అంతా మన మంచికే – న్యాయాన్యాయాలు గ్రహించలేనంత అవివేకులు కారు ప్రజలు

YS Jagan Mohan Reddy
 
అనగనగా ఒక రాజు.  ఆయన ఒకరోజు తన వృద్ధమంత్రితో కలిసి వేటకోసం అడవికి వెళ్ళాడు.  అక్కడ ఆయన ఒక అడవి పంది ఎదురు రాగా దానిని గురిచూసి బాణం వేశాడు.  ఆ అడవిపంది ఒక్కసారిగా రాజు మీదకు లంఘించి ఆయన భుజాన్ని గాయపరిచి మరణించింది.  రాజుగారి భుజం నుంచి రక్తస్రావం అవున్నది.  మంత్రి గారు రాజు భుజానికి కట్టు కడుతూ “ఊరడిల్లండి మహారాజా…అంతా మన మంచికే”  అని ఓదార్చాడు.  
 
YS Jagan faces setback in High Court
 
ఆ మాటలు విన్న రాజుగారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.   తాను భుజం నొప్పితో అల్లాడిపోతుంటే అది మన మంచికే అని మంత్రి వ్యాఖ్యానించడం పట్ల మండిపడ్డాడు.  ఆ ప్రదేశంలో తన కోపాన్ని బయటకు ప్రదర్శిస్తే బాగుండదని నిగ్రహించుకుని రాజధానికి వెళ్లిన తరువాత మంత్రికి శిరచ్ఛేదం చేయించాలని మనసులో నిర్ణయించుకున్నాడు.  భుజానికైన గాయం  సలుపుతుండగా వేటకు స్వస్తి చెప్పి తిరుగుముఖం పట్టాడు.  మంత్రిగారిని ముందుగా రాజధానికి చేరుకొని వైద్యులను సిద్ధం చెయ్యమని ఆదేశించాడు. 
 సరే అని మంత్రిగారు తన గుర్రం మీద వాయువేగంతో రాజధానికి బయలుదేరారు. కొంతదూరం ప్రయాణించాక రాజుగారికి విశ్రాంతి తీసుకోవాలనిపించింది.  ఒక చెట్టు కింద విశ్రమించాడు.
 
అంతలో భయంకరమైన గర్జన వినిపించింది.  రాజుగారు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా చింతనిప్పులు కక్కుతూ ఒక సింహం కనిపించడంతో గుండె ఆగినంత పనయింది.  చేతిలో ఆయుధాలు లేవు.  ఉన్నా భుజం నొప్పితో చేయి ఎత్తడానికి కూడా వీలు లేదు.  సింహం రాజుగారి దగ్గరకు వస్తుండటంతో రాజుగారు భయంతో వణికిపోతూ ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి అచేతనంగా ఉండిపోయారు.  సింహం రాజు మీద పంజా ఎత్తబోతూ బుజం నుంచి రక్తం కారుతుండటం గమనించి వాసన చూసి వెళ్ళిపోయింది.  
 
రాజుగారు మ్రాన్పడిపోయి ఒక్క ఉదుటున లేచి తురగాన్ని అధిరోహించి మనోవేగంతో ఇంటిబాట పట్టారు.  కోటకు చేరుకునేసరికి అక్కడ రాజవైద్యులతో సిద్ధంగా ఉన్నాడు మంత్రి.  మంత్రిగారిని గుర్రుగా చూస్తూ  సింహం తనను చంపకుండా వెళ్లిపోయిన సంగతి వైద్యులకు చెప్పాడు రాజు.  “మహారాజా…సింహానికి స్వయంగా వేటాడి చంపి తినడమే సహజ లక్షణం.  గాయపడిన జీవాన్ని సింహం ముట్టుకోదు.  మీ బుజం మీద గాయాన్ని చూసి మరొక జంతువు తమరిని చంపిందని భావించి ఎంగిలిని ముట్టుకోవడం తన లక్షణం కాదు కాబట్టి వెళ్ళిపోయింది.  ఆ ఆడవిపంది మీమీద దాడి చెయ్యడం, ఫలితంగా   మీ భుజం మీద గాయం కావడం మీకు మంచిదే అయింది.  అందుకే ఏది జరిగినా “అంతా మన మంచికే” అంటారు పెద్దలు”  చెప్పి వైద్యం మొదలుపెట్టారు.  
 
రాజుగారు వృద్ధమంత్రి వైపు చూశారు.  రాజుగారి నయనాలలో కదలాడుతున్న అశ్రువులను మంత్రి గమనించాడు.  మంత్రిగారిని ఆప్యాయంగా  హత్తుకుని నమస్కరించాడు రాజు.   
 
****
  • నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడానికి వీల్లేదంది న్యాయస్థానం.
  • ఇంగ్లిష్ మీడియం పనికిరాదన్నది 
  • ఒక నైతికహీనుడిని మళ్ళీ పదవితో సత్కరించాలని ఆదేశించింది.
  • ఒక నరహంతకవైద్యుడి మీద చర్యలు తీసుకోవడానికి ససేమిరా అన్నది
  • ముఖ్యమంత్రిని నీచమైన భాషలో తిట్టిన ఒక డాక్టర్ విషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టడమే కాక ఏకంగా సిబిఐ విచారణకు కూడా ఆదేశించింది. 
  • అభివృద్ధిని వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే ఠాట్ వీల్లేదంది…
  • జగన్ ఏ పనిచేసినా భవిష్యత్తులో కూడా అది ముందుకుపోదు.  ఆ సంగతి జగన్ కూ తెలుసు.  
ఒకటి కాదు…రెండు కాదు…ప్రజల సంక్షేమం కోసం జగన్ చేసే ప్రతి పనినీ న్యాయస్థానం అడ్డుకుంటున్నది అనే అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది.  దానివెనుక ఎవరున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారు.  ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా న్యాయం, తీర్పులు వెలువడుతుండటాన్ని ప్రజలు పరిగణనలోకి తీసుకుంటున్నారు.  ఒకేరోజు ఒకే కేసులో రెండు కోర్టులు రెండు రకాల తీర్పులు ఇవ్వడాన్ని వారు అర్ధం చేసుకున్నారు.   న్యాయాన్యాయాలు గ్రహించలేనంత అవివేకులు కారు ప్రజలు.  జగన్ కు వ్యతిరేకంగా వచ్చే ఒక్కొక్క తీర్పు ప్రత్యర్థుల శవపేటికలకు సుత్తితో కొడుతున్న ఒక్కొక్క ఇనుప  మేకు!!
 
సమయం వచ్చినపుడు కీలెరిగి వాతలు పెడతారు.  అవతలివారి పక్షాన సాంకేతికన్యాయం ఉండొచ్చు.  కానీ, జగన్ పక్కన నైతిక న్యాయం, ప్రజామద్దతు పుష్కలంగా ఉన్నది.  స్వీయ సమాధులు తవ్వుకునేవారికి సానుభూతి లభించదు.  కొందరు వ్యక్తుల కోసం వ్యవస్థలను బలిచేయ్యడం ప్రజలు సహించరు.  పాపప్రక్షాళన జరిగి తీరుతుంది.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు