రాజకీయాల్లో వెన్నుపోటు సర్వసాధారణం. ప్రజల్ని వెన్నుపోటు పొడవకపోతే ఎవరూ రాజకీయ నాయకులవలేని రోజులివి. అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం.. అని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక, వాటిని మర్చిపోవడమంటే ప్రజల్ని వెన్నుపోటు పొడిచినట్లే లెక్క. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు. అన్ని పార్టీలూ చేసేది అదే. అయితే, రాజకీయాల్లో వెన్నుపోటు అనగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేరే ప్రముఖంగా వినిపిస్తుంటుంది.
స్వర్గీయ ఎన్టీయార్ విషయంలో అంతటి దారుణానికి ఒడిగట్టేశారు మరి నారా చంద్రబాబునాయుడు. అందుకే, ఆనాటి ఆ వెన్నపోటు గురించి రాజకీయాల్లో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే వుంటుంది. ఎవరో చేస్తే పాపులర్ అయిన ఉత్త ప్రచారం కాదిది. స్వయానా వెన్నుపోటు బాధితుడైన స్వర్గీయ ఎన్టీఆర్ వ్యక్తం చేసిన ఆవేదన అది. పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడంటూ ఎన్టీయార్, తన అల్లుడు చంద్రబాబుపై మండిపడ్డ ఆనాటి ఆ వీడియో ఇప్పటికీ అందుబాటులోనే వుంది. ‘తెలుగు ప్రజల గుండెల్లో స్వర్గీయ ఎన్టీయార్ చిరస్థాయిగా నిలిచిపోతారు..’ అంటూ వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు చెబుతుంటారు. తప్పదు, చెప్పాల్సిందే.
స్వర్గీయ ఎన్టీయార్ నుంచి టీడీపీని లాక్కున్నాక.. ఎక్కడా ఎన్టీయార్ ఫొటో కనిపించకుండా జాగ్రత్తపడ్డారు చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఎన్టీయార్ పొటో లేకుండా చంద్రబాబు రాజకీయాలు చెయ్యడంలేదు. అప్పటికి ఆ వెన్నుపోటు అవసరం.. ఇప్పుడు ఆ ఎన్టీయార్ ఫొటో అవసరం. స్వర్గీయ ఎన్టీయార్ గురించి చాలామంది చాలా రకాలుగా గొప్పమాటలు చెబుతున్నారు.. ఆయన జయంతి సందర్భంగా. నిజమే.. ఆయన మహనీయుడే, మహానుభావుడే. కానీ, ఎవరూ ఆనాటి ఆ వెన్నుపోటు గురించి మాట్లాడరే.? జయంతి రోజైనా స్వర్గీయ ఎన్టీయార్‌కి జరిగిన అవమానాల గురించి ఆయన పుత్రరత్నం నందమూరి బాలకృష్ణ పెదవి విప్పడేం.? అదంతే, రాజకీయం అంటేనే అంత.