ఏడాదిన్నరగా అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తూ సుమారు ఎనభై వేలకోట్ల రూపాయలను వైసిపి ప్రభుత్వం ఖర్చు చేసినప్పటికీ, పారిశ్రామికంగా అభివృద్ధి బాటలో నడవడంలేదనే అసంతృప్తికి శుభం కార్డు వేస్తూ రాష్ట్రంలో కొత్తగా సుమారు పదహారు వేలకోట్ల రూపాయల పెట్టుబడితో మూడు మెగా పరిశ్రమలు రాబోతున్నాయనే వార్త కచ్చితంగా జగన్ ప్రభుత్వంలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. జగన్ కు భయపడి పరిశ్రమలు రావడం లేదని ఇన్నాళ్లుగా తెలుగుదేశం చేస్తున్న ప్రచారం కేవలం దుష్ప్రచారమే అని రుజువు చేయబోతున్నది జగన్ ప్రభుత్వం.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దగ్గర ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో చెప్పుల తయారీ పరిశ్రమ, విశాఖపట్నం అచ్యుతాపురం పారిశ్రామిక వాడలో తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయల పెట్టుబడితో టైర్ల పరిశ్రమ, అలాగే విశాఖ జిల్లా మధురవాడలో 14,634 కోట్ల పెట్టుబడితో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటి గ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారని, వాటికి తగిన ఒప్పందాలు ముఖ్యమంత్రి జగన్ప్ర మోహన్ రెడ్డి సమక్షంలో జరిగాయని అంటున్నారు. ఈ మూడు పరిశ్రమల ఏర్పాటు సాకారం అయితే సుమారు నలభై వేలమందికి ప్రత్యక్షంగా, మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కలిగే అవకాశం ఉన్నది.
నిజానికి గత అరవై ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్ర ప్రాంతం పారిశ్రామికాభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురైంది. అన్ని పరిశ్రమలు, పెట్టుబడులు హైద్రాబాద్ లోనే కేంద్రీకృతం చెయ్యడానికి అన్ని ప్రభుత్వాలు శ్రద్ధ వహించాయి. విశాఖ నుంచి చిత్తూర్ వరకు సుమారు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో కనీసం వెయ్యిమందికి ఉపాధి కలిగించే ప్రయివేట్ రంగ పరిశ్రమలే లేవు. ఉపాధి లేకపోవడంతో సీమాంధ్రులు పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై లాంటి మహానగరాలకు వలస వెళ్లారు. వారి కుటుంబాలు అక్కడే స్థిరపడటంతో సీమాంధ్ర కేవలం ఇతర రాష్ట్రాల అభివృద్ధికి బిడ్డలను కని ఇచ్చే యంత్రంగా మారిపోయింది. అధికార యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం పరిశ్రమల స్థాపనకు పెద్ద శత్రువు.
విభాజిత ఆంధ్రప్రదేశ్ కు నారా చంద్రబాబు నాయుడు తొలి ముఖ్యమంత్రిగా పారిశ్రామికంగా సాధించింది ఏమీ లేదు. ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చినప్పటికీ, స్థానిక తెలుగుదేశం నాయకులు కమీషన్లకోసం వారిని పీడించడం, వేధించడంతో అనేకమంది భయపడి వెనక్కు వెళ్లిపోయారు. దావోస్ సదస్సులు, విశాఖ సదస్సులు అంటూ చంద్రబాబు మందీమార్బలంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఐదేళ్లలో నలభై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు, పది లక్షలమందికి ఉపాధి కలిగినట్లు భజన మీడియాతో డప్పు వేయించుకున్నారు. వాస్తవ జగతిలో ఒకటి రెండు చిన్న పరిశ్రమలు తప్ప పెట్టుబడుల వర్షం కురిసిన దాఖాలాయే లేదు. కియా పరిశ్రమ తమ చలువే అని తెలుగుదేశం పార్టీ స్వకుచమర్ధనం చేసుకున్నప్పటికీ, ఆ పరిశ్రమను వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆహ్వానించారని, ఆయన కోరిక మేరకే తాము ఆంధ్రాలో పరిశ్రమ స్థాపించామని సాక్షాత్తూ ఆ కంపెనీ చైర్మన్ ప్రకటించడం తెలుగుదేశం గాలి తీసేసినట్లయింది. ఏమైనప్పటికీ చంద్రబాబు అయిదేళ్ల పాలనలో పారిశ్రామికంగా రాష్ట్రం ఒక శాతం అభివృద్ధిని కూడా సాధించలేదనేది స్పష్టం.
ఏ ప్రభుత్వానికైనా సంపద సృష్టి అనేది ఒక పవిత్రమైన బాధ్యత. పరిశ్రమలన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించకుండా చెన్నై, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మాదిరిగా వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కలిగించే చర్యలు తీసుకుంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. అలాగే అవినీతిని, లంచగొండితనాన్ని నివారించడానికి కఠినచర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకుల జోక్యాన్ని నియంత్రించాలి. పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాలను అందించాలి. ప్రత్యేక హోదా వచ్చే అవకాశం సమీప భవిష్యత్తులో లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని పారిశ్రామికవేత్తల పట్ల ఉదారంగా వ్యవహరించాలి. ఇప్పటికే నాలుగు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాబోయే మూడేళ్ళలో కనీసం రెండు లక్షల మందికి ప్రయివేట్ రంగంలో ఉపాధి చూపించగలిగితే మరో పదేళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తిరుగుండదు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు