రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ “బ్రీఫ్ డ్ మీ” అనే పదం ఎంత ఫేమస్సో దాదాపు అందరికీ తెలిసిందే. ఆ ఒక్క మాట… రాజధానిగా ఇంకా చాలాకాలం అధికారం ఉన్నా కూడా పెట్టేబేడా సర్ధుకుని హైదరాబాద్ విడిచి పారిపోలేలా చేసింది. ఆ ఒక్క మాట.. ఏపీ భవిష్యత్తుని మార్చేసింది. మరికొంతకాలం హైదరాబాద్ లోనే ఉండి.. ఏపీలో రాజధాని నిర్మాణం చేసుకుని ఉంటే… ఈపాటికి ఏపీకి కూడా ఒక రాజధాని ఉండేది. కానీ.. ఆ “బ్రీఫ్ డ్” మీ అనేపదం ఆ స్థాయిలో నాటి పెద్దలను వణికించేసింది. ఫలితంగా “బ్రీఫ్ డ్ మీ” అనే పదం ఏపీకి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. తాజాగా… మళ్లీ అలాంటి సంఘటన ఏపీ రాజకీయాల్లో వెలుగులోకి వచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒకసీటు గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో… వైకాపాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారని.. గతంలో 23మందిని కొన్న అనుభవాన్ని బాబు మరోసారి ఉపయోగించారని విమర్శిస్తున్నారు వైకాపా నేతలు. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో చంద్రబాబు మరోసారి “మా వాళ్లు బ్రీఫ్ డ్ మీ” అన్నారని వెటకారమాడుతున్నారు. అయితే ఈ వైకాపా నేతల విమర్శలకు బలం చేకూర్చారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. దీంతో ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తున్నారు టీడీపీ నేతలు.
టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటువేసే విషయంలో ఆ పార్టీ నుంచి మొదటి బేరం తనకే వచ్చిందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తమకు ఓటు వేస్తే రూ.10 కోట్లు ఇస్తామని ఉండి ఎమెల్యే రామరాజుతో టీడీపీ ఆఫర్ చేసిందని రాపాక ఆరోపించారు. దీంతో మైకందుకున్న టీడీపీ నేత బోండా ఉమ… రాపాకను కొనాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు.
అనంతరం డోస్ పెంచిన బోండా ఉమ… రూ.10 కోట్లు కాదు, రూ.10 వేలు కూడా రాపాక వరప్రసాద్ కు ఎక్కువే అని వెటకరిస్తున్నారు. రూ.10 కోట్లు పెట్టి కొనడానికి నువ్వు అంత సుందరంగా వున్నావా? అని దెప్పి పొడుస్తున్నారు. రాపాక అల్రెడీ వైసీపీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యే అని బొండా ఉమా ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రజలు ఏ పార్టీలో గెలిపిస్తే.. ఆ పార్టీలోనే నాయకులంతా ఉన్నట్లు పత్తిత్తు కబుర్లు చెప్పే ప్రయత్నం చేసిన బోండా… 2019లో టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇంకా ఒక ఓటు ఎక్కువే తమకు ఉందని.. అలాంటప్పుడు రాపాకతో బేరాలు ఆడాల్సిన అవసరం ఏంటని ఆయన నిలదీశారు.
దీంతో… 23మంది ఎమ్మెల్యేలకంటే తక్కువ గెలిపిస్తే పోటీకి దిగేవారు కాదా అని ప్రశ్నిస్తున్నారు వైకాపా నేతలు. తమకున్న ఎమ్మెల్యేలతోనే సర్ధుకుంటాం తప్ప… పక్కపార్టీ ఎమ్మెల్యేలవైపు కొంగుజార్చము అన్నంత గొప్పగా చెబుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. పైగా.. “తమకు 23మందీ ఉన్నప్పుడు ఎందుకు బేరాలాడతాము” అంటున్న బోండా… “23మంది కాకుండా 19మందే ఉండి ఉంటే బేరాలు ఆడేవారా” అని లాజిక్కులు లాగుతున్నారు నెటిజన్లు.
మాకు సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా… మేము ఇతర పార్టీ నేతలతో బేరాలు ఆడే దౌర్భాగ్యులం కాదని చెప్పాల్సిన బోండా… తమకు సరిపడా ఉన్నప్పుడు ఎందుకు ఇంకో ఓటుకోసం బేరమాడతామ్మన్నట్లు ప్రకటించి.. దొరికిపోతున్నారని అంటున్నారు. దీంతో… మరోసారి ఏపీరాజకీయాల్లో “బ్రీఫ్ డ్ మీ” – “సంతలో పశువుల పాలిటిక్స్” అంశం తెరపకి వచ్చింది!