పంచాయితీ ఎన్నికల పేరుతో ఉద్యోగాల ప్రాణాల్ని పణంగా పెట్టడం భావ్యం కాదని ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుని నిరసిస్తూ. అయితే, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు.. ఇలా వివిధ రకాల ఎన్నికలు జరిగినా, కరోనా తీవ్రత ఆయా రాష్ట్రాల్లో అంతలా పెరిగింది లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. నిజానికి, ఉద్యోగులు సంక్షోభ సమయంలో తమ సత్తాని చాటేందుకు పంచాయితీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వుండాలి. అయితే, రాష్ట ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలకు సుముఖంగా లేదు. కరోనా ప్రభావం, కరోనా వ్యాక్సినేషన్ వంటి అంశాల్ని తెరపైకి తెస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. మరోపక్క, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తనకున్న విశేషాధికారాల్ని ఉపయోగిస్తూ, ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసేసింది. దాంతో, ఉద్యోగులకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. అయితే, ఉద్యోగులు ఇంతలా అధికార పార్టీ తరఫున మాట్లాడటానికి బలమైన కారణం కూడా లేకపోలేదు. ఎన్నికల కమిషన్ అధికారాలు, ఎన్నికలు జరుగుతున్నంత కాలానికే పరిమితం.
ఆ తర్వాత ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. ఇదే ఉద్యోగ సంఘాల నేతలకు అసలు సమస్యగా మారింది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఉద్యోగ సంఘాలపై అధికార పార్టీ పెత్తనం అనేది సుస్పస్టం. చంద్రబాబు హయాంలోనూ ఇదే చూశాం.. ఇప్పుడూ అదే చూస్తున్నాం. అయితే, కరోనా నేపథ్యంలో పదుల సంఖ్యలో సహచర ఉద్యోగుల్ని కోల్పోయామనీ, వ్యాక్సినేషన్ ముగిశాకనే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి వీలవుతుందని చెబుతున్న ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యల్ని మానవీయ కోణంలో చూస్తే.. వారి వాదనా నిజమేనని అన్పించకమానదు. మొత్తమ్మీద ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్.. అటు రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరి వాదన వారిదే అన్నట్టుగా వుంది. మధ్యలో ఉద్యోగులే నలిగిపోతున్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కడం అనేది ప్రస్తుతానికి అనుమానమే. మరి, నోటిఫికేషన్ వచ్చేశాక, ఉద్యోగులు తాము రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి సహకరించబోం.. అని చెప్పే పరిస్థితి వుంటుందా.? వేచి చూడాల్సిందే.