వెన్ను పోటు అంటే ఇలాగే వుంటుందా?

 
ఎపిలో టిడిపి – కాంగ్రెస్ పొత్తు వుంటుందని టిడిపి సాయంతో రేపు ఎన్నికల్లో చట్ట సభల్లో ప్రవేశించ వచ్చనిఆశ పడిన ఎపి కాంగ్రెస్ నేతలు కొందరు టిడిపిలో చేరేందుకు క్యూ కడు తున్నారు. వీరికి విందు రాజకీయాలతో ముఖ్యమంత్రి స్వాగతం చెబుతున్నారు. జాతీయ స్థాయిలో మిత్ర పార్టీగా ఎంచ బడే కాంగ్రెస్ కే ఎసరు పెడితే దీని పరిణామాలు ఏలా వుంటాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు. ఇది ఎపిలో సర్వ సాధారణం. ఒక వేళ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ పరస్పర అవగాహనతోనే ఇదంతా సాగుతోందా? ఒక వేళ ఇదే నిజ మైతే కాంగ్రెస్ పరువు బజారు కెక్కి నట్లే. లేదా ముఖ్యమంత్రి తన సహజధోరణిలో వైసిపి కి చేయి ఇచ్చినట్లు కాంగ్రెస్ కొంపకు కూడా నిప్పు పెడుతున్నారా? 
 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు బిజెపితో తెగ తెంపులు చేసుకున్న తర్వాత రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి “నీవు లేక వీణ పలక లేదన్నది” అంటూ బొబ్బిలి వీణ బహూకరించి జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటును ముమ్మరం చేశారు. అంత క్రితమే బెంగళూరు వేదికపై పలువురు నేతలు చేతులు కలిపి ఐక్యతా రాగం ఆలపించారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు గావించారు. సాక్షాత్తు తెలంగాణ ఎన్నికలలో  కాంగ్రెస్ తో జట్టు కట్టి రాహుల్ గాంధీతో పలు వేదికల మీద పాలు పంచుకొని ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం చేశారు.
 
అయితే తెలంగాణలో ఏం జరిగింది -? టిడిపికి కాంగ్రెస్ పార్టీలకు తల బొప్పి కట్టింది. 40 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ అనుభవం అటు ఇటుగా పదేళ్ల రాహుల్ గాంధీ అనుభవం రెండూ కలగలసితే వచ్చిన ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని టిడిపి కాంగ్రెస్ పార్టీల నేతలకు పిచ్చి బట్టేటు చేసింది. దాని ఫలితమే రానున్న సాధారణ ఎన్నికల్లో టిడిపి కాంగ్రెస్ ఎపిలో వేర్వేరుగా పోటీ చేసేందుకు దారి తీసింది.
 
ఈ పరిణామంతో ముఖ్యమంత్రి గావించు తున్న జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రజల దృష్టిలో ఒక భ్రాంతి గా మిగిలి పోయింది.
 
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎపిలో టిడిపి- కాంగ్రెస్ మధ్య పొత్తు లేదని తేలిపోయిన తర్వాత టిడిపి సాయంతో శాసన సభకు పార్లమెంటుకు ఎన్నిక అయ్యేందుకు చకోర పక్షులులాగా ఎదురు చూస్తుండిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలను టిడిపి లో చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ కు వెన్ను పోటు కాదా? అందుకే కాబోలు ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెసు పార్టీ గైరు హాజరైందనేందుకు ప్రాతిపదిక వుంది. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే హోదాపై తొలి సంతకం చేయించే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అఖిలపక్ష సమావేశంలో ఎందుకు పాల్గొన లేదు?ముఖ్యమంత్రి పై కినుక వహించారా?దురహంకార ఏక పక్ష విధానాలతో ఎపికి తీరని ద్రోహం చేస్తున్న ప్రధాని మోదీని నిలువరించేందుకు ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ కాంగ్రెస్ సాయం ఒక వేపు తీసుకొనేందుకు సిద్ద మౌతూ మరోవైపు తన స్వంత రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను పార్టీనుండి ఫిరాయించేందుకు(ఒక వేళ వారు కోరినా) అనుమతించితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలే కాదు. రాహుల్ గాంధీ యైనా ఇద్దరి మధ్య లాలూచి లేక పోతే సానుకూలంగా ఏలా స్పందించుతారు?ఇది వెన్ను పోటుగా భావించరా? తమకుమిత్ర పక్షంగా వుంటూ తమ పార్టీ నేతలకే ఎసరు పెట్టడం జీర్ణం చేసుకో గలరా? 
ఇందులో మరో ట్విస్ట్ కూడా వుంది. ఇప్పటికే టిడిపి పుష్పక విమానంలావుంది. కోట్ల కుటుంబం టిడిపి లోనికి వస్తే 1)కర్నూలు జిల్లాలో అందరి సంతృప్తి పరచడం ముఖ్యమంత్రి కి తలకు మించిన పని. 2)ఇప్పటికే కప్పల తక్కెడగా వున్న వ్యవహారం మరింత ఉధృతం అవుతుంది. ఉప ముఖ్యమంత్రి కెఇ చేసిన వ్యాఖ్యలు మరింతగా అగ్గిని రాజేయ వచ్చు. 
 
మరో విశేషమేమంటే ఎన్నో ఆటుపోటులు తట్టు కొని కాంగ్రెస్ ను అంటి పెట్టుకొని వుండిన కోట్ల కుటుంబం టిడిపిలో చేరి అధికార పదవులు చేపట్టే తహతహలో టిడిపి తీర్థం పుచ్చు కోవడానికి డొంక దారులు వెతుకుతోంది. ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాకు సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేస్తే టిడిపి లో చేరతానని చెప్పి నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా అందరి ఫిరాయింపుల నేతలు లాగే నెపం కార్య కర్తలపై నెట్టి వారు చెబి నట్లు నడుచు కుంటానని తాజాగా సూర్య ప్రకాష్ రెడ్డి చెప్పారు. అంటే బండి ముందు గుర్రం వెనుక కట్టి సవారీ చేస్తారట. గతంలో వైసిపి ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు అభివృద్ధి పనులు చూచి పార్టీ ఫిరాయించితే ప్రస్తుతం కోట్ల కుటుంబం ప్రాజెక్టులు మంజూరు చేస్తే బేషుగా చేరి పోతారట. ఇప్పటి వరకు జిల్లాలో వున్న టిడిపి నేతలు దద్దమ్మ లైనటు. 
 
మున్ముందు కోట్ల కుటుంబమే కాదు. చిత్తూరు జిల్లాలో మరో నేత అదే దారిలో రాయ బారం నడుపుతున్న ట్లు చెబుతున్నారు. అంతేకాదు. రాష్ట్రంలో ఇంకా కొంత మంది కాంగ్రెసు నేతలు క్యూ కడు తున్నారని జిల్లాల నుండి వార్తలు వస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలతో రాష్ట్రంలో బలమైన నేతలను కాంగ్రెస్ పోగొట్టుకొంటే అదే సమయంలో జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రితో రాహుల్ గాంధీ సఖ్యతగా మెలగ గలరా? ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు యెడల గుర్రుగా వున్నారు.
 
ఈ సందర్భంలో గతం ఒక మారు పరిశీలించితే మరి కొంత క్లారిటి వస్తుంది. 2014 లో టిడిపి అధికారంలోకి వచ్చిన తదుపరి కొద్ది మాసాల్లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు వున్నంత వరకు రాష్ట్రంలో బిజెపి ఎదుగుదల సాధ్యం కాదని కేంద్రం ఇచ్చే నిధులు వ్యయం చేసే సమయంలో ప్రధాని ఫోటో కూడా పెట్టడం లేదని రాష్ట్ర బిజెపి నేతలుచేసిన ఆరోపణలు ఎరుగుదుము. టిడిపికి బిజెపికి రాష్ట్రానికి కేంద్రానికి చెడిన పలు అంశాల్లో ఇదొకటి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెసు తో పొత్తు తర్వాత కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. రాష్ట్రంలో బలమైన కాంగ్రెస్ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీలో కలుపు కొంటే ఈ పాటికే భగ్గుమంటున రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు రాహుల్ గాంధీ స్పందన ఏలా వుంటుందో చూడాలి. ఇదే కొన సాగితే త్వరలోనే బిజెపి అనుభవమే కాంగ్రెస్ తో పొత్తు జాతీయ స్థాయిలో కూడా మూడు నాళ్ళ ముచ్చటగామిగులు తుందేమో.
 
 
( వి. శంకరయ్య ఫోన్ 9848394013)