ఆటలో అరటిపండుగా మారిన నిమ్మగడ్డ 

Nimmagada Ramesh and YS Jagan
మనబోటి సామాన్య పౌరులు ఎవరైనా ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఒక మంత్రినో లేదా ముఖ్యమంత్రినో..గవర్నర్ నో కలిసి ఏదైనా వినతిపత్రం ఇస్తే వారు దానిమీద “take  necessary action” అని ఎండార్స్మెంట్ రాసి అటెండర్ కు ఇచ్చి పంపిస్తారు.  మనపని అవుతుందా కాదా అనేది తరువాతి విషయం.  ముందు మన  మనసు తృప్తి చెందుతుంది.  అప్పుడే మన పని అయిపోయినట్లే అనుకుని భార్యాపిల్లలకు ఫోన్ చేసి చెబుతాము.  మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటాము.  జేబు కొంచెం బరువుగా ఉంటే మిత్రులకు పార్టీ కూడా ఇస్తాము.    
 
 నిన్న మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఇచ్చిన దరఖాస్తు పై గవర్నర్ స్పందించిన తీరును పైవిధంగానే చూడాలి.  కాకపొతే ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, తన పదవి కోసం  లక్షల రూపాయల ఫీజులను అంతర్జాతీయస్థాయి న్యాయవాదులకు చెల్లిస్తూ ఎనిమిది మాసాలు మిగిలిఉన్న కాలానికి ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కోర్టుల్లో పోరాడుతున్న మహమ్మద్ గజనీ తుల్యుడు కావడంతో “అయ్యా నీ దరఖాస్తును పరిశీలించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తాము” అని ఒక అక్నాలెడ్జ్మెంట్ లాంటి నాలుగు వాక్యాల లేఖను ఇచ్చారు.  దానిమీద సంతకం చేసింది గవర్నర్ కాదు.  పేరు ప్రస్తావించకుండా ఎవరో సంతకం చేశారు.  వాస్తవానికి ఆ లేఖ ఎడమవైపు పైభాగంలో సంబంధిత అధికారి పేరు, హోదా తప్పనిసరిగా ఉండాలి.   అలాగే సంతకం కింద సదరు అధికారి పేరును కూడా ప్రస్తావించి ఉండాలి.  గవర్నర్ ఆఫీసు నుంచి వెళ్లే వందలాది లేఖలను గత నలభై ఏళ్లలో నేను చూసాను.  ఎడిసి (ADC )  రాసినా, ప్రిన్సిపల్ సెక్రటరీ రాసినా,  ఏ అధికారి రాసినా, సదరు అధికారి పేరును లేఖలో  స్పష్టంగా పేర్కొంటారు.  నిన్న నిమ్మగడ్డ ప్రదర్శించిన లేఖలో అలాంటి ప్రస్తావన ఏదీ లేదు.  
 
అయితే, గవర్నర్ ఆఫీస్ నుంచి తనకు రసీదు తరహాలో వచ్చిన లేఖను ఒక అత్యున్నత ఐఏఎస్ అధికారి, సాక్షాత్తూ గవర్నర్ కే ముఖ్యకార్యదర్శిగా చాలాకాలం పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాన్నేదో నోబెల్ బహుమతి స్థాయిలో ఉత్తరాన్ని మీడియాకు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  నిజానికి నిమ్మగడ్డ వ్యవహారం ఇంకా పూర్తిగా తేలలేదు.  దాని విచారణ సుప్రీమ్ కోర్టులో ఉన్నది.  సాధారణంగా సుప్రీమ్ కోర్టులో విచారణలో ఉన్న కేసుల మీద హైకోర్టులు ఆదేశాలు ఇవ్వడం జరగదు.   కానీ, నిమ్మగడ్డ విషయంలో మాత్రం హైకోర్టు “అసాధారణంగా”  స్పందించి నిమ్మగడ్డను వెళ్లి గవర్నర్ ను కలవమని ఆదేశించింది.  తనను కలిసిన నిమ్మగడ్డ విషయం ఏమి చెయ్యాలో  మాత్రం గవర్నర్ కు నిర్దేశం చెయ్యలేకపోయింది.  నిమ్మగడ్డను పునర్నియమించేందుకు రాష్ట్రప్రభుత్వానికి అధికారం లేదని తీర్పు ఇచ్చిన హైకోర్టు “రాష్ట్రప్రభుత్వాన్ని తగిన చర్యలు తీసుకోవలసిందిగా” గవర్నర్ ఆదేశించడాన్ని ఎలా సమర్థిస్తుంది?   అసలు ఎన్నికల కమీషనర్ నియామకానికి,  రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు కదా?  హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ నియామకం చెల్లదు.  ఎందుకంటే ఆయన్ను నియమించింది చంద్రబాబు నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వమే.  ఆ నియామకం చట్టవిరుద్ధం అని కోర్టు ప్రకటించింది కాబట్టి గత నాలుగేళ్లుగా నిమ్మగడ్డ రాష్ట్ర ఖజానా నుంచి పొందిన జీతభత్యాలను, ఇతర సదుపాయాలను  తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పిటీషన్ వేసే వీలు ఉన్నదా?  ఒకవేళ అలాంటి పిటీషన్ వేస్తే దాన్ని కోర్ట్ విచారణకు స్వీకరిస్తుందా?   తాము కేసును విచారిస్తుంటే వెళ్లి గవర్నర్ ను ఎందుకు కలిశావు?  కోర్ట్ ధిక్కారం కింద కేసు నమోదు చేస్తాము” అని రేపు సుప్రీమ్ కోర్ట్  హెచ్చరించింది అనుకోండి.  అప్పుడు నిమ్మగడ్డ ఎక్కడికి పరిగెత్తాలి?  ఎవరిని ఆశ్రయించాలి?  
 
