ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పని అయిపోయిందని విపక్షాలు చెబుతున్నప్పటికీ, ఆ పార్టీ నుండి ప్రధానంగా జనాల్లో వినిపిస్తోన్న పేరు రేవంత్ రెడ్డి. పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ల కంటే ఆ పేరే ఎక్కువగా నానుతోంది. రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడే ఫైర్ బ్రాండ్. 2014లో టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ నిత్యం కేసీఆర్, తెరాసపై విమర్శలు గుప్పించారు. కొత్త సీఎం, ఉద్యమ నేత, తెలంగాణ సెంటిమెంట్ వివిధ కారణాల వల్ల ఆ ప్రభావం తక్కువగా కనిపించిందేమో. కానీ కేసీఆర్ పాలన-2పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. కరోనా నుండి మల్లన్నసాగర్, పింఛన్ల వరకు చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఈ వైఫల్యాలను కాంగ్రెస్ కంటే బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రం రేవంత్ ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు.
ఇటీవల శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న ప్రమాదంప ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. సీబీఐ విచారణ జరిపించాలని, ఈ ఘటనలో క్రిమినల్ కోణం ఉందని బాంబు పేల్చారు. ఈ తరహా ఆరోపణలు ఇతర ప్రతిపక్ష పార్టీలు లేదా ఇతర నేతలు చేయలేదు. జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం వల్ల కొంతమందికి లాభం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. టీఆర్ఎస్ పై బీజేపీ దూకుడుగా ఉంటే, కాంగ్రెస్ నుండి మాత్రం రేవంత్ రెడ్డి ఒక్కరే అరికాలిపై లేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీలోని మిగతా నేతలు తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేసినా అంతగా ప్రాధాన్యత లేకుండా పోతోంది.
సోషల్ మీడియాలోను తెరాస ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. కొండపోచమ్మ సాగర్‌లో అవినీతి జరిగిందని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. అంతకుముందు కట్టలు తెగి నీళ్లు ఊర్లమీదకు వస్తే, ఇప్పుడు రిజర్వాయర్ గేట్ల వద్ద వంతె కుప్పకూలిందని, ఏపీ మంత్రి కంపెనీ నిర్వాకాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ట్వీట్ చేశారు.
సొంత అజెండా.. పక్కా వ్యూహం, ప్రత్యామ్నాయాలు సాధ్యమా?
రేవంత్ రెడ్డి… పార్టీలో పక్కా వ్యూహంతో సొంత అజెండాతో ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఆయన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై కన్ను వేశారని, ఆ కోణంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మొన్న మొన్న వచ్చిన రేవంత్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడం ఏమిటనే చర్చ పార్టీలో ఎప్పటి నుండో ఉంది. అలాగే, కోమటిరెడ్డి వంటి నేతలు రేసులో ఉన్నారు. కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం భావిస్తున్నప్పటికీ, పార్టీలో ఢిల్లీస్థాయి ఇబ్బందులకు తోడు తెలంగాణలోని పార్టీ పరిస్థితుల కారణంగా వెనుకడుగు వేస్తోంది. అయితే అధ్యక్ష పదవి కోసం రేవంత్‌తో పాటు మిగతా నేతలు వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
రేవంత్ రెడ్డికి పార్టీలో ఆశించిన పదవి రాకుంటే ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశాలు లేదా కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమనే వాదనలు ఉన్నాయి. అయితే ఈ రెండు అంత ఈజీ అంశాలు కాదు. బీజేపీలో ఇప్పటికే నిరూపించుకుంటున్న నేతలు ఉండటంతో పాటు వారు మొదటి నుండి పార్టీలో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి వెనుక నిలబడాల్సిందే. సొంత పార్టీ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఫండ్స్‌తో పాటు చాలా కసరత్తు అవసరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానాన్ని చూరగొన్న పవన్ కళ్యాణే గత ఎన్నికల్లో ఏపీలో ఒక్క సీటును మాత్రమే గెలిచారు.
రేవంత్ రెడ్డి భవితవ్యం ఏమిటి?
రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవి ఆశిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చాలామంది దానికి మోకాలడ్డుతున్నారు. అప్పుడు ఆయన ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెరాసలోకి వెళ్లే అవకాశాలు లేవు. బీజేపీలోకి వెళ్తే వెనుక నిలబడాల్సిందే. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నందున ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఇచ్చిన పదవితో సరిపెట్టుకోవాలి. సొంత పార్టీ అంటే అది దాదాపు సాధ్యం కాదని చెప్పవచ్చునని చెబుతున్నారు. ఇదే సమయంలో దుబ్బాకలో ఉప ఎన్నిక వస్తోంది. కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందనే వాదనలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌తో పాటు రేవంత్ రెడ్డి వంటి నేతలు గట్టిగా నిలబడి తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.