‘గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు..’ అని వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించడంతో, ఆ వెంటనే గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ, విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని ఖండించేశారు. ‘గంటా శ్రీనివాసరావు మా పార్టీలో చేరడానికి కొన్ని ప్రతిపాదనలు పంపారు.
అంతిమంగా ఎవరైనా పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి వుండాలి..’ అని విజయసాయిరెడ్డి చెప్పగా, అలాంటి ప్రతిపాదనల గురించి తనకు తెలియదనీ, అసలు తాను పార్టీ మారడంలేదనీ, విజయసాయిరెడ్డి ఆ ప్రతిపాదనలేంటో చెప్పాలని సవాల్ విసిరేశారు గంటా శ్రీనివాసరావు. ‘గంటా ఒకవేళ వైసీపీలోకి వచ్చినా, ఆయన కోసం ఇంకొకరి పదవిని తొలగించేది లేదు’ అని విజయసాయిరెడ్డి అన్నారు తప్ప, గంటా శ్రీనివాసరావుకి సంబంధించిన ప్రతిపాదనల్ని మాత్రం బయటపెట్టలేదు. దాంతో, ప్రస్తుతానికి విజయసాయిరెడ్డి మీద గంటా శ్రీనివాసరావుది పై చేయిగా మారింది. అయితే, తెరవెనుకాల గంటా శ్రీనివాసరావు మాత్రం వివిధ పార్టీలతో సంప్రదింపులు చేస్తూ, సరైన వేదిక కోసం, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఆఖరికి జనసేన పార్టీ కూడా గంటా ప్రతిపాదనల్ని పక్కన పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా గంటా శ్రీనివాసరావుని లెక్క చేయడంలేదు. అలాంటప్పుడు, గంటా విషయంలో వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారో అర్థం కావడంలేదని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు. గంటా చెప్పినట్లు విజయసాయి మైండ్ గేమ్ ఆడుతున్నారనీ, అయితే అది బెడిసి కొట్టిందన్నది విశాఖ వైసీపీలో ఓ వర్గం బలంగా నమ్ముతోంది. జీవీఎంసీ ఎన్నికల వేళ గంటా శ్రీనివాసరావు విషయంలో తొందరపడి స్పందించినట్లయ్యిందనీ, ఇది పార్టీ ప్రతిష్టతను దిగజార్చిందని వైసీపీలో కొందరు విజయసాయిరెడ్డి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారట.