సీఎం జగన్‌ పోరాటం న్యాయ వ్యవస్థ మీదా? వ్యక్తుల మీదా.?

YS Jagan vs Judiciary

ఎద్దు ఈనిందిరో.. అంటే, దూడని కట్టెయ్యండిరో.. అన్నాడట వెనకటికి ఒకడు. ఎద్దు ఈనడమేంటి? అన్న కనీసపాటి ఆలోచన లేకుండానే ‘దూడ’ గురించి మాట్లాడటం అవివేకం. అలాంటి అవివేకుల గురించి మాట్లాడే సందర్భంలో ఈ నానుడిని వాడుతుంటాం.

YS Jagan vs Judiciary

అసలు విషయానికి వచ్చేస్తే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన ఓ న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ, చీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకి లేఖ రాయడం పెను దుమారం రేపుతోంది. ఈ లేఖలో, రాష్ట్ర హైకోర్టుకి చెందిన కొందరు న్యాయమూర్తుల పేర్ల ప్రస్తావన కూడా వచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, పలు సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల గురించి కూడా వైఎస్‌ జగన్‌, సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ రాసిన లేఖలో ప్రస్తావించారు. అంతే, దుమారం మొదలయ్యింది. వైఎస్‌ జగన్‌ అలా లేఖ రాయడం తప్పంటూ తెలుగు మీడియాలో ఓ వర్గం కథనాలు మొదలపెట్టింది.

వాస్తవానికి, లేఖ విడుదలైన తర్వాత ఆ సెక్షన్‌ మీడియా తొలుత ‘పట్టించుకోలేదు’. ఇంతటి తీవ్రమైన అంశాన్ని ఎందుకు ఆ మీడియా పట్టించుకోలేదు? అని వైసీపీ నేతలు ప్రశ్నించడంతో, ఆ తర్వాతి రోజు నుంచీ అసలు రచ్చ మొదలైంది. వైఎస్‌ జగన్‌, అలా చీఫ్‌ జస్టిస్‌కి ఓ న్యాయమూర్తిపై ఫిర్యాదు చేయడం నేరమన్నట్లుగా ఓ సెక్షన్‌ మీడియాలో కథనాలు, విశ్లేషణలు వచ్చాయి. ఇది నిజంగానే తొందరపాటు చర్య. గతంలోనూ పలువురు రాజకీయ ప్రముఖులు ఈ తరహా ఆరోపణలు న్యాయమూర్తులపై చేశారు. సో, వైఎస్‌ జగన్‌ ‘మొట్టమొదటి వ్యక్తి’ అనడం అసమంజసం అని తేలిపోయింది. పైగా, అలా ఫిర్యాదు చేయడం తప్పు కాదని, న్యాయ నిపుణులు చెబుతుండడంతో ‘ఓ సెక్షన్‌ మీడియా’ నాలిక్కరచుకోవాల్సి వస్తోంది. లేఖ రాయడం తప్పు కాదుగానీ, లేఖను బయటపెట్టడం తప్పిదమంటూ కొత్త పల్లవి అందుకుంది ఆ టీడీపీ అనుకూల మీడియా.

తప్పొప్పులు నిర్ణయించాల్సింది సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌. ఎందుకంటే, ‘బంతి’ ఇప్పుడు ఆయన కోర్టులో వుంది. వైఎస్‌ జగన్‌ లేఖను, ఆయన సలహాదారుడైన అజేయ కల్లాం బయటపెట్టిన తర్వాత రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్‌, న్యాయ కోవిదుడు మాడభూషి శ్రీధర్‌ మధ్య యూ ట్యూబ్‌లో ఓ చర్చ జరిగింది. ఇందులో చాలా ఆసక్తికరమైన అంశాలున్నాయి. చీఫ్‌ జస్టిస్‌ గనుక, ఆ లేఖని పరిగణనలోకి తీసుకుంటే, విచారణ సందర్భంగా వైఎస్‌ జగన్‌, తాను న్యాయమూర్తి ఎన్వీ రమణపై చేసిన ఆరోపణల్ని నిరూపించాల్సి వుంటుంది. ఇంకోపక్క, ఎన్వీ రమణ కూడా పరువు నష్టం దావా వేసే అవకాశం వుంటుందని మాడభూషి శ్రీధర్‌ చెప్పారు. ఎన్వీ రమణ ఒక్కరే కాదు, వైఎస్‌ జగన్‌ రాసిన లేఖలో ఎవరెవరిపైన ఆరోపణలున్నాయో, ఆయా న్యాయమూర్తులంతా విడివిడిగా కూడా పరువు నష్టం దావాలు వేసే అవకాశం వుంటుంది. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్‌. అది పూర్తవ్వాలంటే ఏళ్ళతరబడి సమయం పట్టొచ్చు.

‘వైఎస్‌ జగన్‌ మీదున్న అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం కానున్న దరిమిలా, సింపతీ కోసమే ఆయన జస్టిస్‌ ఎన్వీ రమణ సహా పలువురు న్యాయమూర్తులపై ఆరోపణలు చేశారు’ అంటూ ఓ వాదన బలంగా విన్పిస్తోంది. కానీ, చంద్రబాబుకీ, న్యాయ వ్యవస్థకీ వున్న అవినాభావ సంబంధాన్ని వెలుగులోకి తెచ్చేందుకు వైఎస్‌ జగన్‌ చేసిన ప్రయత్నం అనే అభిప్రాయం వైసీపీ నుంచి చాలా గట్టిగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టు స్థాయికి చెందిన న్యాయ కోవిదులు (ఎక్కువమంది మాజీ న్యాయమూర్తులే) వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్ని బట్టి చూస్తూ, వైఎస్‌ జగన్‌ రాసిన లేఖ తప్పు కాదు. కానీ, అది బయటపెట్టడం మాత్రం కొంతవరకు వ్యూహాత్మక తప్పిదమేనని అర్థమవుతోంది.

ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందోనన్న ముందస్తు ఆలోచన లేకుండా అయితే వైఎస్‌ జగన్‌, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి ఫిర్యాదు చేసి వుండకపోవచ్చు. కాలమే అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పనుంది. చివరగా, ఇది వ్యవస్థల మీద పోరాటం కానే కాదు. వ్యవస్థల్లోని ఉన్నత స్థానాల్లో వున్నప్రముఖ వ్యక్తుల మధ్య పోరాటంగానే చూడాల్సి వస్తుందనేది నిస్సందేహం.