నారా లోకేష్ ఎలివేషన్లు మామూలుగా లేవ్.!

ఇంతకీ, నారా లోకేష్ భీమవరం గలాటాతో ఏం సాధించినట్లు.? టీడీపీ కార్యకర్తలే వైసీపీ ముసుగేసుకుని దాడులకు దిగారా.? వైసీపీ కార్యకర్తలు, టీడీపీ ముసుగేసుకుని దాడులు చేశారా.? ఈ విషయమై భీమవరం జనం ఏమనుకుంటున్నారు.? ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎలాంటి చర్చ జరుగుతోంది.

గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులపై ఆరా తీస్తే, ఇది రెండు పార్టీల డ్రామాగా మెజార్టీ ప్రజానీకం అభిప్రాయపడుతుండడం గమనార్హం. గతంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ చేసినప్పుడూ, వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి.

పైగా, ఇప్పుడంతా ఫ్లెక్సీల ట్రెండ్. దానికి తోడు అల్లరి మూకల్ని ప్రధాన పార్టీలు కిరాయికి వాడుకోవడం ఎక్కువైపోయింది. పలానా పార్టీ కోసమే.. అన్నట్టు కాకుండా, కొన్ని అల్లరి మూకలు, ఏ పార్టీ కోసమైనా పని చేయడానికి సిద్ధమవుతున్నాయి. అలాంటి కొన్ని అల్లరి మూకల్ని ఇరు పార్టీలూ ఎంగేజ్ చేశాయన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట.

‘డబ్బులు ఖర్చు చేస్తే, జైలుకెళ్ళడానికీ సిద్ధంగా కొందరు వున్నారు..’ అని భీమవరంలోనే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల రాజకీయాలతో బాగా పరిచయం వున్నవాళ్ళే కాదు, సామాన్యూలూ చెబుతున్న విషయాన్ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం. వాస్తవ కోణం ఇలా వుంటే, ‘విషయాన్ని చాలా తెలివిగా నారా లోకేష్ డీల్ చేశారు’ అంటూ, టీడీపీ నేతలు ‘కేజీఎఫ్ మార్కు’ ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు.

ఓ వైపు, పార్టీ శ్రేణులు సంయమనం పాటించేలా చేయడం.. ఇంకో వైపు, పోలీసుల్ని డీల్ చేయడం, మరో వైపు టీడీపీ మీద దాడికి యత్నించిన వైసీపీ శ్రేణులకు బుద్ధి చెప్పడం.. ఇవన్నీ భలేగా నారా లోకేష్ చేశారట. అలాగని టీడీపీ నేతలు చెబుతోంటే, నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాసులది.

అంతే మరి, స్థానికంగా వందలాది మందిని నిత్యం డబ్బులతో కొనేస్తూ, వెంట తిప్పుకుంటున్నారు నారా లోకేష్. ఈ విషయం ఆయన ఎక్కడ పాదయాత్ర చేస్తే.. అక్కడ ఆ జిల్లాలో దాదాపుగా అందరికీ తెలుస్తోంది మరి.!