చంద్రబాబు, జగన్‌, కేసీఆర్‌.. ఎవరు కరెక్ట్‌.?

Chandrababu, Jagan‌, KCR Who is correct on bharat bandh? 

దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్ని రైతులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. పంజాబ్‌లో మొదలైన ఉద్యమం, దేశవ్యాప్తంగా ఉధృతమయ్యింది. వివిధ రాజకీయ పార్టీలు నేటి ‘భారత్‌ బంద్‌’కి మద్దతునిచ్చాయి. రాజకీయ పార్టీల సంగతి పక్కన పెడితే, రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కుతున్నారు. చరిత్రలో కనీ వినీ ఎరుగని ఉద్యమంగా దీన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ‘రైతే రాజు’ అని రాజకీయ పార్టీలు చెప్పడం మామూలే. కానీ, ఆ రైతుకి, ప్రస్తుత రాజ్యంలో అవమానాలే ఎదురవుతున్నాయి. సంస్కరణల పేరుతో రైతుల్ని మరింతగా నాశనం చేసే చర్యల్ని కేంద్రం చేపట్టిందన్నది రైతుల ఆరోపణ. అదంతా ఉత్తదే, రైతుల్ని ఎవరో రెచ్చగొడుతున్నారు.. ఇదంతా రైతులకోసమే.. అంటోంది కేంద్ర ప్రభుత్వం. రైతులే వద్దని తేల్చేశాక, ఈ సంస్కరణల వల్ల ఉపయోగమెవరికి.? అసలు విషయం పక్కన పెట్టి, అడ్డగోలు రాజకీయాలు చేయడం రాజకీయ పార్టీలకు అలవాటే. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్నది అదే.

Chandrababu, Jagan‌, KCR Who is correct on bharat bandh? 
Chandrababu, Jagan‌, KCR Who is correct on bharat bandh?

తెలంగాణలోనూ రైతు సమస్యలున్నాయ్‌..

కొద్ది నెలల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, రైతు ఏ పంట వేయాలన్నది అధికారులు నిర్ణయిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అది లాభసాటి పద్ధతి’ అంటూ కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. అయితే, వందల, వేల ఏళ్ళుగా వ్యవసాయం ఎలా చెయ్యాలో రైతుకు తెలుసు. అలాంటి రైతుకి, ప్రభుత్వాలు పాఠాలు చెప్పడమేంటి.? సరే, రైతుల ఆదాయాన్ని పెంచే మార్గం.. అని కేసీఆర్‌ చెప్పారు గనుక, కొంత అసంతృప్తి వున్నా.. నెమ్మదిగా రైతులూ సర్దుకుపోయారు. అలాగని, రైతుల్లో ఆందోళన పూర్తిగా తొలగిపోయిందని అనుకోలేం.

ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వైఖరి

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతిచ్చాయి. ఆ రెండు పార్టీలూ ఇప్పుడు రైతులకు సంఘీభావం ప్రకటించేశాయి. ఇదెక్కడి రాజకీయం.? టీడీపీ బేషరతుగా మద్దతిచ్చిందనీ, తాము మాత్రం షరతుల్ని విధించామనీ వైసీపీ చెబుతుండడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. కేంద్రం తెచ్చిన చట్టాలకు టీడీపీ, వైసీపీ సహకరించాయన్నదొక్కటే వాస్తవం ఇక్కడ. మరెందుకు రైతల పట్ల టీడీపీ, వైసీపీ మొసలి కన్నీరు కార్చుతున్నట్లు.?

కేసీఆర్‌ ఆందోళనలో కొంత న్యాయం వున్నట్టే

కేంద్రం తీసుకొచ్చిన చట్టాల్ని టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది గనుక, ఈ సందర్భంలో రైతుల తరఫున మాట్లాడే నైతిక హక్కు కాస్తో కూస్తో కేసీఆర్‌కి మాత్రమే వుంది. అయితే, అధికారంలో వున్న పార్టీ, ఉద్యమాలకు మద్దతివ్వడమేంటి.? మంత్రులు, ఆందోళనల్లో పాల్గొనడమేంటి.? అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న. కేంద్రం తెచ్చిన చట్టాల్ని వ్యతిరేకించే క్రమంలో చట్ట సభల సాక్షిగా కలిసొచ్చేవారితో పోరాటం చేసి, కేసీఆర్‌ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి వుంది.

రైతే రాజు.. కానీ, ఎక్కడ.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా రైతే రాజు. కానీ, ఆ రాజుని బిచ్చగాడిలా మార్చేస్తున్నాయి ప్రభుత్వాలు. లేకపోతే, గడ్డకట్టే చలిలో, రైతులు ఆందోళనలు చేయడమేంటి.? బేషజాల్ని పక్కన పెట్టి కేంద్రం, రైతుల ఆవేదన వినకపోవడమేంటి.? చర్చలు జరుపుతున్నామంటే సరిపోదు, ఆ చర్చల ద్వారా సమస్క పరిష్కరింపబడకపోతే, చర్చలెందుకు దండగ.?