సోము వీర్రాజుని తప్పించి, పురంధేశ్వరిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవికి ఎంపిక చేయడం వెనుక బీజేపీ జాతీయ నాయకత్వం తాలూకు వ్యూహమేంటి.? పురంధేశ్వరి అంటే, మాజీ కేంద్ర మంత్రి. మంచి వాగ్ధాటి ఆమె సొంతం. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవమూ వుందామెకి.
ఆమె స్వయానా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరికి సోదరి. స్వర్గీయ ఎన్టీయార్ కుమార్తె కూడా.! చాలా ప్రత్యేకతలున్నాయి పురంధేశ్వరికి. అయితే, క్రౌడ్ పుల్లర్ కాదామె. వివాదాస్పద వ్యాఖ్యలూ చేయరు. రాజకీయ విమర్శలు మాత్రం, పద్ధతిగా చేయగలుగుతారు. మహిళ.. కాబట్టి, అదో ప్లస్ పాయింట్ ఓటు బ్యాంకు కోణంలో.
ఇవన్నీ ఓ యెత్తు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఈక్వేషన్ తమకు కొంత అనుకూలంగా మారుతుందన్నది బీజేపీ వ్యూహం. పవన్ కళ్యాణ్ రూపంలో కాపు ఓటు బ్యాంకు.. భువనేశ్వరి రూపంలో కమ్మ ఓటు బ్యాంకు.. ఈ రెండూ జనసేన – బీజేపీ కూటమికి అనుకూలంగా మారతాయని బీజేపీ జాతీయ నాయకత్వం అనుకుంటోందిట.
ఎప్పుడైతే బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు పురంధేశ్వరికి ప్రకటించడం జరిగిందో, ఆ వెంటనే ‘కమ్మ’ సామాజిక వర్గంలో ఒకింత అలజడి బయల్దేరింది. టీడీపీ వైపు అండగా వుంటూ వచ్చిన, ‘కోర్ ఓటింగ్’ అనూహ్యంగా బీజేపీ – జనసేన కూటమి వైపు మళ్ళే అవకాశం వుందట. అదెంత శాతం.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
టీడీపీ అంటే గిట్టని కమ్మ సామాజిక వర్గ నేతలు, బీజేపీ వైపుగా అడుగులేస్తున్నారు. బీజేపీతోపాటుగా వారి చూపు జనసేన వైపు కూడా వుంది. ఎందుకంటే, జనసేనలో చేరితే, టిక్కెట్ దొరుకుతుంది గనుక.! సర్లే.. ఎంతో కొంత.. తమకూ కలిసొస్తోంది మిత్రపక్షం జనసేనతోపాటు.. అని బీజేపీ సరిపెట్టుకోక తప్పడంలేదు.