“రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని నేను ఎన్నడూ అనలేదు…” మిషన్ బిల్డ్ ఎపి కేసు విచారణ సందర్భంగా జస్టిస్ రాకేష్ కుమార్ పై వ్యాఖ్యలు చేశారని ఈరోజు కొన్ని పత్రికలు ప్రచురించాయి….
మరో రెండు రోజుల్లో పదవీవిరమణ చేసి ఇంటికి వెళ్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ పైన ప్రస్తావించిన వ్యాఖ్యలు చేశారని పత్రికలన్నీ కోళ్ళయి కూశాయి. ఛానెల్స్ లో వచ్చాయి. ఆ కేసుపై ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు వెళ్ళింది. “రాజ్యాంగ వ్యవస్థలు ఎక్కడ కుప్ప కూలాయి” అని సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కూడా వ్యాఖ్యానించి జస్టిస్ రాకేష్ కుమార్ మీద కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేసి ఆయన తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు కూడా.
మరి హఠాత్తుగా తాను ఆ వ్యాఖ్యలు చెయ్యలేదని జస్టిస్ రాకేష్ కుమార్ నిన్న పేర్కొనడం చూస్తుంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఇంత గందరగోళం ఏర్పడటం ఇదే తొలిసారిగా గమనిస్తున్నాము. జస్టిస్ రాకేష్ కుమార్ అనని వ్యాఖ్యలను పత్రికలు ఎలా ప్రచురించాయి? మరి వాటికి నోటీసులు ఇచ్చారా? కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేశారా? హైకోర్టే ఈ ప్రశ్నలకు సంజాయిషీ ఇచ్చుకోవాలి.
జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యల మీద పచ్చ ఛానెళ్లన్నీ గంటలతరబడి డిబేట్స్ ను నిర్వహించాయి. జస్టిస్ రాకేష్ కుమార్ ను వ్యక్తిగతంగా పొగడ్తలతో ముంచెత్తుతూ ఆయన్ను ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా స్తుతిస్తూ పేజీలకు పేజీలు వార్తలు వండేశాయి. ఆయన తన హద్దులు మీరి ప్రభుత్వం మీద కువ్యాఖ్యలు చేస్తే అవి ఎంతో రుచిగా కనిపించాయి క్షుద్రమీడియాకు. “న్యాయవ్యవస్థలోకి ఎలా చొచ్చుకుని వస్తారు” అంటూ ఒక బాధ్యత కలిగిన ఐఏఎస్ అధికారిని అమాయకంగా ప్రశ్నిస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ తాను శాసన, అధికార వ్యవస్థలోకి ఎలా చొచ్చుకుని వెళ్లారో, తన పరిధి మీరి ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను ఎందుకు కించపరుస్తూ అవహేళనాపూర్వక వ్యాఖ్యలు చేశారో ఈ రాష్ర ప్రజలకు జవాబు ఇచ్చుకోవాల్సిందే. “ప్రభుత్వం ఏమైనా దివాళా తీసిందా?” అని ప్రశ్నించడానికి హైకోర్టుకు ఏమి అధికారం ఉన్నది? ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని అలా విమర్శించే హక్కు హైకోర్టుకు ఏ రాజ్యాంగం ఇచ్చింది?
జస్టిస్ రాకేష్ కుమార్ న్యాయపీఠం మీద కూర్చోవడానికి నైతికంగా అర్హతను ఏనాడో కోల్పోయారు. వ్యక్తిగత రాగద్వేషాలు, భావోద్వేగాలు కలిగినవారు ధర్మపీఠం మీద కూర్చుని తీర్పులు ఇవ్వడానికి అనర్హులు. “రాజ్యాంగం వైఫల్యం చెందింది అనే అంశం మీద జస్టిస్ రాకేష్ కుమార్ ప్రభావితులయ్యారు…అందుకనే ఆయన ఇచ్చిన ప్రొసీడింగ్స్ అన్నీ నిలిపేస్తున్నాం” అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్దే వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా జస్టిస్ రాకేష్ కుమార్ పదవిలో కొనసాగారంటే అది న్యాయవ్యవస్థలోని అతిపెద్ద లోపం.
మిషన్ బిల్డ్ కేసు మీద నిన్ననే తీర్పు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ విచారణను వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఈ కేసు మీద తీర్పు ఇచ్చే అవకాశం జస్టిస్ రాకేష్ కుమార్ కు లేనట్లే. “”నేను ఆ వ్యాఖ్యలు చేసినట్లు కేవలం మీరు, పిటిషనర్ మాత్రమే చెబుతున్నారు. రికార్డుల్లో కూడా ఆ వ్యాఖ్యలు కనిపించడం లేదు. చేశానో లేదో దేవుడు మాత్రమే తేల్చాలి” అని వ్యాఖ్యానించిన జస్టిస్ రాకేష్ కుమార్ తాను ఆ వ్యాఖ్యలను చేశారో లేదో ఆనాటి పచ్చపత్రికలను, ఆరోజు పచ్చమీడియా నిర్వహించిన చర్చాకార్యక్రమాలను ఒకసారి చూస్తే ఆయనకే అర్ధం అవుతుంది తాను చేసిన అతి పెద్ద తప్పు ఏమిటో!
ఏమైనప్పటికీ జస్టిస్ రాకేష్ కుమార్ పదవీవిరమణ చేయబోతున్న నెలరోజుల ముందు అవమానాలు, నిరాశానిస్పృహలు, మనోవేదనతో నిష్క్రమించడం ఆయన్ను జీవితాంతం కుమిలిపోయేట్లు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు వెళ్ళానా భగవంతుడా అని తలబాదుకుంటూ పాట్నా విమానం ఎక్కాల్సిరావడం మాత్రం దుర్భరం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు