చివరాఖరికి కిలారి ఆనంద్ పాల్కి కూడా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) వీవీ లక్ష్మినారాయణ లోకువైపోయారా.? ఔననే అనుకోవాలేమో.! విశాఖ స్టీలు ప్లాంటు వ్యవహారమై కేఏ పాల్‌తో కలిసి మీడియా ముందుకొచ్చారు లక్ష్మినారాయణ.
కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న కేఏ పాల్, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ చేయొద్దని వారికి చెప్పాలంటూ లక్ష్మినారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కేఏ పాల్ సహజంగానే కొంత అతి చేశారు.
పైగా, ‘తెలుగు ప్రజలు.. ఒక్కొక్కరూ వంద రూపాయల చొప్పున వేసుకుంటే, సుమారు 850 కోట్ల రూపాయలవుతుందనీ ఆ మొత్తంతో విశాఖ స్టీలు ప్లాంటుకి సంబంధించి బిడ్ వేస్తాననీ’ ఇటీవల లక్ష్మినారాయణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ ‘వంద రూపాయల’ వ్యవహారంపై కేఏపాల్ మండిపడ్డారు. ‘ఇలాంటి వేషాలు నేను వెయ్యను. నాకు యాక్టింగ్ రాదు.. యాక్షన్ మాత్రమే వచ్చు..’ అంటూ పక్కనే వున్న వీవీ లక్ష్మినారాయణను ర్యాగింగ్ చేశారు కిలారి ఆనంద్ పాల్.
2024 ఎన్నికల్లో విశాఖ నుంచే లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్న లక్ష్మినారాయణ, కేఏ పాల్ తాజా చర్యలతో ఒక్కసారిగా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయి డీలా పడాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకున్నారు. కేఏ పాల్ మాటలెలా వుంటాయో, చేతలెలా వుంటాయో లక్ష్మినారాయణకు తెలియదా.? తెలిసీ ఎలా తప్పులో కాలేసినట్లు.?