వైసీపీలోకి జేడీ లక్ష్మినారాయణ.? నో ఛాన్స్.!

ఆయన పేరు వీవీ లక్ష్మినారాయణ.! కానీ, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్‌గా పని చేసిన నేపథ్యంలో ఆయన పేరు జేడీ లక్ష్మినారాయణగా మారిపోయింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారానికి సంబంధించి లక్ష్మినారాయణ అప్పట్లో కొందరికి ‘హీరో’ అయ్యారు.!

అలా ఆయన రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.. అదీ, ఉద్యోగాన్ని వదులుకుని.. అంటే, ముందస్తుగా పదవీ విరమణ చేసి.! అలా రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మినారాయణ, జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి, ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

జనసేన నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థుల్లో లక్ష్మినారాయణ మీద అప్పట్లో కనిపించిన హైప్ ఇంకే ఇతర ఎంపీ అభ్యర్థికీ రాలేదనడం అతిశయోక్తి కాదు. అది వేరే చర్చ మళ్ళీ.

కానీ, ఎప్పుడైతే జనసేనాని పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించాలనుకున్నారో, ఆ వంక పెట్టి, జనసేన పార్టీకి దూరమయ్యారు లక్ష్మినారాయణ. అప్పటినుంచి కథ మళ్ళీ మొదటికి వచ్చింది. జేడీ ఏ పార్టీలో చేరతారంటూ పూటకో గాసిప్పు ప్రచారంలోకి వస్తూ వుంది.

ఈ మధ్యనే ఓ సందర్భంలో, వైసీపీ ప్రభుత్వాన్ని అభినందించారు లక్ష్మినారాయణ. అంతే, ఆయనకు విశాఖ ఎంపీ టిక్కెట్టుని వైసీపీ ఖరారు చేసిందంటూ జనసేన, టీడీపీ మద్దతుదారులు ప్రచారం మొదలు పెట్టేశారు.

ఈ ప్రచారంపై తాజాగా స్పందించిన లక్ష్మినారాయణ, తాను వైసీపీ నుంచి పోటీ చేయడంలేదని స్పష్టతనిచ్చేశారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అసలు వైసీపీతో లక్ష్మినారాయణ టచ్‌లోకే వెళ్ళలేదట. వైసీపీ ఆయన్ని ఆహ్వానించే పరిస్థితీ లేదట.