దళితులకు కూడ పరిహారమేనా.. శాశ్వత పరిష్కారం చూపరా ?

AP government should find permanent solution for atrocities on dalits
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు, అవలంభిస్తున్న విధానాలు కొంత సంచలనంగానే ఉంటున్నాయి.  మూడు రాజధానులు, ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి ఇంగ్లీష్ విద్య, మద్యపాన నిషేధం పేరుతో భారీగా మద్యం ధరల పెంపు.. ఇలాంటి నిర్ణయాలన్నీ సెన్సేషేనే.  ఇప్పుడు వాటి కోవలోకి మరొక విధానం కూడ చేరింది.  అదే బాధితులకి పరిహారం.  ఇక్కడ బాధితులు, పరిహారం అంటే కేవలం ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు మాత్రమే కాదు.. వ్యక్తుల మీద జరిగే సాంఘిక దురాచారాలకు, సామాజిక దాడులకు కూడ పరిహారమే పరిష్కారం అన్నట్టు ఉంది ఏపీ ప్రభుత్వం వైఖరి.  ఈమధ్య విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన బాధితులకు కోటి పరిహారం ప్రకటించి భేష్ అనిపించుకున్నారు జగన్.  అలాగే స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద బాధితులకు భారీ పరిహారం అందజేసి ఆదుకున్నారనే పేరు పొందారు.  మరి ఈ పొగడ్తలు కమ్మగా అనిపించాయో ఏమో కాని సాంఘిక దురాచారమైన దళితుల మీద దాడికి కూడ బాధితులకు ఉపశమనంగా పరిహారాన్ని ప్రకటించారు.  
AP government should find permanent solution for atrocities on dalits
AP government should find permanent solution for atrocities on dalits
 
పోయింది బ్రతుకుదెరువు కాదు ఆత్మగౌరవం :
 
సాధారణంగా ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాలు బాధితులకు పరిహారం అందిస్తుంటాయి.  అది వారి బాధ్యత.  ఉదాహరణకు రైతులు వేసిన పంటలు వరదల్లో కొట్టుకుపోయినా, భూకంపం, తుఫాన్ లాంటి విపత్తులు సంభవించి ప్రజలు ఇళ్లు, ఉపాధి మార్గాలు కోల్పోయినా పరిహారం ఇస్తుంటారు.  ఎందుకంటే బ్రతుకుదెరువు లేకుండా పోతే బ్రతకడం కష్టం కాబట్టి.  జరిగిన నష్టం నుండి కోలుకునే వరకు వారికి ఆ పరిహారం ఒక ఆధారంలా పనిచేస్తుందని.  ఇక సామూహిక ప్రాంతాలు అంటే ఫ్యాక్టరీలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు లాంటి చోట ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే చనిపోయిన వ్యక్తుల మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు పరిహారం అందిస్తారు.  ఈమధ్య జరిగిన విశాఖ, విజయవాడ దుర్ఘటనలు అలాంటివే.  
 
కానీ ఈరోజు కొందరి వ్యక్తుల చేతిలో శిరోముండనం గావించబడి తీవ్ర అవమానానికి గురైన దళిత యువకుడు శ్రీకాంత్ కు కూడ పరిహారం అందించారు ముఖ్యమంత్రి.  ఇందులో లక్ష రూపాయలు, ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇళ్ల పట్టా ఉన్నాయి.  నేరుగా మంత్రి, ఎమ్మెల్యే వెళ్ళి 50 వేలు అందించి, పరిహారం మీద హామీ ఇచ్చారు.  అలాగే కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి ఉదంతంలో నూతన్ నాయుడు పాత్ర ఏమిటనేది విచారిస్తున్నారు.  కేసు రిజిష్టర్ చేయడం, అరెస్టులు జరగడం వరకు బాగానే ఉన్నా పరిహారం ఇవ్వడమే కొంత ఆశ్చర్యంగా ఉంది.  ఎందుకంటే ఇక్కడ బాధితుడు కోల్పోయింది ఆస్తిని కాదు.. దాన్ని మించి విలువైన ఆత్మగౌరవాన్ని.  ఆ ఆత్మగౌరవానికి ఈరోజు డబ్బు, ఉద్యోగం రూపంలో పరిహారాన్ని లెక్కగట్టింది ప్రభుత్వం.  కానీ ఇవ్వాల్సింది పరిహారం కాదు.  బాధితుడికి న్యాయం జరుగుతుందనే భరోసా.  ఇంకోసారి ఇలాంటివి పునరావృతం కావని దళిత జాతికి ధీమా.  దళితుల మీద ఇలాంటి దాడులు అమానవీయమనే సామాజిక స్పృహ.
 
