ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… కొన్ని కీలక నియోజకవర్గాల్లో మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో దెందులూరు నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి 2014లో ఎమ్మార్వో వనజాక్షి ఇష్యూలోనే ఈ నియోజకవర్గం పేరు, అప్పటి ఎమ్మెల్యే పేరూ మారుమోగిపోయింది. అయితే… అప్పుడు చంద్రబాబు సదరు ఎమ్మెల్యేపై చర్చలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది.
కట్ చేస్తే… 2019 ఎన్నికలు సమీపించాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి అబ్బాయ్ చౌదరి బరిలోకి దిగారు. ఆ సమయంలో… చింతమనేనిని ఓడించడం అబ్బాయిచౌదరికి అసాధ్యం అనే కామెంట్లు వినిపించాయి. అయితే… ప్రజాస్వామ్యంలో జనం ఓటు అనే ఆయుధంతో తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపణ అవుతూ… చింతమనేనిపై అబ్బాయిచౌదరి 16,131 (9శాతం) ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో… అబ్బాయి చౌదరి పేరు మారుమ్రోగిపోయింది.
ఇప్పుడు మరోసారి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో మరోసారి వైసీపీ నుంచి అబ్బాయిచౌదరి బరిలోకి దిగనున్నారని తెలుస్తుంది. ఇక దెందులూరు టిక్కెట్ పొత్తులో భాగంగా టీడీపీకే ఉంటుందా.. లేక, జనసేనకు వెళ్తుందా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. దీంతో… చింతమనేని ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడికి తప్ప మరెవరికి టిక్కెట్ ఇచ్చినా రెబల్ గా పోటీచేస్తారంటూ ఆయన అనుచరులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని తెలుస్తుంది.
అయితే… ఆ టిక్కెట్ జనసేనకు వెళ్లడం సంగతి పక్కనపెడితే… టీడీపీలోనే మరో పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నరానే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా… ఈడ్పుగంటి శ్రీనివాస బాబు పేరు సడన్ గా తెరపైకి వచ్చిందని తెలుస్తుంది. ఈయన చింతమనేని తరుపు న్యాయవాది కూడా కావడం గమనార్హం. ఇప్పటికే ఈయన నియోజకవర్గంలో పలువురు నేతలతో చర్చలు జరిపి.. మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారని తెలుస్తుంది.
ఇదే సమయంలో… ఇటీవల దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ – జనసేన నాయకులు, కార్యకర్తల పేరున కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవి పూర్తిగా చింతమనేనికి వ్యతిరేక ప్రకటలతో ఉండటం గమనార్హం. ఇందులో భాగంగా… “ప్రజా వ్యతిరేకి”: “చింతమనేని వద్దు – ఎవరైనా ముద్దు” అంటూ నియోజకవర్గానికి చెందిన టీడీపీ – జనసేన నాయకులు కార్యకర్తల పేరున ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో… చింతమనేనికి వ్యతిరేకంగా పార్టీలోనే బలమైన వర్గం తయారయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీంతో… ఈసారి టీడీపీ టిక్కెట్ చింతమనేనికి ఇస్తే టీడీపీ కార్యకర్తలే ఓడిస్తారా అనే చర్చ తెరపైకి వచ్చింది. పైగా… ఈసారి దెందులూరు టిక్కెట్ ఆశిస్తున్నట్లు చెబుతున్న జనసేన నేతలు సైతం చింతమనేనికి సహకరించే విషయంలో సెకండ్ ఆప్షన్ కి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో… చింతమనేనికి దెందులూరులో మరో”సారీ” తప్పదా అనే చర్చ బలంగా సాగుతుంది!!