ఇది సామాన్యుడి విజయం

దాదాపు కేంద్రమంత్రులు అందరినీ, ఎంపీలను, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కదనరంగంలోకి దింపారు.   గత అయిదేళ్ల పాలనలో తాము దేశానికి ఒరగబెట్టాము, తమ పాలనలో సామాన్యప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో మాత్రం భాజపా చెప్పుకోలేకపోయింది.   పరిస్థితి తమకు అనుకూలంగా లేదని గ్రహించిన తరువాత సెంటిమెంట్ అస్త్రాలను బయటకు తీశారు.  పాకిస్తాన్ మదాన్ని దించుతామని బీరాలు పలికారు.   రామమందిరాన్ని నిర్మిస్తామని వాచాలత  ప్రదర్శించారు.  ఎప్పుడో ముప్ఫయి ఏళ్లనాటి తుప్పుపట్టిన ఆ అస్త్రాలు నేటి ఆధునిక యుగంలో నిర్వీర్యం అయిపోయాయని భాజపా పెద్దలు గ్రహించలేదు.   నేటి కాలానికి కావలసింది సామాన్యులకు  అందుబాటులో ఉండాల్సినవి  విద్య, వైద్యం, ఉద్యోగం, మౌలిక సదుపాయాలు,  అభివృద్ధి అనే సూక్ష్మాన్ని మరచారు.   అయిదేళ్ల పాలనలో దేశ ఆర్థికవ్యవస్థను సర్వనాశనం చేసిన భాజపా ఏమి చెప్పి ఓటర్లను ఒప్పించగలడు?  
 
ఇక కాంగ్రెస్ పరిస్థితి మరీ అధ్వాన్నం.  రాహుల్ నాయకత్వ వైఫల్యం ఆ పార్టీకి పెద్ద శాపం.   నెహ్రు-గాంధీ కుటుంబ కబంధ హస్తాల నుంచి బయటపడనంత కాలం  కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం అనుమానమే.  లేకపోతె…షీలా దీక్షిత్ నాయకత్వంలో పదిహేనేళ్లపాటు అప్రతిహతంగా ఢిల్లీ గద్దె ఎక్కిన కాంగ్రెస్, వరుసగా రెండుసార్లు ఢిల్లీ శాసనసభలో ఒక్క స్థానం కూడా సాధించలేకపోయిందంటే అంతకన్నా ఘోరం మరేముంటుంది?  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వరుసగా రెండుసార్లు జీరో మార్కులు సాధించింది అంటే రాష్ట్రాన్ని విభజించడమే కారణం అని చెప్పుకుంటున్నారు.  మరి ఢిల్లీ సంగతి ఏమిటి?  భారతదేశాన్ని అర్ధ శతాబ్దం పాటు పరిపాలించిన పార్టీ దేశరాజధానిలోనే మట్టి కరిచిందంటే ఆ పార్టీని సంపూర్ణ ప్రక్షాళన గావించాల్సిన అవసరం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.  
 
కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారాన్ని సాధించిన  భాజపాను చిత్తు చేసారని కాంగ్రెస్,  కాంగ్రెస్ కు 63 చోట్ల డిపాజిట్లు పోయాయని భాజపా సంబరాలు చేసుకుంటున్నారు.  అంతే తప్ప తమను ఓటర్లు ఎందుకు మట్టి కరిపించారో ఆత్మవిమర్శ చేసుకోవడానికి వెనుకాడుతున్నారు.  నాకు రెండు కళ్ళు పోయినా సరే, అవతలివాడి ఒక కన్ను పోవాలి అన్నట్లుగా భాజపా, కాంగ్రెస్ రాజకీయాలు నడుపుకుంటే వారిగోతులు వారే తవ్వుకుంటున్నట్లు లెక్క.    
 
కాంగ్రెస్ ఏనాడో నాశనమైపోయింది.  సోనియా-రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పడం కష్టం.  కానీ, దేశాన్ని ఏలుతున్న భాజపా తన సర్వశక్తులను మోహరించినా కనీసం గౌరవప్రదమైన రెండంకెల స్థానాలను ఎందుకు సాధించలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవడం ఆవశ్యం.  మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను కైవసం చేసుకున్న భాజపా ఏడాది తిరగకుండానే ఇంతటి అవమానకరమైన పరాజయాన్ని ఎదుర్కోవడం ఏమిటి?  ఏ పార్టీలో అయినా, గెలిస్తే ఆ విజయాన్ని అధినాయకుడికి ఆపాదించి భజనలు చెయ్యడం, ఓడితే స్థానిక నాయకుల నిర్లక్ష్యం అంటూ నిందించడం మనదేశంలో అన్ని పార్టీల్లో ఉన్న ఒక మాయరోగం.  భాజపా కూడా అందుకు మినహాయింపు కాదు.  ఢిల్లీలో భాజపా విజయం సాధించి ఉన్నట్లయితే అందుకు కారణం నరేంద్ర మోడీ, అమిత్ షా యే అంటూ భాజపా శ్రేణులు రెచ్చిపోయి ఉండేవి.  కానీ, పరాజయానికి మాత్రం ఒక చిన్న నాయకుడిని బాధ్యుడిని చేసి పదవికి రాజీనామా చేయించారు.     
 
రామమందిరాలు, పాకిస్థాన్లు భాజపాను గెలిపించబోవని ఢిల్లీ ఎన్నికలు రుజువు చేసాయి.  అసెంబ్లీ ఎన్నికలు వేరు…పార్లమెంట్ ఎన్నికలు వేరు అని సమాధానపరుచుకోవడం ఆత్మవంచన మాత్రమే.  అదే నిజమైతే మరి దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలలోనూ ప్రాంతీయపార్టీలే అధికారంలో ఉండాలి.  మరి బీజేపీ మొన్నమొన్నటివరకూ ఇరవై రాష్ట్రాలలో అధికారంలో ఎలా ఉండగలిగింది?  అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో విజయాన్ని ఎలా సాధించింది?  
 
ఏమైనప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టి ఒక చరిత్ర నెలకొల్పారు.  ఆమ్ ఆద్మీ అనిపించుకున్న కేజ్రీవాల్ సామాన్య ప్రజలకు ఏమి కావాలో తన పాలనలో వాటినే చేసారు.  ఎలాంటి ఆర్భాటాలు, ఆడంబరాలు, చుట్టూ రెండొందలమంది పోలీసులు లేకుండా, సామాన్యుల్లో కలిసిపోయారు.  ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా అందాయి.  అందుకనే వరుసగా రెండోసారి కూడా తన పార్టీకి అరవై సీట్ల మార్కును దాటించగలిగారు!  ఇది సామాన్య విజయం కాదు…కానీ సామాన్యుడి విజయం!!
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు