ఆస్తుల పంపకాల్లో అన్నదమ్ములు, దాయాదులు కోర్టులకు వెళ్లడం, ఒకచోట ఓడిపోయినవారు పెద్దకోర్టుకు వెళ్లడం, ఈ రకంగా ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకుంటూ జీవితాంతం కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఎవరైనా ప్రయివేట్ వ్యక్తులు, లేదా సంస్థలు భావిస్తే కోర్టులకు వెళ్తుంటారు. కానీ, ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ మరొక రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం మీద కేసులమీద కేసులు పెడుతూ న్యాయస్థానాల్లో పోరాడుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా చూస్తున్నాము. పోనీ ఆ పోరాటాల ఖర్చులు తమ జేబు నుంచి భరిస్తున్నారా అంటే లేదు. ప్రభుత్వం ఖర్చు చేసినా, ఎన్నికల సంఘం ఖర్చు చేసినా అది ప్రజలు కట్టే పన్నుల నుంచే.
ఇక్కడ న్యాయం ఎవరివైపు ఉన్నది అని మనం తీర్పు చెప్పలేము. ఎందుకంటే ఎవరి వాదనలు వారికి న్యాయమని తోస్తాయి. మనకున్న పరిమిత జ్ఞానంతో అధ్యయనం చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జరగాలి. అప్పుడు కోర్ట్ ఆదేశించినా ఎన్నికల సంఘం ఆ ఎన్నికలను జరపలేదు. అంటే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆనాడే కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. గత ఏడాది మార్చ్ లో ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయిస్తే ప్రభుత్వం సమ్మతించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అనేకచోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. ఇది తెలుగుదేశం పార్టీకి కంటగింపుగా మారింది. అంతలోనే అనూహ్యంగా ఎన్నికలు వాయిదా వెయ్యాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ క్రమంలో ప్రభుత్వ సలహా తీసుకోవాలనే రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘించింది. అయినప్పటికీ కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కొద్దిపాటి విమర్శలు చేసి మౌనం దాల్చింది.
ఇక అప్పటినుంచి ఎన్నికల కమీషనర్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా మారింది. ఆయన రాష్ట్రంలో తనకు రక్షణ లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయడం, కేంద్ర కార్యదర్శికి రాసిన లేఖను తొలిసారి తాను రాయలేదనడం, ఆ తరువాత తానే రాసానని చెప్పడం, రెండు లేఖల్లో రెండు రకాల సంతకాలు ఉండటం, హైదరాబాద్ లోని హోటల్లో మాజీ తెలుగుదేశం నాయకులను రహస్యంగా కలుసుకోవడం…ఇలా ఒకటి కాదు రెండు కాదు నిమ్మగడ్డ వేసిన ప్రతి అడుగు సందేహాలకు తావిచ్చింది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమై ఆయన సారధ్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవు అనే నిర్ణయానికి వచ్చింది.
నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, గత ఏడాది సగంలో వదిలేసిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేవారు. ఆయన ఆ పని చెయ్యకుండా పంచాయితీ ఎన్నికలను తెరమీదికి తీసుకొచ్చారు. పంచాయితీ ఎన్నికలు అంటే చిన్న చిన్న గ్రామాల్లో జరిగేవి. ఇక్కడ ఓటర్లు గుంపులు గుంపులుగా చేరుతారు. పాతకక్షలు కూడా ఉంటాయి. హింసాకాండకు ఆస్కారం ఉంటుంది. పైగా తెలుగుదేశం కార్యకర్తలు, వైసిపి కార్యకర్తలు బద్ధవైరులుగా ఉంటారు కాబట్టి చిన్న ఘటనలు కూడా హింసకు దారితీస్తాయి. అసలే కోవిద్ భయం ఉన్న పరిస్థితుల్లో హింసాకాండ, ఘర్షణలు చెలరేగి ప్రాణనష్టం, ఆరోగ్యనష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? దానికితోడు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఉన్నదని ప్రభుత్వం వాదించింది. అయినప్పటికీ నిమ్మగడ్డ వాటిని పట్టించుకోకుండా అధికారులు వెళ్లిన గంటలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చెయ్యడం వెనుక చంద్రబాబు హస్తం ఉన్నదనేది నిర్వివాదాంశం.
రెండు పార్టీలు కోర్టుకు వెళ్లాయి. ఎన్నికలు ఇప్పుడు తగవు అని హైకోర్టు హితవు చెప్పి ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసి, తదుపరి విచారణను వచ్చే నెల పదిహేనుకు వాయిదా వేసింది. నిజానికి అంతటితో ఆ వివాదానికి ఎన్నికల సంఘం ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే ఎంతో హుందాగా ఉండేది. కోర్టును గౌరవించినట్లుండేది. కానీ నిమ్మగడ్డ అలాంటి చక్కని సంప్రదాయాన్ని, సంస్కారాన్ని నిలబెట్టకుండా మొండిపట్టు పడుతూ డివిజన్ బెంచ్ కు అపీల్ చేస్తామని చెప్పడం అత్యంత హేయమైన చర్య. ప్రజారోగ్యమే ప్రధానం అని, జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఎన్నికలకోసం ప్రజారోగ్యహక్కును కాలరాయలేము అని కోర్టు విస్పష్టంగా తన తీర్పులో చెప్పినా, మళ్ళీ అపీల్ కు వెళ్లాలని నిమ్మగడ్డ నిర్ణయించారంటే ఆయనకు ప్రజల ఆరోగ్యం మీద ఏమాత్రం గౌరవం లేదని స్పష్టం అవుతుంది. కోర్ట్ విచారణ తరువాత ఏమి తీర్పు ఇస్తుందో తరువాతి విషయం. తాను పోరాడుతున్నది తనకు జీతం ఇచ్చే ఒక ప్రజాప్రభుత్వం మీద అనే స్పృహ ఏమాత్రం లేకపోవడం విచారకరం.
వ్యవస్థలో వ్యక్తులను ప్రవేశపెట్టేటపుడు అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని, ఏమాత్రం కట్టుదప్పి వ్యవహరించినా తక్షణమే వారిని పదవులనుంచి తొలగించే విధంగా పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే సబబుగా ఉంటుందని నిమ్మగడ్డ నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.
రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు రాజ్యాంగ రక్షణ కవచాన్ని తొలగించాలి. ఏ వ్యవస్ధ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించే విధానాన్ని అరికట్టాలి. ముఖ్యంగా కోర్టు ఒకసారి చెప్పిన తరువాత ఆ వివాదాన్ని మూసేయాలి.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు