చంద్రబాబు రాజకీయ ఊసరవెల్లి అని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఆయన కూడా ఆ కామెంట్లకు వీలైనంత ఎక్కువ బలం చేకూర్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో తాజాగా హస్తినలో వదినగారి సమక్షంలో బీజేపీ చీఫ్ తో కూర్చున్న చంద్రబాబు… తాజాగా “ఇండియా” కూటమికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు.
అవును… 2019 ఎన్నికల సమయంలోనూ, అంతక ముందూ… మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీనీ తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు… గతకొన్ని రోజులుగా మోడీది తనదీ ఒకటే టైపు ఆలోచనా విధానం అని చెప్పేపనికి పూనుకున్నారు. అవును… ఎవరేమి అనుకుంటే తనకేమి అనుకున్నారో ఏమో కానీ… చంద్రబాబు బీజేపీ వైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
మొన్న ఎన్ డీయే భాగస్వాముల మీటింగ్ కి చంద్రబాబును దూరం పెట్టింది బీఇజేపీ. ఇదే సమయంలో ఇండియా కూటమికి కూడా బాబుని దూరం పెట్టింది కాంగ్రెస్. అయితే కర్ణాటక ఎన్నికల అనంతరం కాస్త కాంగ్రెస్ వైపు చూసినట్లు కనిపించారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో… తాజాగా నడ్డాతో భేటీ అయ్యారు చంద్రబాబు. దీంతో… కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా… దక్షిణాదిలో తెలంగాణ, కర్ణాటకలో మినహా కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పుకొచ్చిన చంద్రబాబు… ఏపీ, తమిళనాడులో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమిలో నేతలు చాలామంది ఉన్నారని కన్వీనర్ ఎవరనేది వాళ్ళు తెల్చుకోవాల్సిన విషయంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో పొత్తులపై కూడా చంద్రబాబు తనదైన శైలిలో పరిపూర్ణమైన అస్పష్టతతో స్పందించారు. ఇందులో భాగంగా… తెలంగాణలో బిజెపితో పొత్తుకు అవకాశం లేదని ఇప్పటికే సమయం మించి పోయిందని చెప్పిన ఆయన… తెలంగాణలో టిడిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏపీలో సంగతి కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. దీంతో.. ఒక సిద్ధాంతం అనేది లేకుండా.. దొరికినవారితో పొత్తు పెట్టుకొవడం, అందినకాడికి సీట్లు సంపాదించుకోవడమే రాజకీయం అన్నట్లుగా ఉందని అంటున్నారు.
అదంతా ఒకెత్తు అయితే అనంతరం “జాతీయ రాజకీయాలు, చంద్రబాబు పాత్ర” అనే అంశంపై స్పందించారు చంద్రబాబు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్రకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అందుకు తగిన అవకాశాలు ఉన్నాయా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ముఖ్యమంత్రి పదవికి తాను సిద్ధంగా ఉన్నాను అని పవన్ ప్రకటించినట్లుగా చంద్రబాబు స్పందించారని అంటున్నారు పరిశీలకులు.