ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా వాళ్ల మధ్య “తల్లికి వందనం” అనే విషయంపై చర్చ జరుగుతుందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఇక గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన మహిళలు లోలోపల కుమిలిపోతుంటే… వైసీపీ ఓటు వేసిన వారు మాత్రం ఇది ఊహించిందే కదా, మరో వెన్నుపోటు అని గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అటు టీడీపీ నేతల నుంచి కానీ.. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నుంచి కానీ ఈ “తల్లికి వందనం” వస్తోన్న విమర్శలపై స్పందన రాకపోవడం గమనార్హం. అయితే… పవన్ రియాక్షన్ ని కూడా మహిళా లోకం కోరుకుంటుంది. ఎన్నికల సమయంలో ఈ హామీని చంద్రబాబు అంత గట్టిగా కాకపోయినా.. పవన్ కూడా ఈ హామీ ఇచ్చారు.
ఆ సంగతి అలా ఉంటే… వైసీపీ ఘోరంగా దెబ్బతినడానికి, కూటమి ఈ స్థాయిలో విజయం సాధించడానికి గల కారణాల్లో లిక్కర్ పాలసీ కూడా ఒకటనే చెప్పాలి. ప్రధానంగా వైసీపీ ఈ విషయంలో పెద్ద దెబ్బ తింది. జగన్ హయాంలో కనిపించిన కొత్త కొత్త బ్రాండ్ లు, మద్యం తాగాలంటే పర్మిట్ రూం లు లేక చెట్ల కిందకు పుట్ల కిందకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో… మద్యం ప్రియులు తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఇంకొంతమందైతే మద్యప్రాసన చేసినప్పటి నుంచీ తాగుతున్న బ్రాండ్స్ సడన్ గా మాయం చేయడం ఏమిటంటూ ఫైర్ అయ్యారు. ఆ సమయంలో వాళ్లకు ఏ కారణంతో రోగం వచ్చినా.. అది జగన్ మద్యం ఖాతాలో వేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో… లిక్కర్ పాలసీ గట్టి దెబ్బ కొట్టింది.
ఇదే విషయాన్ని వైసీపీ నేతలు కూడా బహిరంగంగానే అంగీకరించారు. ఇందులో భాగంగా… లిక్కర్ పాలసీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని.. ఆ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి చెప్పినా తమ మాటలు పరిగణలోకి తీసుకోలేదని.. ఇప్పుడు అనుభవిస్తున్నామని అన్నట్లుగా వైసీపీ నేతలు స్పందించిన సంగతి తెలిసిందే.
సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు… కూటమి అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం, తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మెజారిటీ మద్యం ప్రియులు బ్లైండ్ గా కూటమి గుర్తులపై గుద్దేశారనే చర్చ అప్పట్లో సాగింది. ప్రధానంగా ఉదయం ఒక 90 ఎం.ఎల్. తాగి పనులకు వెళ్లేవారు బాబు మాటను బలంగా నమ్మారు.
అయితే… కూటమి అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా… ఇంకా నాటి బ్రాండ్లే కనిపిస్తుండటంతో, అవే ధరలు కంటిన్యూ అవుతుండటంతో మద్యపాన ప్రియులు హర్ట్ అవుతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీలోని ఏ వైన్ షాప్ దగ్గరైనా ఈ అంశంపై ప్రతీరోజూ చిన్న సైజు టీవీ డిబేట్స్ వంటివి జరుగుతున్నాయని అంటున్నారు.
రేపటి పౌరుల విద్య, భవిష్యత్ విషయానికి సంబంధించిన “తల్లికి వందనం” పథకంతో దెబ్బ కొట్టిన బాబు… రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే తండ్రికి “ఇందనం” విషయంలో అయినా వీలైనంత తొందరగా మాట నిలబెట్టుకోవాలని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు “తక్కువ ధరకే నాణ్యమైన మద్యం” అందించాలని మద్యపాన ప్రియులు విపరీతంగా కోరుకుంటున్నారు!!
మరి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ హామీపై ఎప్పుడు షట్టర్ ఎత్తుతారో వేచి చూడాలని అంటున్నారు నెటిజన్లు!!