స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే నెల రోజులు దాటేసింది చంద్రబాబు కారాగారవాసం! ఇంటినుంచి వస్తున్న భోజనం, మందులు తీసుకుంటూ బాబు ఆరోగ్యంగానే ఉన్నారని తెలుస్తుంది. మరోపక్క ఆయన సెక్యూరిటీకి వచ్చిన ఇబ్బందులేమీ లేవని అధికారులు చెబుతున్నారు.
ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబును బయటకు తీసుకురావాలని ఆయన తరుపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. పైగా వారితో నారా లోకేష్ సమాలోచనలు కూడా చేస్తున్నారని అంటున్నారు. అయినప్పటికీ బాబుకు ఉపశమనం దొరకడం లేదు. ఈ క్రమంలో సుప్రీంలోనూ పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్లపై చంద్రబాబు లాయర్లు పోరాటం చేస్తోన్నారు. దీనిపై బాబు & కో చాలా హోప్స్ పెట్టుకున్నారని తెలుస్తుంది. అలా అని ఈ కేసు కొట్టేసినంత మాత్రాన్న బాబు బయటకు వస్తారని చెప్పలేం అనే కథనాలు కనిపిస్తున్నాయి. దీని తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్ల అల్లర్ల కేసులు వెంటాడుతున్నాయని చెబుతున్నారు.
ఈ సమయంలో ఈ రోజు ఉదయం నుంచి సుప్రీంలో బాబు క్వాష్ పిటిషన్ పై వాడీ వేడీ వాదనలు జరిగాయి. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది. ఇందులో చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వొకేట్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వాదించగా.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ తన వాదనలను వినిపించారు.
ఈ క్వాష్ పిటీషన్ పై సోమవారమే వాదనలు ఆరంభం అయ్యాయి. ఇదే సమయంలో మంగళవారం కూడా వాదనలు కొనసాగాయి. మధ్యాహ్న భోజనం విరామానికి ముందే తదుపరి విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. అదే సమయంలో హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా తమ ధర్మాసనానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఇందులో భాగంగా… చంద్రబాబు అరెస్టయ్యి ఇప్పటికే నెల రోజులు దాటిపోయిందని, నేడే తుది నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. భోజన విరామం అనంతరం విచారణ పునఃప్రారంభమైనప్పటికీ ఎక్కువసేపు కొనసాగలేదు. దీంతో ముందుగా శుక్రవారం లేక సోమవారం అనుకున్నప్పటీకీ… తదుపరి విచారణన్ను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది ధర్మాసనం.