వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నదెవరబ్బా.?

YSRCP

YSRCP

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తిరుపతి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్నది నిర్వివాదాంశం. దొంగ ఓటర్లు కనీ వినీ ఎరుగని స్థాయిలో తిరుపతి మీద ‘దాడి’ చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇంతకు ముందెన్నడూ లేని విపరీత ధోరణి ఇది. అధికార పార్టీనే, దొంగ ఓటర్లను మోహరించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నది విపక్షాల ఆరోపణ. అధికార పార్టీ మీద అత్యంత వ్యూహాత్మకంగా ఈ కుట్ర పన్నారన్నది ఇంకో వాదన. ఏది నిజం.? ఇంతకీ, ఆ దొంగ ఓటర్లను తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలోకి ఇతర నియోజకవర్గాల్లోంచి తీసుకొచ్చిందెవరు.? బురఖా ముసుగులేసి, శ్రీకాళహస్తి దర్శనం కోసమంటూ దొంగ ఓటర్లను ఎందుకు తీసుకొచ్చారు.? పాస్ పోర్టు సేవల కోసమంటూ సెలవు రోజున దొంగ ఓటర్లను ఎలా తీసుకొచ్చారు.? ‘పుంగనూరు నుంచి 40 వాహనాల్ని ఏర్పాటు చేశాం..’ అంటూ ఓ వ్యక్తి చెబుతున్న ఆడియో ఎలా సోషల్ మీడియాలో విడులైంది.? ఎన్నెన్నో ప్రశ్నలు.

వీటన్నిటికీ సమాధానం వెతకాల్సింది అధికారులే. ‘మా ఓట్లు ఎవరో దొంగిలించారు..’ అని అసలు ఓటర్లు వాపోతున్నా, ‘పోలింగ్ ప్రశాంతం’ అని పోలీసులు ఎలా చెప్పగలుగుతున్నారో అర్థం కాని పరిస్థితి. ‘మేం వైసీపీ నేతలు చెబితేనే వచ్చాం. పార్టీ మీటింగ్ అన్నారు.. డబ్బులిచ్చారు.. ఓట్లేయించారు.. మేం పేదోళ్ళం.. మాకు ఏ పాపమూ తెలియదు. ఈ తప్పు ఇంకోసారి చెయ్యం..’ అంటున్నారు దొంగ ఓటర్లుగా వచ్చిన కొందరు మహిళలు. ఒకవేళ మంత్రి పెద్దదిరెడ్డి రామచంద్రారెడ్డి సహా వైసీపీ నేతలంతా చెబుతున్నదే నిజమైతే, ఈ దొంగ ఓటర్లతో వైసీపీకి సంబంధం లేదనే అనుకోవాలి. కానీ, వాళ్ళంతా ఓట్లేసింది వైసీపీకే.. ఔను, వైసీపీకి ఓటెయ్యడానికే తిరుపతికి అక్రమంగా వచ్చారు. అంటే, వైసీపీలోనే ఎవరో వైసీపికి వెన్నుపోటు పొడుస్తున్నారన్నమాట. అదెవరు.? తేల్చాల్సింది వైసీపీ అధిష్టానమే.