రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలనేవి అధికార పార్టీకీ, విపక్షాలకీ మధ్య జరగాలి. కానీ, చిత్రంగా ‘పంచాయితీ’ అనేది ముఖ్యమంత్రికీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కీ మధ్య జరుగుతోంది. ‘చంద్రబాబుకి కులానికి చెందిన వ్యక్తి’ అనే ముద్రని ఎస్ఈసీ నిమ్మగడ్డ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేశారు. అంటే, నిమ్మగడ్డ కమ్మ అధికారి అన్నమాట. మరి, వైఎస్ జగన్ ఏంటి.? ఆయన రెడ్డి ముఖ్యమంత్రి అనుకోవాలా.? అని జనం చర్చించుకుంటూనే వున్నారు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా వున్నప్పుడే, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యింది. అడ్డగోలుగా ‘ఏకగ్రీవాలు’ కూడా జరిగిపోయాయి. అప్పట్లో నిమ్మగడ్డ తీరు సమ్మగా అనిపించింది అధికార పార్టీకి. ఎప్పుడైతే కరోనా వైరస్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్థానిక ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారో, పంచాయితీ అక్కడే మొదలయ్యింది.
ఎన్నికల సంస్కరణలంటూ, నిమ్మగడ్డను పదవి లోంచి తొలగించి, మరో వ్యక్తిని ఆ పదవిలో జగన్ ప్రభుత్వం నియమించడం, హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురయి.. తిరిగి నిమ్మగడ్డ ఎస్ఈసీ పదవిలోకి రావడం.. ఈ క్రమంలో జరిగిన, జరుగుతున్న పొలిటికల్ యాగీ అందరికీ తెలిసిందే. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన దరిమిలా, స్థానిక ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగించేందుకు నిమ్మగడ్డ చర్యలు చేపట్టడం అధికార పార్టీకి నచ్చలేదు. కానీ, నిమ్మగడ్డ మాత్రం ఆగలేదు. మళ్ళీ వ్యవహారం కోర్టుకెళ్ళింది. నిమ్మగడ్డకు తొలి షాక్ తగిలింది.. కానీ, రెండో షాక్ ప్రభుత్వానికి చాలా గట్టిగా తగిలింది. పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. ‘నిమ్మగడ్డ చెప్పినట్టు నడవదు’ అని ఇంకా కొందరు మంత్రులు చెబుతున్నారు. కానీ, రేపో మాపో నోటిఫికేషన్ కూడా వచ్చేయబోతోంది. ఈలోగా రాష్ట ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం వుంది. అక్కడ ఎవరికి షాక్ తగులుతుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ, ముఖ్యమంత్రికీ – ఎస్ఈసీకీ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు మాత్రం అత్యంత హేయంగా వుందన్న చర్చ అయితే, జన బాహుళ్యంలో చాలా చాలా గట్టిగానే జరుగుతోంది.