బహుశా గత మూడు దశాబ్దాల్లో ఒక అధికారిని పదవి నుంచి తొలగించడంపై ఇంత గందరగోళం సంభవించి ఉండదు. ప్రస్తుతం మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉదంతం అనేక ఆసక్తికరమైన సంఘటనలకు నాంది పలకటమే కాకుండా ప్రజల్లో, మీడియాలో చర్చనీయాంశంగా మారడం పెద్ద విచిత్రంగా చెప్పుకోవచ్చు. అలాగే ఒక అధికారి తొలగింపుపై ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం తరపున దాదాపు వకాల్తా పుచ్చుకున్నట్లుగా రెండు మూడు పచ్చ ఛానెల్స్, పత్రికలు మరో పనే లేనట్లు గత రెండు మాసాలుగా పచ్చచొక్కాలు వేసుకున్న నాయకులు, విశ్లేషకులతో చర్చోపచర్చలు అనంతంగా నిర్వహిస్తూ మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవిలో కూర్చోబెట్టడమే తమ లక్ష్యం అన్నట్లుగా శ్రమించడం, అందుకోసం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అభాసుపాలు చెయ్యడానికి ఎంత దిగజారుడుతనానికైనా తెగించడం చూస్తుంటే మన మీడియా ఎంతటి కలుషితకాసారం అయిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.
Read More : కరోనా: బచ్చన్ ఫ్యామిలీలో ఆ నలుగురు సేఫేనా?
వీళ్లకు తగినట్లే హైకోర్టు, సుప్రీమ్ కోర్టులు కూడా నిమ్మగడ్డ పిటీషన్ ను ఆగమేఘాల మీద విచారణకు చేపట్టడం, తీర్పులు ఇవ్వడం కూడా చూపరులకు నిబిడాశ్చర్యం కలిగించే వింత. దశాబ్దాలుగా వేలాది కేసులు విచారించే న్యాయమూర్తుల కొరతతో పెండింగ్ లో ఉండగా, నిమ్మగడ్డ కేసు విచారణ యుద్ధప్రాతిపదికన చెయ్యకపోతే దేశం మొత్తం మునిగిపోతుందేమో అన్నంత హడావిడిగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం, దానిమీద పత్రికల్లో, టీవీ ఛానెల్స్ లో చర్చలు జరగడం, తీర్పులకు ఎవరికి తోచిన భాష్యాలు వారు చెప్పుకోవడం, ఎవరికి అనుకూలంగా వారు అన్వయించుకోవడం గందరగోళానికి దారి తీస్తున్నది. పోనీ, న్యాయస్థానాలు ఏమైనా ఈ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చి ఈ వివాదానికి ముగింపు పలుకుతాయేమో అని చూస్తుంటే అది కూడా జరగడం లేదు. ఇటీవలనే తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత విషయంలో హైకోర్టు, సుప్రీమ్ కోర్ట్ కూడా ప్రభుత్వ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోలేము అని విస్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. దాంతో ప్రభుత్వం తన పనిని తాను నిర్విఘ్నంగా చేసుకోగలుగుతున్నది. కానీ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇలా జరగడం లేదు.
Read More : ఏపీలో కాక రేపుతోన్న జిల్లాల కసరత్తు!
గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమీషనర్ ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఒకవంక లేదని చెబుతూనే నిమ్మగడ్డను మళ్ళీ అదే పదవిలో పునఃప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా సంభవం అవుతుందో తెలియదు. అయితే రాష్ట్రప్రభుత్వం అందుకు సుముఖంగా లేదు. సుప్రీమ్ కోర్టుకు వెళ్ళింది. అయితే అక్కడ కూడా ప్రభుత్వానికి ఊరట లభించలేదు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది. ఆ ప్రకారంగా చూసుకున్నా నిమ్మగడ్డను తిరిగి నియమించే అధికారం లేని రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను మళ్ళీ నియమించే ప్రసక్తే ఉండదు కదా.
