ఆడియో ఫంక్షన్స్ లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ … తన సినిమాలోని హీరోలపై ఏ స్థాయిలో స్పందిస్తారనేది తెలిసిన విషయమే! పలు ఆడియో ఫంక్షన్స్ లో ప్రధానంగా పవన్ కల్యాణ్ ను గణేష్.. ఆకశానికి ఎత్తేశాడు. జనం ఏమనుకుంటే ఏమిటి.. తాను చెప్పాలనుకున్నది చెబుతాను.. అనాలనుకున్నది అంటాను.. “సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్” డైలాగ్ తరహాలో తర్వాత నాలుక కరుచుకుంటాను అన్నట్లుగా ముందుకు సాగిపోటుంటుంది అతని వ్యవహారం అని అంటుంటారు.
ఇందులో భాగంగా… పవన్ కల్యాణ్ తన దేవుడని, భగత్ సింగ్ అని, సుభాష్ చంద్రబోస్ అని, నిజాయితీ అంటే పవన్ కల్యాణ్ అని తనపిల్లలకు చెబుతున్నానని మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో… బండ్లకు చరిత్ర పాఠాలు పంపాలని, నవ్విపోదురుగాక అనే పుస్తకం అందించాలని వినిపించిన కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బండ్లగణేష్. అయితే ఈసారి చంద్రబాబు గురించి కావడం గమనార్హం.
స్కిల్ డెవలప్ ప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రలో జైల్లో గత 50 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కోసం తాను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు, ఆ కేసు తనపై వేసుకుని వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు బండ్ల గణేష్. చంద్రబాబు అరెస్ట్ అయిన అనంతరం హైదరబాద్ లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని… అంతా ఊరు వెళ్లి నిరసన తెలపాలని.. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లోనో, ఔటర్ రింగ్ రోడ్ పైనో కాదని అన్నారు.
ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమంలో పాల్గొన్న బండ్ల గణేష్.. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
“భగవంతుడు ఆయుష్షు ఇస్తే సార్ మీ కోసం చచ్చిపోతా” అని మొదలుపెట్టిన బండ్ల గణేష్… చంద్రబాబు కేసు ఎవరైనా మార్చుకోండని అంటే… నన్ను చంపేయండి, నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టండి అని చెబుతాను అని అన్నారు. ఎందుకంటే నేను చచ్చిపోయినా నా భార్య బిడ్డలు హ్యాపీగా బ్రతుకుతారని, వారికి ఏమీ కాదని.. కానీ, చంద్రబాబు మాత్రం దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.
అనంతరం… “తెలుగు వాడిగా పుట్టడం చంద్రబాబు నేరమా..” అని ప్రశ్నించిన బండ్ల గణేష్… తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలోనో పుట్టి ఉంటే… చంద్రబాబుని ఆకాశంలో పెట్టుకుని చూసుకునేవారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు జైలు ఖర్చులకు సంబంధించి వస్తున్న విషయాలపై గణేష్ స్పందించారు. ఇందులో భాగంగా… చంద్రబాబు జైలు ఖర్చులు మేమందరం పెట్టుకుంటున్నాం అని చెప్పిన బండ్ల… “ఈ రోజు ఉద్యోగులందరూ ఒక్క రోజు జీతం ఇస్తే ఎన్ని కోట్లయినా ఖర్చుపెట్టుకుంటాం.. చంద్రబాబుని నిజాయితీగా బయటకు తీసుకొస్తాం” అని తెలిపారు.
ఇదే సమయంలో… ధమ్మున్నోడు చంద్రబాబు, ధైర్యమున్నోడు చంద్రబాబు, నిజాయితీపరుడు చంద్రబాబు, నీతిమంతుడు చంద్రబాబు, మొనగాడు చంద్రబాబు అని బండ్లగణేష్ మాస్ డైలాగ్ విత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పేల్చారు! అనంతరం… “చంద్రబాబు ఒక గాడ్” అని బండ్ల గణేష్ తెలిపారు. అనంతరం లోకేష్ గురించి స్పందించిన గణేష్… చంద్రబాబు రాబోయే 40 ఏళ్లకు బ్రహ్మాండమైన వారసుడిని ఇచ్చారని.. లోకేష్ మరో సైబరాబాద్, మరో అమరావతిని అద్భుతంగా కడతారని చెప్పడం గమనార్హం.