రానున్న ఎన్నికల్లో హాట్ టాపిక్ లోక్ సభ స్థానాల్లో ఊత్తరాంధ్రలోని అనకాపల్లి ఒకటని చెప్పాలి. చంద్రబాబు మనిషిగా పేరుండి బీజేపీ నుంచి ఎంపీగా సీఎం రమేష్ పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం అనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో ఈ సీఎం రమేష్ పైకి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుని దింపారు వైఎస్ జగన్. సామాజిక సమీకరణాలు, స్థానికత అంశాలతో పాటు పలు విషయాలను పరిగణలోకి తీసుకున్న జగన్… బూడిని ఎంపిక చేశారు.
వాస్తవానికి 1962లో ఏర్పడిన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే.. వాటిలో 9 సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఇదే క్రమంలో టీడీపీ ఐదుసార్లు గెలవగా, వైసీపీ గత ఎన్నికల్లో తొలిసారి గెలిచింది. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా గెలవాలని పావులు కదుపుతోంది. అందులో భాగంగానే… ఆచితూచి ఎంతో ఆలోచించి అనకాపల్లి అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలోకి దింపింది.
సుమారు పదమూడున్నర లక్షల ఓట్లు ఉన్న అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో.. కాపు, గవర, కొప్పుల వెలమ సామాజికవర్గాల ఓట్లే ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు సామాజిక వర్గాల ఓట్లే దాదాపు 70 శాతంగా చెబుతున్నారు. అందుకే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ప్రధానంగా ఈ మూడు కులాల వారినే అభ్యర్థులుగా పెడుతుంటాయి ప్రధాన పార్టీలు.
ఇక, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గానికి చెందిన వారు కాగా.. సీఎం రమేష్ స్వస్థలం రాయలసీమలోని కడప జిల్లా! దీంతో… ఆయనకు నాన్ లోకల్ ఎఫెక్ట్ గట్టిగా పడే అవకాశం ఉందని అంటున్నారు. కారణం… అనకాపల్లిలో ఓటర్లు సాధారణంగా స్థానిక నేతలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని చెబుతుండటమే.
ముత్యాలనాయుడు పంచాయతీ వార్డు మెంబర్ గా రాజకీయాల్లో ప్రవేశించి.. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు. ఈ సమయంలో 2014లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక గత ఎన్నికల్లో రెండోసారి గెలిచి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు.
ఇక కూటమి తరఫున బీజేపీ నేత సీఎం రమేశ్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో ప్రముఖ నేతలంతా అనకాపల్లి ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన సీఎం రమేష్ దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేశారు. ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో బీజేపీలో చేరిపోయారు.
మొత్తానికి అనకాపల్లి లోక్ సభ పరిధిలో ఉభయ పక్షాలు దూకుడు చూపుతున్నాయి. వైసీపీ అభ్యర్థి సంక్షేమ బలంతోనూ.. కూటమి అభ్యర్థి ధన బలంతోను హోరాహోరీగా తలపడుతున్నారని అంటున్నారు. వైసీపీ అభ్యర్థి సంక్షేమ పథకాలతోపాటు లోకల్ నినాదాన్నే ఎక్కువగా నమ్ముకుంటుండగా, కూటమి అభ్యర్థి అభివృద్ధి రాగం ఆలపిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు ఈ ఇద్దరిలో ఎవరి వాదన ఆలకిస్తారనేది చూడాల్సివుంది.