“చాయిస్ ఈజ్ యువర్స్” అంటున్న జగన్… తెరపైకి కొత్త కోణం!

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో శనివారం వైఎస్సార్‌ రైతు దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 2022 ఖరీఫ్‌ లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల అకౌంట్లలో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయా వర్గాల్లో తెగ చర్చ నడుస్తుంది.

ఎన్నికల్లో ఓట్లు అడిగే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందని అంటుంటారు పరిశీలకులు. ముఫ్ఫై నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తులు కూడా.. మరో అవకాశం ఇస్తే ఆ పనులు చేస్తాం ఈ పనులు చేస్తాం అంటూ ఇంతకాలం చేయని పనులను చూపిస్తూ, తమ చేతకాని తనాన్ని బహిర్గతం చేస్తూ నిస్సుగ్గుగా ఓట్లడుగుతుంటారని అంటుంటారు. ఈ సమయంలో జగన్ అడిగే విధానంపై కొత్త కొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.

గత సభల్లో… తన పాలనలో లబ్ధిపొందితేనే, తన పాలనలో సంతృప్తిగా ఉంటేనే తనకు ఓటు వేయండనే స్థాయిలో జనాలను ఓట్లు అడిగేవారు జగన్. ఇది స్వచ్చమైన రాజకీయాలు చేసే వారు మాత్రమే ఎంచుకునే శైలి అని అప్పట్లో కామెంట్లు వినిపించేవి. ఇందులో భాగంగా తాజాగా మరోసారి మరింత స్పష్టంగా ఓట్లు అడుగుతూ… ప్రజలకు చాయిస్ ఇచ్చేటంత సాహసం చేశారు జగన్. దీంతో.. ఇది తనపాలనై తనకున్న నమ్మకం అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఈ సందర్భంగా ప్రసంగించిన జగన్… చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారని.. ఇప్పుడు మాత్రం చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుచేసిన జగన్… చంద్రబాబు ఏకంగా కరువును పారద్రోలాడని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 నిసిగ్గుగా అసత్యాలు రాశాయని సీఎం జగన్ ఫైరయ్యారు.

అనంతరం… చుక్కల భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించామని.. పశువుల కోసం 340 అంబులెన్స్‌ లు ఏర్పాటు చేశామని తెలిపిన ఆయన… పాడి రైతులకు ఆదాయం వచ్చేలా అమూల్‌ ను తీసుకొచ్చామని తెలిపారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగినా ఆ సీజన్‌ ముగియక ముందే పరిహారం అందిస్తున్నామని తెలిపిన జగన్… సున్నా వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇలా తన హయాంలో జరుగుతున్న రైతు మేలులను స్పష్టం చేశారు.

అనంతరం ప్రజల ముందు జగన్ కొన్ని ప్రశ్నలు ఉంచారు.

మనకు పాడి పంటలు ఉండే పరిపాలన కావాలా? లేక, నక్కలు, తోడేలు ఉండే పాలన కావాలా?

రైతు రాజ్యం కావాలా? లేక, రైతులను మోసం చేసే పాలన కావాలా?

రైతుకు తోడుగా ఆర్బీకే వ్యవస్థ కావాలా? లేక, దళారీ వ్యవస్థ కావాలా?

పేదల ప్రభుత్వం కావాలా? లేక, పెత్తందారుల ప్రభుత్వం కావాలా?

అని తనదైన శైలిలో ప్రశ్నించిన జగన్… ఏ ప్రభుత్వం కావాలో, ఎలాంటి పాలనకావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.