దగా.. దగా.. మోసం: టీడీపీ మేనిఫెస్టోలో అది మిస్!

చంద్రబాబు మొద‌టి విడ‌త మేనిఫెస్టో ప్రకటించారు. దీనిపై వైసీపీ క్యాడర్, సాధారణ ప్రజానికంతో పాటు విజ్ఞత కలిగిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు సైతం పెదవి విరుస్తున్నారు! ఇక వైసీపీ నాయకులైతే మైకులముందుకు కొచ్చి… ఆ మేనిఫెస్టోలోని ఒక్కో పథకమూ ఎక్కడెక్కడ నుంచి కాపీ చేసిందీ క్లియర్ కట్ గా తేల్చి చెప్పారు. దీంతో మూతిమీద వేలువేసుకుంటున్నారు టీడీపీ జనాలు! అయితే ఈ సందర్భంగా ఒక విషయం వెలుగులోకి వచింది.

సరిగ్గా గమనిస్తే జగన్ ను చంద్రబాబు బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారనే కామెంట్లు.. ఈ మేనిఫెస్టో చూసిన అనంతరం ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. ఇంతకాలం జగన్ పై విమర్శలు గుప్పించిన పథకాలనే బాబు.. పేరు మార్చి వాడేసుకుంటున్న పరిస్థితి. ఆ సంగతి అలా ఉంటే… మ్యానిఫెస్టోలో అసలు సిసలు సబ్జెక్ట్ “అమరావతి” మిస్సయ్యిందనే విషయం.. అమారావతి ప్రాంతంలో వైరల్ గా మారింది.

అవును… ప్రపంచంలోని చాలా దేశాలు తిరిగి.. సింగపూర్, మలేషియా, జపాన్ వంటి రాజధానిని ఏపీలో నిర్మిస్తానని… సినిమా దర్శకుడు రాజమౌళితో గ్రాఫిక్స్ కూడా రెడీ చేయించిన చంద్రబాబు… తన హయాంలో అమరావతిని అటూ ఇటూ కాకుండా వదిలేసిన సంగతి తెలిసిందే! అయితే విషయం అర్థం చేసుకున్న ప్రజలు 2019 ఎన్నిక‌ల్లో బాబుని ఓడించారు. ఓడిపోయిన తర్వాత బాబు క‌ల‌ల అమ‌రావ‌తిని జగన్ పట్టించుకోక‌పోవ‌డంతో అంద‌రి చూపు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప‌డింది. 2024లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌రావ‌తి క‌ల సాకారం అవుతుంద‌ని భావించిన వారికి చంద్రబాబు తాజాగా గట్టి షాక్ ఇచ్చారు.

2024 ఎన్నికల్లో “అమరావతే రాజధాని” అజెండాగా ఎన్నికలకు వెళ్తారని చంద్రబాబుని నమ్మిన అమరావతి రైతులకు బాబు దిమ్మతిరిగే షాకిచ్చారు. తనకు అమరావతి ఫస్ట్ ప్రియారిటీ కాదని తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లో తాను మునిగిపోవడానికి గల కారణాల్లో అమరావతి కూడా ఒకటని భావించినట్లున్నారు. ఫలితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తొలి విడత మ్యానిఫెస్టోలో అమరావతికి చోటు లేకుండా చేశారు. దీంతో… అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు అమరావతి పై ఆశలు పెట్టుకున్న రైతులు, జేఏసీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు! దీంతో… చంద్రబాబును తాము నమ్మి మోసపోయినట్లు మీరు కూడా మోసపోవద్దు అంటూ ఇతర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అమరావతి
రైతులు!!