చంద్రబాబు మనసు అర్ధం చేసుకోలేకపోతున్న చింతమనేని!

రాబోయే ఎన్నికలు తన పొలిటికల్ కెరీర్ కు, తెలుగుదేశం పార్టీ మనుగడకూ ఎంత కీలకమైనవో చంద్రబాబుకు తెలుసు. అందుకే అన్ని విషయాల్లోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అత్మాభిమానం, పౌరుషం వంటి విషయాలను ఏమాత్రం లెక్కచేయకుండా శాంతంగా ముందుకు వెళ్తున్నారు. పవన్ తో పొత్తు అయినా.. మోడీని ఆకాశానికి ఎత్తడం అయినా ఇందులో భాగాలే! కానీ… టీడీపీ నేతలకు మాత్రం చంద్రబాబు వ్యూహాలు అర్ధంకావడం లేదో.. లేక, వారు కూడా సొంత వ్యూహాలు నడుపుతున్నారో కానీ… సొంత అజెండాలు అమలుపరుస్తున్నారు.

ఈ విషయంలో దెందులూరు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దూకుడు పెంచుతున్నారు. తాజాగా కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన ఆయన బాబు వ్యూహాలను దాటి కామెంట్లు చేశారు. అవినాష్ రెడ్డి వ్యవహారంలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందని వ్యాఖ్యానించారు. అవినాష్‌ ను సీబీఐ అరెస్టు చేయకపోవడం సిగ్గు చేటని నోటికి పనిచెప్పారు. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ సీనియర్లు.

ఈమాత్రం విమర్శలు చంద్రబాబు చేయలేరా.. ఈ మాత్రం దూకుడు బాబు ప్రదర్శించలేరా.? కానీ కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలూ చేయకూడదని బాబు ఫిక్సయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మోడీతో స్నేహం విషయంలో ఆఖరి వరకూ వేచి చూడాలని భావించారు. ఏమాత్రం అనాలోచితంగా వ్యవహరించినా… ఫలితాలు తారుమారయ్యే ప్రమాధం లేకపోలేదని ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలోని మోడీతో సఖ్యత చాలా ముఖ్యమని నమ్ముతున్నారు.

ఈ విషయాలు అర్ధం కాని చింతమనేని వంటి నేతలు కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో తలలు పట్టుకుంటున్న టీడీపీ సీనియర్లు… ఒకపక్క బీజేపీతో పొత్తు కోసం అటు పవన్, ఇటు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు… ఇలాంటి విమర్శలు చెయ్యొద్దని సూచిస్తున్నారంట. దీంతో… చంద్రబాబు మనసును చింతమనేని అర్ధం చేసుకోలేకపోతున్నారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!