈ దుస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. గిరిజన ప్రాంతాల్లో సెటిల్ మెంట్ ల్యాండ్స్ ఉన్నవాళ్లు.. ఈనాం భూములు.. వంశపారంపర్యంగా వందేళ్లుగా సాగు అనుభవిస్తున్న భూములు ఉన్నవాళ్లకు 1/70 యాక్ట్ పేరుతో తీరని అన్యాయం జరుగుతోందన్న ఆవేదన రైతుల్లో వ్యక్తం అవుతోంది. ఏపీ ప్రభుత్వం తరపున రైతుకు అందాల్సిన ఒక్క పథకానికి వీళ్లకు భూపట్టా లేక అర్హత లేకపోవడంతో ఆ మేరకు పంట పండించే వెసులుబాటును కోల్పోతున్నారు. దీనివల్ల అసవరమైన ప్రభుత్వ సాయాన్ని కోల్పోతున్న వైనం కనిపిస్తోంది. మద్రాసు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి.. గిరిజన చట్టాలు పుట్టుకు రాక ముందు నుంచి తాతలు తండ్రులు సాగు అనుభవించినవాటి విషయంలో నేటితరం రైతులకు ఈ చట్టాలు చట్టుబండలుగా మారాయి.
కొన్ని దశాబ్ధాల పాటు వారసత్వ భూములు ఉన్నవాళ్లకు అతీగతీ లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఏజెన్సీల్లో 2 ఎకరాల నుంచి 5-10 ఎకరాల లోపు భూములు ఉన్న రైతులే ఎక్కువ. పైగా ఇవన్నీ మెట్ట భూములు. సాగుకు నీటి సదుపాయం లేని నిస్సారమైన భూములు. ఇందులో ఆదాయాలు వచ్చేది అంతంత మాత్రమే. గిరిజనేతర ఏరియాల్లో ప్లెయిన్ రైతుల కోసం ప్రభుత్వాలు సబ్సిడీలు రుణాలు ఇస్తున్నా.. ఏజెన్సీలో వారసత్వ భూములు అనుభవించే రైతులకు ఏదీ ఉండదు. పైగా ఏజెన్సీలో కొండల్లో అరకొర వసతుల నడుమ వీళ్లు సంపాదించేది ఏదైనా ఉంటుందా? అంటే ఏదీ ఉండదు. అరకొర బతుకులు చాలీ చాలని బతుకులతోనే కాలం వెల్లదీయాల్సిన ధైన్యం నెలకొంటుంది.
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా తాండవ సమీపంలోని పలువురు రైతులను ఈ విషయమై ప్రశ్నిస్తే వారిలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. కష్టాల కడలిలో సాగు లేక సతమతమవుతున్న ఒక రైతు మాట్లాడుతూ-“వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుకు మేలు చేసే ఎన్నో పథకాల్ని తెచ్చింది. కానీ ఏవీ మాకు అందడం లేదు. రైతు భరోసా లేదు.. భూపట్టా లేక బ్యాంకు రుణాలు లేవు. విత్తనాలు ఎరువులు లేవు. సబ్సిడీలు లేవు. డ్రిప్ ఇర్రిగేషన్ కానీ ఏ ఇతర సదుపాయాలు లేవు. కనీసం కిసాన్ క్రెడిట్ కార్డ్ అయినా తీసుకునే అవకాశం కల్పించలేదు. పూర్వీకుల నుంచి బూజు పట్టిన చట్టాల వల్ల దశాబ్ధాల పాటు ఇలాంటి బతుకే బతకాల్సిన ధైన్యం నెలకొంది“ అంటూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
ఐదు పది ఎకరాలు ఉన్నా ఒక కూలీలా బతుకు వెళ్లదీయాల్సిన దుస్థితి దశాబ్ధాల పాటు ఉందన్న ఆవేదనను పలువురు రైతులు వ్యక్తం చేశారు. మారిన కాలంతో పాటు పై చట్టాల్లో సవరణలు లేకపోవడం వల్ల గిరిజనులకు కూడా పట్టాల్లేవ్. అలాగే ఇతర రైతులకు కూడా ఎలాంటి ప్రయోజనాల్లేవని చెబుతున్నారు. కొన్నిచోట్ల కలెక్టర్లు చట్టంలో మార్పుల కోసం ప్రయత్నించినా ఆటంకాలు ఎదురవ్వడంపై రైతులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
–శ్రీకాంత్ కొంతం