ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు (డిసెంబర్ 2) తెల్లవారుజామున నర్సీపట్నం పట్టణంలోని శారదానగర్‌లో పోస్టాఫీసు ఎదురుగా ఉన్న ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు దుకాణాలు కాలి బూడిదవ్వడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
అసలేం జరిగింది? స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంప్లెక్స్ మొదటి అంతస్తులో తొలుత మంటలు కనిపించాయి. చూస్తుండగానే అవి వేగంగా విస్తరించి భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. మంటల తీవ్రతకు అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఇతర వ్యాపార సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పొగ దట్టంగా ఉండటంతో సుమారు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

కన్నీరుమున్నీరవుతున్న బాధితులు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భవనంలో నివసించే కుటుంబాలు, వ్యాపారులు తమ ఆస్తులు కాలిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. నగదు, అత్యవసర పత్రాలు, విలువైన వస్తువులు మంటల్లో కాలి బూడిదయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
షార్ట్ సర్క్యూటే కారణమా? విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. భవనంలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల పరిస్థితిపై అధికారులు ఆరా తీస్తున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
కొండగట్టులోనూ అగ్నిప్రమాదం మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో కూడా శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో కూడా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