ఇలాంటి దాడి జరగడం ఈమధ్య కాలంలో ఇది  మొదటిసారి కాదు.  మొన్నామధ్యన తూర్పుగోదావరిలో వరప్రసాద్ అనే దళిత యువకుడిని పోలీసులు చితకబాది పోలీస్ స్టేషన్లోనే గుండు గీయించారు.  జరిగిన అవమానానికి తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం డిమాండ్ చేయలేదు.  మావోయిస్టుల్లో చేరడానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశాడు.  ఎంత మానసిక క్షోభకు గురికాకుండా ఉంటే ఆ యువకుడు మావోయిస్టుల్లో కలవాలని అనుకుంటాడు.  సమాజం పట్ల అతనిలో పుట్టిన ఆ వ్యతిరేకత ఎన్ని కోట్ల పరిహారం ఇస్తే మాత్రం చల్లారుతుంది.  అది జరిగిన కొన్నిరోజులకే ఒక దళితుడిని పోలీస్ అధికారి ఒకరు కన్నతల్లి  ముందే బూటుకాలితో కడుపులో తన్నాడు.  మరి చూస్తుండగానే కొడుక్కి జరిగిన అవమానానికి ఎంత పరిహారం, ఎన్ని ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ తల్లి మనోవ్యథ తీరుతుంది.  అలాగే రాజమహేంద్రవరంలో ఎస్సీ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.  ఎంత పెద్ద సర్కారీ కొలువు ఇచ్చినా ఆ అడబిడ్డ పడే క్షోభను రవ్వంతైనా తగ్గించగలమా.  
 
పైన చెప్పుకున్నవన్నీ బయటపడిన కొన్ని  మాత్రమే.  వెలుగు చూడనివి, బెదిరింపులతో, ఆర్థికపరమైన పరిహారాలతో, చిన్నా చితకా మందలింపులతో  పంచాయితీల్లోనే తొక్కివేయబడేవి ఎన్ని ఉంటాయో లెక్క చెప్పడం కష్టం.  వారందరికీ పరిహారం ఇచ్చుకుంటూ పోతే దళిత జాతి మీద జరుగుతున్న ఈ దాడులు, వివక్ష అంతమైపోతాయా.. కావు.  ముమ్మాటికీ కావు.  ఇక్కడ కావల్సింది సామాజిక స్పృహ.  అందరూ సమానమేనన్న భావన.  
 
వాటిని తీసుకురావలసిన బాధ్యత ప్రభుత్వానిదే.  ఇన్నాళ్లు రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న నాయకులు, పార్టీలు దళితులకు అండగా ఉంటామని మాటలు చెప్పడమే కానీ చేసి చూపింది లేదు.  వైఎస్ జగన్ కూడా ఈ వివక్షను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చెప్పలేదు.  అసలు ప్రజల్లో ఈ వివక్ష పట్ల అవగాహన తీసుకురావడానికి,  దళితుల ఆత్మగౌరవ భద్రతకు మన ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన ప్రణాళిక ఏదీ లేదు. ముందు ఆ దిశగా ప్రభుత్వం పనిచేసి శాశ్వత పరిష్కారం కనుగొనాలి కానీ దాడి జరిగాక పరిహారం, అరెస్టులు అంటే మాత్రం ఈ దుర్మార్గం ఇలా కొనసాగుతూనే ఉంటుంది తప్ప ఎప్పటికీ ఆగదు.