ఇక గవర్నర్ ఆఫీస్ ఇచ్చిన రశీదును పట్టుకుని దాన్నే నియామకపత్రంగా భావిస్తూ పచ్చమీడియా నిన్న చేసిన రాద్ధాంతం, చర్చలు… నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం, పదునాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వ అనుభవం కలిగి వందలాది ఐఏఎస్ అధికారులను కొనగోటితో శాసించిన చంద్రబాబు అత్యుత్సాహంతో “గవర్నర్ రాజ్యాంగాన్ని రక్షించారు…విలువలను కాపాడారు”  అంటూ  కితాబులు ఇవ్వడం చూస్తుంటే…నిమ్మగడ్డ నియామకం మీద తెలుగుదేశం పార్టీ ఎందుకంత  ఉత్సాహం చూపిస్తున్నదో అర్ధం కాదు.  “”రాష్ట్ర  ప్రభుత్వానికి చెంప దెబ్బ,  కోర్ట్ మొట్టికాయలు, ప్రజాస్వామ్యాన్ని  నిలబెట్టిన  గవర్నర్””  అంటూ వెర్రివాగుడు వాడుతున్న వీరిని చూస్తుంటే వీరంతా  కలిసి ఎవరి ప్రయోజనాలకు పాటుపడుతున్నారో, ఎవరి మీద ద్వేషంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారో ఎవరికైనా అర్ధం అవుతుంది.    కమీషనర్ గా ఎవరుంటే తెలుగుదేశం పార్టీకి ఒరిగేది ఏమిటి?   కమీషనర్ గా నిమ్మగడ్డ ఉంటే తమపట్ల పక్షపాతం చూపిస్తాడనే నమ్మకమేనా?     లేదా తమ సామాజికవర్గం వాడిని తొలగించడం పట్ల కక్షతోనా?   మరొక అధికారి ఎన్నికల కమీషనర్ గా ఉంటే తెలుగుదేశం వారు ఎన్నికల్లో పోటీ చెయ్యరా?   
 
ఇంతకూ గవర్నర్ తన లేఖలో ఏమి రాశారు?  ఆ లేఖ నిమ్మగడ్డను ఉద్దేశించి రాసిందే తప్ప ప్రభుత్వానికి రాసింది  కాదు.  కాబట్టి ప్రభుత్వానికి ఆయన రాసిన లేఖలో కంటెంట్ ఏముందో మనకు తెలియదు.  హైకోర్టు ఆదేశాల ప్రకారం మళ్ళీ నియమించాలని రాశారా?  అలాంటి అధికారం ప్రభుత్వానికి లేనపుడు గవర్నర్ ఆదేశాలు చెల్లవు కదా?  ఒకవేళ నిమ్మగడ్డను నియమిస్తూ లేఖ రాయమని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారనుకుందాము.  ముఖ్యమంత్రి కింద పనిచేసే ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి అనుమతి లేకుండానే నిమ్మగడ్డకు లెటర్ రాసే సాహసం చెయ్యగలరా?  
 
ఈ చిక్కుముడులను పరిష్కరించే అధికారం ఒక్క సుప్రీమ్ కోర్టుకు మాత్రమే ఉన్నది.  సుప్రీమ్ కోర్ట్ ఇచ్చే తీర్పు దేశం మొత్తానికి వర్తిస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వచ్చినపుడు గవర్నర్లు, ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో సుప్రీమ్ కోర్ట్ తన తుదితీర్పులో నిర్దేశించాలి.  అంతవరకు ఎదురు చూడక తప్పదు.  
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు