భారతీయ జనతా పార్టీ పేరుకు జాతీయ స్థాయి పార్టీయే అయినా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం చాలా చాలా చిన్న పార్టీ. ఇక్కడి ప్రజలకు ఆ పార్టీ అంటే చాలా లైట్. ఆ.. వాళ్లదేముందిలే.. పేరుకే పార్టీ. క్యాడర్, నాయకులు శూన్యం అంటుంటారు. అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీకి వచ్చే ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థుల కంటే తక్కువగానే ఉంటాయి. ఒక్కోసారి నోటా కంటే తక్కువే. తెలుగు రాష్ట్రాల్లో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పార్టీగా ఉండేది. కానీ భాజపా మాత్రం ఇప్పటికీ అట్టగుడు స్థానంలోనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి గత ఐదేళ్ళలో తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ అయింది కానీ లేకుంటే ఇంకా అద్వానపు స్థితిలో ఉండేది. ఇప్పుడిప్పుడే ఆ పార్టీని కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నారు జనం. దీన్ని ఇలాగే కొనసాగించి ఇంకా బలపడాలని చూస్తోంది కషాయ దండు. అందుకే ఏపీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంది.
కనిపించిన దిక్కు పవన్ ఒక్కడే:
నిజానికి ఆంధ్రాలో బలపడాలంటే భాజపాకు పొత్తు తప్పనిసరని తెలుసు. అందుకే కలిసొచ్చే వారి కోసం వెతికింది. అధికార వైసీపీతో కలిస్తే లెక్కలన్నీ మారిపోతాయి కాబట్టి కలవడం కుదరదు. పైగా పొత్తుల అవసరం జగన్ కు అస్సలు లేదు. అలాంటి స్థితిలో పైనుండి ఒత్తిడి తెచ్చి కలిసినా కూటమిలో ఒక మూలన పడి ఉండవలసిందే. ఇక మరొక ప్రధాన పార్టీ టీడీపీతో కలవడం బీజేపీ అధిష్టానానికి అసలే ఇష్టం లేదు. ఎందుకంటే గతంలో నాలుగేళ్లు కలిసి చేసిన ప్రయాణంలో చంద్రబాబు తత్వం ఏమిటో వారికి తెలిసొచ్చింది. రెండు పార్టీలు శత్రువులైపోయారు. టీడీపీకి ఎప్పటికీ ఎన్డీయే గేట్లు మూసే ఉంటాయని భాజపా అగ్రనేతలు ఖరాఖండిగా చెప్పేశారు. సో.. ఇక వారికి మిగిలింది జనసేన మాత్రమే. అందుకే పవన్ కళ్యాణ్ తో దోస్తీ కుదుర్చుకున్నారు. పవన్ సైతం బాగా ఆలోచించి తమకు కూడ ఏదో ఒక అండ అవసరం కాబట్టి బీజేపీతో చేతులు కలిపారు.
మొదట్లో నిర్లక్ష్యం చేశారు:
జనసేనతో పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ దాన్ని మొదట్లో అంతగా వాడుకోలేదు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు వారి దారి వారిది వీరి దారి వీరిదే అన్నట్టు ఉండేవారు ఇరు పార్టీలు. లక్ష్మీనారాయణ ప్రధానమైన ఏ విషయంలోనైనా జనసేనను సప్రదించడం, పవన్ సలహా తీసుకోవడం లాంటివి చేసేవారు కాదు. ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఎవరికివారే అన్నట్టు ఉండేవారు. అసలే పవన్ ముభావి. ఆపై బీజేపీ చేసిన నిర్లక్ష్యంతో ఆయన కూడ నాకెందుకులే అన్నట్టు మౌనంగానే ఉండేవారు. దీంతో ఇరు పార్టీల కలయికలో ఏ కార్యక్రమమూ జరిగేది కాదు. ఏ కీలక నిర్ణయమూ వెలువడేది కాదు. దీంతో ప్రత్యర్థులు ఇరు పార్టీలు విడిపోయాయని, దోస్తీ రెండు రోజులకే అటకెక్కిందని ఎద్దేవా చేసేవారు.
వీర్రాజు ఎంట్రీతో సీన్ మారింది:
ఇలా పొత్తు ఉందా లేదా అన్నట్టు సాగుతున్న తరుణంలో అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ దిగిపోయి సోము వీర్రాజు నియమితులయ్యారు. సోము వీర్రాజు స్వతహాగా పవన్ కు సన్నిహితుడు కావడంతో సీన్ మారింది. ఇన్నాళ్లు బీజేపీ పవన్ ను సక్రమంగా వాడుకోలేదని ఆయనకు అర్థమైంది. అందుకే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. పదవి అందుకున్న వెంటనే పవన్ తో సమావేశమై ఇకపై కలిసి నడుద్దామని, భవిష్యత్తులో మరింత బలపడాలని తీర్మానం చేసుకుని వచ్చారు. అలాగే పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక బలమైన సామాజిక వర్గం అండను పొందడానికి బీజం వేసుకున్నారు. బీజేపీ, జనసేనలు కలిసి 2024కు రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతాయని ప్రకటించుకున్నారు.
ప్రతి సమావేశంలో, ప్రెస్ మీట్లో జనసేనతో తమకున్న పొత్తును ప్రస్తావిస్తూ మైత్రీ బంధం బలంగా ఉందనే సంకేతాలిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా జనసేన క్యాడర్ ఇతర పార్టీలను, లీడర్లను నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే వారిని ప్రసన్నం చేసుకునే పని కూడా స్టార్ట్ చేశారు. ప్రజెంట్ సిట్యుయేషన్ మారితే ఇరు పార్టీలు సమిష్టిగా సభలు, సమావేశాలు జరపాలని డిసైడ్ అయ్యారు. సోము వీర్రాజు, పవన్ నిత్యం ఒకరికొకరు టచ్లో ఉంటున్నారట. అందుకే ఈమధ్య ఇరువురి అభిప్రాయాలు, నిర్ణయాలు దగ్గరగా ఉంటున్నాయి. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించడానికి కూడ బీజేపీ సిద్దంగా ఉందని అంటున్నారు కొందరు.