జేడీ కొత్త రాజకీయ పార్టీ వెనుక కథేంటి.?

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ, వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీ జెండాతో అదే విశాఖ లోక్ సభకు పోటీ చేయబోతున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఆయన ప్రారంభించారు.

నిజానికి, 2019 ఎన్నికల సమయంలోనే ఆయన కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారనే ప్రచారం జరిగింది. బీజేపీ ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానించింది. లోక్ సత్తా పార్టీని తీసుకోవాల్సింది కూడా ఆయన ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. టీడీపీ కూడా ఆయన్ని అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నించింది.

అయితే, అనూహ్యంగా జనసేన వైపు నడిచారు జేడీ లక్ష్మినారాయణ. అంతే అనూహ్యంగా, పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటించడం తనకు ఇష్టం లేదనే కుంటిసాకు చెప్పి, జనసేనకు గుడ్ బై చెప్పేశారాయన. ప్రస్తుతం ఈ మాజీ ఐపీఎస్ అధికారి, సొంత పార్టీ వ్యవహారాల్లో బిజీగా వున్నారు. పార్టీ పేరు ప్రకటించేశారు గనుక, ఇతరత్రా వ్యవహారాలు చూసుకోవాలి కదా.? అయితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ తక్కువ గ్యాప్‌లో జేడీ పెట్టిన పార్టీ ఎలా జనంలోకి వెళుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

అయినా, కొత్త రాజకీయ పార్టీ దిశగా జేడీ ఎందుకు అడుగులు వేసినట్టు.? ఎవరు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా, కొత్త రాజకీయ పార్టీ ఎవరు స్తాపించినా అభినందించాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం. ఎవరిష్టం వారిది. అయితే, వైసీపీకి అనుబంధంగా జై భారత్ నేషనల్ పార్టీ వుంటుందనే గుసగుసలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వైసీపీ వైపు కొంత సానుకూలంగా జేడీ లక్ష్మినారాయణ నిన్న మొన్నటిదాకా చూడటం వల్లే ఈ వాదనలకు ఆస్కారం ఏర్పడుతోంది. కానీ, ప్రత్యేక హోదా విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఫెయిల్ అయ్యాయన్న ఆరోపణ చేస్తూ కొత్త పార్టీ ప్రకటించారాయన.

అసలు ప్రత్యేక హోదా అంశానికి రాష్ట్రంలో విలువ వుందా.? ప్రజలు దాన్ని పట్టించుకుంటున్నారా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.