పవన్ కల్యాణ్ అబద్దాల పుట్ట!… కేంద్రమంత్రి క్లారిటీ ఇదే!

గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీరి సహకారంతోనే ఏపీలో సుమారు 30వేల మంది అమ్మాయిలు మాయమయ్యారని.. ఇందులో వైసీపీ నేతల హస్తం ఉందని తెలుస్తోందని.. ఈ మేరకు తనకు కేంద్ర నిఘావర్గాల ద్వారా సమాచారం అందిందని ఏలూరు వారాహి మీటింగ్ లో సంచలన ఆరోపణలు చేశారు.

ఇదే సమయంలో… 30వేల మంది మహిళలు అదృశ్యమవ్వగా.. అందులో “14వేల మంది ఆచూకీ ఇంకా దొరకలేదని” పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలకు లోక్ సభలో సమాధనాం వచ్చింది. కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం… అదంతా పచ్చి అబద్ధం అని చెబుతూ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది వైసీపీ.

ఏపీలో బాలికలు, యువతులు అదృశ్యమైపోతున్నారని.. వారంతా అక్రమ రవాణాకు గురవుతున్నారని.. దీనికి వాలంటీర్లే కారణమంటూ ఎన్నికల ముందు పవన్ సహా కూటమి పార్టీలు అమానవీయమైన వ్యాఖ్యలు చేశారని.. అయితే ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తేటతెల్లమైందని చెబుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన వివరణలు వైసీపీ ఎక్స్ వేధికగా వెల్లడించింది.

లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలన్నీ ఉన్నాయని వైసీపీ తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకరం…

ఏపీలో 2019లో బాలికలు/యువతులు కనిపించడంలేదంటూ వచ్చిన ఫిర్యాదులు 6,896 కాగా… ఇందులో ట్రేస్‌ అయిన వారి సంఖ్య 6,583! 2020లో వచ్చిన ఫిర్యాదులు 7,576 కాగా.. ట్రేస్‌ చేసిన వారి సంఖ్య 7,189! 2021లో వచ్చిన ఫిర్యాదులు 10,085 కాగా… ట్రేస్‌ చేసిన వారి సంఖ్య 9,616! 2022లో వచ్చిన ఫిర్యాదులు 10,433 కాగా… ట్రేస్‌ చేసిన వారి సంఖ్య 10,994.

ఈ సారి ట్రెస్ చేసిన వారి సంఖ్య ఫిర్యాదులకంటే ఎక్కువ ఉండటానికి కారణం… అంతకు ముందు సంవత్సరాల్లో ట్రేస్‌ కానివారిని ఈ ఏడాది గుర్తించడంతో ఇక్కడ సంఖ్య పెరిగిందన్నమాట. ఇక, 2023లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 9,695 కాగా… ట్రేస్‌ చేసిన వారి సంఖ్య 9,640! అని వివరాలు వెల్లడించింది వైసీపీ.

ఈ సందర్భంగా… “దిశ” యాప్ ఉండటం, స్నేహపూర్వకంగా సేవలు అందించడంతో పోలీసులు వద్దకు వచ్చి బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారని.. దీంతో ఫిర్యాదుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్టుగా కనిపించినా.. పరిష్కారంలో కూడా అంతే సమర్థత చూపించగలిగారని వైసీపీ వెల్లడించింది.

ఇదే సమయంలో… చంద్రబాబు గత హయాంలో (2015-18) మధ్య ట్రేస్‌ కాని, ఆచూకీ తెలియని అమ్మాయిల సంఖ్య 1,542 మంది ఉన్నారని తెలిపిన వైసీపీ… అంటే వాళ్లంతా అక్రమ రవాణాకు గురైనట్టేనా? అని సూటిగా ప్రశ్నించింది. తప్పుడు ప్రచారాలు చేసిన వారు, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ ఘాటుగా నిలదీసింది!

దీంతో... తనకు 30 వేల మంది మహిళలు హ్యూమన్ ట్రఫికింగ్ కి పాల్పడినట్లు.. వారిలో 14వేల మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేనట్లు.. పైగా వీరంతా అదృశ్యమవ్వడానికి వాలంటీర్లే కారణం అంటూ పవన్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని తేలిందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు! అబద్ధల పునాదులు, అలవిగాని పథకాల హామీల పునాదుల మీద ఏర్పడిన ప్రభుత్వం ఇదని ఎద్దేవా చేస్తున్నారు.