(యనమల నాగిరెడ్డి)
అన్ని రంగాలలో వెనుకపడి కరువుసీమగా మారిన రాయలసీమను అభివృద్ధి చేయడానికి తమవంతు సహకారం అందిస్తామని కోస్తా ప్రజాసంఘాల నాయకులు ప్రకటించారు. రాయలసీమకు గత అనేక దశాబ్దాలుగా అన్యాయం జరిగిందనేది వాస్తవమని , ఆ అన్యాయాన్ని సరిదిద్ది ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కోస్తా ప్రాంతం నుండి గుంటూరు, కృష్ణా, పచ్చిమ గోదావరి జిల్లాల నుండి సీనియర్ నాయకులు ఎర్నేని నాగేంద్రనాథ్, మోహనరావు యలమందరావు, ప్రభాకర్, కేశవరావు, క్రిష్ట్న రవిచంద్ర, కుమారస్వామి, రవిచంద్ర , కృష్ణయ్య , కొండారెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐక్య వేదిక కన్వీనర్ దశరదరామిరెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించగా రాయలసీమ నాలుగు జిల్లాల నుండి శ్రీనివాసులు, రత్నం, ఏసేపు, హరినాథ రెడ్డి, భాస్కర్, మోక్షానంద రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో “అప్పటికి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని నీటి పారుదల ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని” కేంద్రం హామీ ఇచ్చిందని, ఆ మేరకు రాయలసీమలో గత 30 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న “గాలేరు- నగిరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, ప్రకాశం జిల్లా కు ఉపయోగపడగల వెలిగొండ” ప్రాజెక్ట్ లను వెంటనే పూర్తి చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. బ్రిజేష్ మిశ్ర ట్రిబ్యునల్ ఎదుట సక్రమైన వాదనలు వినిపించి ఈ ప్రాజెక్టు లకు చట్టబద్దమైన నీటి కేటాయింపులు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సమావేశం కోరింది.
ప్రజాప్రయోజనాలకోసం ప్రభుత్వం జరుపుతున్న భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు విధానాలను సమీక్షించి అన్ని ప్రాంతాల ప్రజలకు సమానంగా నష్ట పరిహారం చెల్లించాలని, సీమ ప్రాంతంలో నష్టపరిహారంపై ప్రస్తుతం సాగిస్తున్న వివక్షా పూరిత ధోరణిని తొలగించాలని సమావేశం తీర్మానించింది.
ప్రస్తుతం అభివృద్ధిని కేంద్రీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని సమావేశం ఖండిస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని, ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది.
రాయలసీమ అభివృద్ధికి తమవంతు సహకారం అందివ్వగలమని ఈ సమావేశంలో కోస్తా ప్రాంత ప్రజా సంఘాల నాయకులు ప్రకటించడం పట్ల రాయలసీమ ఉద్యమసంఘాల సమన్వయవేదిక హర్షం వ్యక్తం చేసింది.