న్యాయనిర్ణయంలో తొందరపాటు అనర్ధాలకు దారితీస్తుంది

వైసిపి భీష్మాచార్యుడు, ప్రముఖ ఆడిటర్, మేధావిగా ఖ్యాతి గడించిన రాజ్యసభ సభ్యులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ప్రముఖ ఆంగ్లదినపత్రిక దక్కన్ క్రానికల్ లో మూడు రోజుల క్రితం ఒక ఆసక్తికరమైన సంపాదకీయ వ్యాసాన్ని రచించారు. న్యాయవ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న అస్తవ్యస్త స్థితి పట్ల ఆయన తన ఆవేదనను వ్యక్తపరిచారు. “వందమంది దోషులు తప్పించుకున్నప్పటికీ, ఒక్క నిర్దోషిని శిక్షించరాదు” అనే బెంజిమన్ ఫ్రాంక్లిన్ సూక్తిని ఉటంకిస్తూ రాజకీయవ్యవస్థలో పట్టుకుని పోయిన నేరచరితులను ఒక సమయనిర్బంధాన్ని విధించి శిక్షించాలని కొందరు చేస్తున్న ప్రయత్నాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, ఇలాంటి సున్నితమైన అంశాల్లో హడావిడిగా విచారణ చెయ్యడం, శిక్షలు ఖరారు చెయ్యబూనడం బెంజిమన్ ఫ్రాంక్లిన్ స్ఫూర్తికి విరుద్ధం అని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి గారు.

 

సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా ఇటీవల ఒక నివేదికను సమర్పిస్తూ ప్రజాప్రతినిధుల్లో ప్రస్తుత దినం వరకు 4859 మందిపై విచారణలు పెండింగ్ లో ఉన్నాయని తెలియజేశారు. ఆ నివేదిక ఆధారంగా పెండింగ్ లో ఉన్న కేసులను ఒక్క సంవంత్సరంలోగా విచారణలు చేసి శిక్షలు విధించాలని దేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీమ్ కోర్ట్ ఆదేశించడం మనకు తెలిసిందే. అయితే ఒక చిన్న జేబుదొంగతనం కేసు విచారణ కూడా దశాబ్దాలు పడుతున్న ఈ రోజుల్లో ఒక వ్యవస్థలోని అయిదువేలమందిని విచారించి శిక్షించడం సాధ్యం అవుతుందా? ఈ హడావిడి విచారణలో నిర్దోషులకు తమ వాదన వినిపించుకునే అవకాశం, అవసరమయితే పై కోర్టులకు అపీల్ చేసుకునే సమయం కూడా లేకుండా శిక్షలు ఫైనలైజ్ చెయ్యడం వలన మరిన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదా అని విజయసాయి రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు.

ఒక నిందితుడిపై మోపిన ఆరోపణలను రుజువు చెయ్యడానికి పోలీసు వ్యవస్థ ఎంతో కృషి చెయ్యాల్సి వస్తుంది. సాక్ష్యాలు, ఆధారాలు సేకరించాలి. ఇంకా అవసరమైన చోట వందలమందిని కలిసి వివరాలు సేకరించాలి. ఛార్జ్ షీట్లు తయారు చెయ్యాలి. కోర్టుకు నివేదించాలి. ఈ మధ్యలో రాజకీయ ఒత్తిడులు ఉంటాయి. వీటన్నింటిని అధిగమించి కేసు కోర్టులో విచారణకు వచ్చాక న్యాయవాదులు తమ వాదనలతో కోర్టును సైతం తికమకలకు గురి చేస్తారు. ఒక కోర్టులో నేరం రుజువై శిక్ష పడితే, పైకోర్టు దాన్ని కొట్టేసి నిందితులను విముక్తి కల్పించే అవకాశం మన వ్యవస్థలో ఉన్నది. దానికి తోడు మనకు న్యాయస్థానాల కొరత, న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉన్నది. ఫలితంగా 2018 వరకు ఇరవై ఎనిమిదివేల విచారణకు గాను కేవలం ఇరవై రెండు శాతం కేసులు మాత్రమే ఏడాది కాలంలోపల పరిష్కారం అయ్యాయి. నలభై రెండు శాతం కేసుల పరిష్కారానికి మూడేళ్లకు పైగా పట్టింది.

మరొక చేదు వాస్తవం ఏమిటంటే, మన న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువ. ప్రతి పది లక్షలమంది జనాభాకు కేవలం పందొమ్మిది మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం మనకు ఇంకా 5700 మంది న్యాయమూర్తుల అవసరం ఉన్నది. న్యాయమూర్తుల కొరత, తక్కువ సమయం పనిచేసే కోర్టులు, సెలవులు ఎక్కువగా తీసుకుంటున్న వైనం, సుదీర్ఘమైన విచారణలు మొదలైన అంశాల కారణంగా న్యాయం చాలా ఆలస్యంగా జరుగుతున్నది. మహిళలు, పిల్లలపైన జరుగుతున్న క్రూరమైన అత్యాచారాలను విచారించడానికి కూడా తగు సమయం సరిపోవడం లేదు.

ఇటీవల శాసనవ్యవస్థ కూడా నేరాలను విచారించడానికి, శిక్షలు వెయ్యడానికి కూడా నిర్ణీత గడువు ఉండాలని వాదిస్తున్నది. అయితే ఇది సాధ్యం అవుతుందా? తొందరపాటు విచారణలు జరుపుతూ పొరపాటున తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ ఫలితాన్ని అనుభవించే నిర్దోషులకు వారు అనుభవించిన మానసిక వేదనకు ఎవరు పరిహారం చెల్లిస్తారు?

సత్వర న్యాయం కావలనడం సంతోషమే. కానీ దానికి తగిన వనరులను అందుబాటులోకి తేవాలి. న్యాయస్థానాలను , న్యాయమూర్తులను ఇంకా ఎక్కువగా నియమించి పనిభారం, ఒత్తిడులు తగ్గించాలి. న్యాయమూర్తులు ప్రశాంతచిత్తంతో ఆలోచించి తీర్పులు ఇచ్చినపుడే నిర్దోషులు ధైర్యంగా అన్యాయం నుంచి తప్పించుకోగలరు.

(ఇది విజయసాయిరెడ్డి గారి వ్యాసానికి అనువాదం కాదు. వారు ఉటంకించిన కొన్ని అంశాలను ఆధారంగా తీసుకుని ఈ రచయిత వెలిబుచ్చిన అభిప్రాయం మాత్రమే)

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు