విభ్రమం గొలుపుతున్న తీర్పులు

ap high court

రాజ్యాంగంలోని మొదటి రెండు అంగాలైన శాసనవ్యవస్థ, అధికారవ్యవస్థ సామాన్యుడికి న్యాయం చెయ్యడంలో విఫలం అయినపుడు మూడో అంగమైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాం. మన రాజ్యాంగం ప్రకారం సుప్రీమ్ కోర్టు ఇచ్చేది అంతిమ తీర్పు. ఆ తీర్పు ఎవరికి నచ్చినా, ఎవరికి నచ్చకపోయినా దాన్ని ఔదలదాల్చాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలకైనా, కేంద్ర ప్రభుత్వాలకైనా సుప్రీం కోర్ట్ ఇచ్చే తీర్పు శిరోధార్యం. అలాంటి ఉన్నత పదవుల్లో ఉండేవారి రక్షణ నిమిత్తం న్యాయమూర్తులను దూషించడం, వారికి దురుద్దేశ్యాలు ఆపాదిస్తూ విమర్శించడం తీవ్రమైన నేరాలుగా పరిగణించబడుతున్నాయి. మహామహులైన న్యాయవాదులు, రాజకీయనాయకులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా అందుకు అతీతులు కారు. అందుకే ప్రభుత్వాలకు వ్యతిరేకమైన తీర్పులు వచ్చినా సరే, ప్రభుత్వాధినేతలు ఆ తీర్పులను తప్పు పట్టడానికి సాహసించరు. దేశప్రఖ్యాతి గాంచిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సైతం ఇటీవలే కోర్టు శిక్షకు గురయ్యారు. అయితే ఆ శిక్ష పరిమాణం చాలా తక్కువ కావచ్చు. కానీ, ప్రశాంత్ భూషణ్ ను కూడా కోర్టు శిక్షించిందనే అంశం రికార్డులలో నమోదు అవుతుంది.

Interesting news on ap high court
Interesting news on ap high court

గెలిచేదంతా న్యాయమేనా?

“చివరకు న్యాయమే గెలుస్తుంది. కానీ గెలిచేదంతా న్యాయం కాదు” అని మహాకవి శ్రీశ్రీ దశాబ్దాల క్రితమే వాపోయారు. మనదేశంలో ప్రతిరాష్ట్రంలోనూ ప్రత్యేకంగా హైకోర్టులు ఉంటాయి. వాటన్నింటిమీద ఉన్నతాధికారిలా దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది. ఈ కోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించబడేవారి అర్హతలు అన్నీ సమానంగానే ఉంటాయి. అందరికీ ఒకే చట్టం, ఒకే ధర్మం, ఒకే న్యాయం. ఎవరు తీర్పులు చెప్పినా చట్టాల ప్రకారం రాజ్యాంగానికి లోబడి చెప్పాల్సిందే. అయితే దేశం మొత్తానికి ఒకటే న్యాయవిధానం అయినపుడు ఒక కోర్టులో తప్పయింది మరొక కోర్టులో ఒప్పు ఎందుకు అవుతున్నదో అర్ధం కాదు. ఒక కోర్టు నేరంగా పరిగణించినదాన్ని పై కోర్టు కొట్టేస్తుంది. ఆ కోర్టు కొట్టేసినదాన్ని ఆపై కోర్ట్ కొట్టేసి నేరాన్ని ధృవీకరిస్తుంది. ఒక నేరానికి ఒక కోర్టు ఉరిశిక్ష వేస్తె ఆ పై కోర్టు దాన్ని యావజ్జీవశిక్షగా మార్చుతుంది. రాష్ట్ర ప్రభుత్వ కేబినేట్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని ఒక రాష్ట్ర హైకోర్టు ప్రకటిస్తే, కేబినెట్ నిర్ణయాలే కాదు, గవర్నర్ నిర్ణయాలను కూడా మరొక రాష్ట్ర హైకోర్టు కొట్టేస్తుంది. ఇక్కడే సామాన్యప్రజలు గందరగోళానికి గురవుతుంటారు.

Ap CM Ys Jaganmohan reddy
Ap CM Ys Jaganmohan reddy

ఎపి హైకోర్ట్ తీరే వేరు

గత ఏడాది కాలంగా “జగన్ కు కోర్టు మొట్టికాయలు” …”జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్”…”జగన్ ప్రభుత్వ వాదనలను త్రోసిపుచ్చిన హైకోర్టు” అనే వార్త వినని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. జగన్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సైతం హై కోర్ట్ కొట్టేస్తున్నది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పిటీషన్ వేసినా దాన్ని ఆగమేఘాల మీద విచారణకు స్వీకరిస్తున్నది. హైకోర్టు తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టలేము. జగన్ అభిమానులు, వారి పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంచెం అతిగా స్పందించవచ్చు. కోర్టులను, న్యాయమూర్తులను దూషించవచ్చు. ప్రతిపక్షం వారు కోర్టులను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించవచ్చు. కానీ, విజ్ఞత కలిగినవారు మాత్రం ఎందుకిలా జరుగుతున్నది అని ఆలోచిస్తారు. ఒకవేళ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నదా అని సందేహిస్తారు. కానీ, ఈమధ్య హైకోర్టు వెలువరించిన కొన్ని తీర్పులను చూస్తుంటే కోర్ట్ వైఖరి మీద కూడా అనుమానాలు పొడసూపుతున్నాయి.

న్యాయం జరిగినట్లు కనిపించాలి

రెండు ఉదాహరణలు చెప్పుకుందాము. ఆ మధ్య విజయవాడలోని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పదిమంది రోగులు అగ్నికి ఆహుతి అయిపోతే, సదరు ఆసుపత్రి యజమాని రమేష్ పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు. ఆయన్ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తూ, ఆయన ఆచూకీ తెలిపినవారికి లక్ష రూపాయలు బహుమతి ప్రకటిస్తే…రమేష్ మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తీర్పు ఇవ్వడం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Ramesh
Ramesh

నేరస్తులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుని కోర్టుముందు నిలబెట్టాలని పోలీసులను ఆదేశించడం సహజం. కానీ, ప్రభుత్వం వెతుకుతున్న నేరగాళ్ళను పట్టుకోవద్దని తీర్పు ఇవ్వడం వెనుక రాజ్యాంగ ధర్మం ఏమిటో మనబోటి సామాన్యులకు కొరుకుడు పడదు. అలాగే జగన్ ప్రభుత్వం ప్రయివేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పేదపిల్లలు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే ఏర్పాట్లు చేస్తుంటే దాన్ని హైకోర్ట్, సుప్రీంకోర్టు కూడా అడ్డుకోవడం, వాటి మీద స్టేలు ఇవ్వడం, విచారణను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నట్లు తోస్తున్నది.

మద్యం విధానం రాష్ట్రము అధికారం కాదా?

ఇక మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది హైకోర్టు నిన్న మద్యం విధానం మీద ఇచ్చిన తీర్పు. ఏ రాష్ట్రానికైనా వారి వారి ఆబ్కారీ విధానాలు ఉంటాయి. ఏపీలో మద్యపాన నిషేధం విధించాలనేది జగన్మోహన్ రెడ్డి ఆశయం. దానికి అనుగుణంగా ఆయన ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నది. ఆ ప్రయత్నాలు చాలామందికి నచ్చడం లేదు. ముఖ్యంగా మద్యపానప్రియులకు జగన్ నిర్ణయం కంటకప్రాయంగా అనిపిస్తున్నది. అయితే పొరుగు రాష్ట్రాలనుంచి మూడు మద్యం సీసాలు తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడం ఏవిధంగా రాజ్యాంగ సమ్మతామో మరి! ప్రజారోగ్యాన్ని కాంక్షించి జగన్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ తీర్పు నీరుగారుస్తుందనడంలో సందేహం లేదు.

AP Wine shop
AP Wine shop

దానికి బదులుగా ఆంధ్రప్రదేశ్ లోనే ప్రజలు కోరుకున్న బ్రాండ్స్ అమ్మాలని, మద్యనిషేధం అమలు చెయ్యడానికి వీలు లేదని తీర్పు ఇస్తే ప్రజల ఆరోగ్యం నాశనం అయినా, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేది. విద్యార్థులకు మేలు చేసే అంశంలో తల్లితండ్రుల ఆకాంక్షలకు వ్యతిరేకమైన తీర్పు, ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే అంశంలో వారికి అనుకూలమైన తీర్పు రావడం సాధారణ ప్రజలను ఖిన్నులను గావిస్తున్నాయి.

సమర్థులైన న్యాయవాదులను నియమించుకోవడం, లోపం ఎక్కడుందో గాలించి తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేట్లు పిటీషన్లు వేసుకోవడం మినహా ప్రభుత్వానికి మరో గత్యంతరం లేదు.

ఇలపావులూరి మురళీ మోహన రావు

సీనియర్ రాజకీయ విశ్లేషకులు