విదేశాలకు పారిపోయిన చంద్రబాబు మాజీ పీఎస్… తెరపైకి షాకింగ్ విషయాలు!

చంద్రబాబు నాయుడికి ఐటీశాఖ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుల వ్యవహారం సీరియస్ అవ్వడంతోపాటు దానికి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కూడా తోడవడంతో ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగింది. ఇదే సమయంలో ఈ స్కాం దుబాయ్ వరకూ విస్తరించిందని తెలుస్తున్న తరుణంలో ఈడీ కూడా రంగంలోకి దిగొచ్చని చెబుతున్నారు.

ఈ సమయంలో ఏపీ సీఐడీ నోటీసులు పంపి విచారణకు పిలిచిన వేళ… దేశం విడిచి పారిపోతున్నారంట అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు. వారిలో ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ విదేశాలకు పారిపోయారని తెలుస్తుంది. దీంతో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విజయమాల్యాను గుర్తుచేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ తో పాటు పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌ పార్థసాని కూడా విదేశాలకు వెళ్లిపోయారని తెలుస్తుంది. వీరిద్దరి పేర్లు అటు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కూడా ఉండటంతో విచారణకు రావాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ పారిపోయారని అంటున్నారు.

ఇందులో భాగంగా… సెప్టెంబర్ 5న పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ దుబాయ్‌ పారిపోయినట్టు ఏపీ సీఐడీ గుర్తించగా.. పెండ్యాల శ్రీనివాస్ సెప్టెంబర్‌ 6న అమెరికాకు వెళ్లిపోయారని తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న పెండ్యాల శ్రీనివాస్‌ తొలుత తనకు సెప్టెంబరు 11 నుంచి సెలవు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.

అయితే ఈలోపు ఐటీ నోటీసుల వ్యవహారం బయటకు రావడం, ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగడంతో ఈనెల 5న లీవ్ లెటర్‌ ఇచ్చేసి ఉన్నపలంగా వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. అనంతరం 6వ తేదీన హైదరాబాద్ నుంచి అమెరికాకు పారిపోయారని సీఐడీ గుర్తించిందని తెలుస్తుంది. మరి ఈ విషయంపై ఏపీ సీఐడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది అనేది ఆసక్తిగా మారింది.