Read More : ట్రైలర్ టాక్: డర్టీ హరి డర్టీ వేషాలు పీక్స్
ఈలోపలే నిమ్మగడ్డ ప్రభుత్వం మీద కోర్ట్ ధిక్కార పిటీషన్ ను వేశారు. దానిమీద నిన్న హైకోర్టు మరీ విచిత్రంగా స్పందించింది. వెళ్లి గవర్నర్ ను కలుసుకోమని నిమ్మగడ్డను సూచించింది! ఎందుకు? గతంలో నిమ్మగడ్డను మళ్ళీ నియమించాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా? మరి ఈసారి గవర్నర్ ను కలవమని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? గతంలో తాము ఇచ్చిన తీర్పు పొరబాటని కోర్ట్ భావించిందా? రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను నియమించాల్సింది గవర్నర్ అయినపుడు మరి గత తీర్పులో ప్రభుత్వాన్ని ఎందుకు ఆదేశించింది? నిన్నటి హైకోర్టు తీర్పును బట్టి చూస్తే తామిచ్చిన గత తీర్పు తప్పని హైకోర్టు అంగీకరించినట్లు కాదా? ఈ విషయంలో ప్రభుత్వం కోర్ట్ ఆదేశాల ప్రకారమే నడచుకుందని స్పష్టం అవుతుంది. ఎన్నికల కమీషనర్ ను నియమించే హక్కు, అధికారం తమకు లేవని స్పష్టం చేసిన తరువాత నిమ్మగడ్డను మళ్ళీ ఎలా నియమిస్తారు? కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కోర్టుకు జవాబు ఇవ్వాల్సిన పనే లేదు.
ఇక గవర్నర్ విషయానికి వద్దాం. పేరుకు పరిపాలన గవర్నర్ మీద నడుస్తుంది తప్ప అసలైన పాలన ప్రజలెన్నుకున్న ప్రభుత్వం మీదనే ఉంటుంది. ప్రభుత్వాన్ని కాదని గవర్నర్ సొంతంగా ఏమి చెయ్యగలరు? మొన్ననే తెలంగాణాలో చూసాము. సమీక్షకు రమ్మని గవర్నర్ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని ఆదేశిస్తే వారు వెళ్ళలేదు. గవర్నర్ ఏమి చేయగలిగారు? స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే బాధ్యత, అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది తప్ప గవర్నర్ చేతిలో కాదు. ఎన్నికల కమీషనర్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేయాలి తప్ప సొంతంగా ఏమీ చెయ్యలేడు. గతంలో చంద్రబాబు పదునాలుగేళ్ళు పాలించినా, ఏనాడూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించిన పాపాన పోలేదు. మరి కోర్టులు, ఎన్నికల కమీషనర్లు, గవర్నర్లు ఏమి చేయగలిగారు? ఇక మరో ప్రశ్న ఏమిటంటే, నాకు తెలిసినంతవరకూ రాజ్యాంగం ప్రకారం కోర్టుల కన్నా గవర్నర్ హోదా పెద్దది. గవర్నర్ ను కోర్టులు ఆదేశించగలవా? గవర్నర్ కోర్టులకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేనే లేదు. కోర్ట్ ఆదేశాలను పాటించాల్సిన అగత్యం గవర్నర్ కు లేదు. గవర్నర్ కాకముందు అతనిమీద ఎంత పెద్ద కేసులు ఉన్నప్పటికీ, ఆ పదవిలో ఉండగా అతని మీద విచారణ జరపడానికి వీల్లేదని కళ్యాణ్ సింగ్ వ్యవహారంలో మనం కళ్లారా చూశాము.
Read More : సమూహ వ్యాప్తికి సమయం ఆసన్నం!
ఇక నిమ్మగడ్డను నియమించకపోతే దేశం అల్లకల్లోలం అవుతుందని, రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని, రాష్ట్రపతి పాలన విధించాల్సివస్తుందని కొన్న పచ్చకామెర్లు కమ్మిన క్షుద్రచానెళ్లు చావుకేకలు పెడుతూ తమ స్వామిభక్తిని చాటుకుంటున్నాయి! కోర్ట్ ఆదేశం పాటించకపోతే ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? ఎవరు అంగీకరించేది? అంతటి అధికారం కోర్టులకు ఉంటె, ఇక ప్రజాప్రభుత్వాలు, ఎన్నికలు అనవసరం. పరిపాలన మొత్తం కోర్టులకు అప్పగించి రాజకీయనాయకులు ఇంట్లో కూర్చుని అష్టాచెమ్మా ఆడుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమనిర్ణయం. ప్రజలు ఎన్నుకున్నవారి మాటే శిలాశాసనం!
అంతిమంగా చెప్పాల్సింది ఏమిటంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలచుకోకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమీషన్ ఆఫీసులో పాదం కూడా మోపలేడు!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు