అమరావతి (గుంటూరు జిల్లాలో చారిత్రాత్మకంగా ఉన్న గ్రామం కాదు) అనేది ఇప్పుడు జాతీయ సమస్యగా రూపాంతరం చెందే దశలో ఉంది. కొత్త ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణవైపు ద్రుష్టి పెట్టడం, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు న్యాయం జరిగేలా పాలన చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం, అమరావతి కేవలం లెజిస్లేటివ్ (చట్టసభల) రాజధానిగా మాత్రమే ఉంటుందని చెప్పడం, పరిపాలనా (సచివాలయం) రాజధానిగా విశాఖపట్నం, న్యాయ (హై కోర్టు) రాజధానిగా కర్నూలు ఉంటాయని చెప్పడం, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుండడంతో అమరావతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ ఉద్దండుడు, వ్యూహకర్త, విజనరీ, వంటి అనేకానేక బిరుదులు తనకు తానే ఇచ్చుకున్న చంద్రబాబు తాను కలలు కన్న ప్రపంచనగరం అమరావతి ఇప్పుడు అదృశ్యం అయిపోతోందనే భయంతో ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు ఎవరినీ సంప్రదించలేదు. ఎవరితోనూ చర్చలు జరపలేదు. ఎలాంటి నిరసనను ఖాతరు చేయలేదు. ఎలాంటి సలహాలూ పాటించలేదు. పర్యావరణ వేత్తలు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. వ్యవసాయవేత్తలు హెచ్చరించినా పట్టించుకోలేదు. సామాజిక వేత్తలు రైతుకూలీలు రోడ్డునపడతారు అని హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదు. కొందరు రాజధాని ప్రాంత ప్రకటనకు ముందుగానే తక్కువ రేట్లకు భూములు కొనేశారు. మరికొందరు ప్రకటన వచ్చాక కొనేశారు. మొత్తం మీద రైతుల దగ్గర ఉన్న భూమి కంటే ఇలా ఇతరులు కొనుగోలు చేసిన భూమే ఎక్కువ. నగరం అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు రెట్టింపు అవుతుంది.
నగర నిర్మాణం మొదలైంది కాబట్టి అది పూర్తయ్యేవరకూ, కనీసం పదేళ్ళు తనకే అధికారం కట్టబెడతారు అనే ఊహల్లో ఉన్న చంద్రబాబు ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని అనేక చర్యలు అమలు చేశారు. ఇప్పుడు కల చెదిరింది. అనుకున్నదొక్కటి, అయిందొక్కటి. మొదలు పెట్టిన నగర నిర్మాణం పూర్తికాకముందే పదవి చేజారింది. కొత్త పాలకుడు ఈ కలల నగరాన్ని చెదరగొడుతున్నాడు. అధికారం పోయింది. ఇప్పుడు పెట్టుబడులు కూడా పోతున్నాయి. ఎన్నో ఆశలతో, ఎన్నో అంచనాలతో కొన్న భూములు ఇప్పుడు పనికిరాకుండా పోయేలా ఉన్నాయి. కోట్లరూపాయల పెట్టుబడి ఆశించిన దారిలో వచ్చేలా కనిపించడం లేదు. లాభాలు రాకపోయినా పర్లేదు. పెట్టిన సొమ్మైనా దక్కితే చాలు అనే పరిస్థితి వచ్చింది. అందుకే ఒక పార్టీ, ఆ పార్టీకి మద్దతుగా ఉండే ఒక కులం, ఆ కులంలోంచి వచ్చిన మీడియా, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, మహిళలు ఇప్పుడు రోడ్డెక్కావలసిన పరిస్థితి వచ్చింది.
కలల నగరం నిర్మిస్తానన్న నాయకుడు రోడ్డుపై జోలె పట్టి తిరుగుతున్నారు. పెట్టుబడులు పెట్టిన ఆశావహులు ఇప్పుడు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. దాచుకున్న సొమ్ము, వంటిపై ఉన్న బంగారం అమ్మి అమరావతిలో భూములు కొనడాన్ని ప్రోత్సహించిన మహిళలు ఇప్పుడు మొదటిసారిగా రోడ్డెక్కుతున్నారు. ఆ నేతలు, ఆ వ్యాపారవేత్తలు, ఆ మహిళలు, ఆ మీడియా… ఇవన్నీ చూస్తుంటేనే అమరావతి ఎవరి నగరమో, ఎవరి కలో, ఎవరికోసం మొదలుపెట్టిన యఙ్ఞమో స్పష్టంగా తెలుస్తోంది. ఆ పత్రికలు, ఆ టీవీ చానళ్ళు, ఆ పార్టీ నేతలు… ఇలా ఒక్కటేమిటి, అమరావతిపై ఆందోళన చూసినా, ఆందోళన చేసేవారిని చూసినా, ఆందోళను మోస్తున్న మీడియాను చూసినా కనిపించేది ఒక సామాజిక వర్గమే. “అది అమరావతి కాదు, భ్రమరావతి” అన్నట్టుగానే ఆ నగరంపై ప్రజల భ్రమలు తొలగిపోతున్నాయి.
“అది అమరావతి కాదు కమరావతి” అని ప్రచారం జారినట్టుగానే ఒక్క కులమే రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా, మేధో పరంగా, మీడియా పరంగా మహిళలతో కలిసి నడుస్తోంది. మొన్న మందడంలో చూసినా, నిన్న బెజవాడ బందరురోడ్డులో చూసినా ఒక సామాజికవర్గం మహిళలే కనిపించారు. ఆ మహిళలు రాష్ట్రం విడిపోతున్నప్పుడు రోడ్డున కనిపించలేదు. ఆ మహిళలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పోరాటాలు జరుగుతున్నప్పుడు కనిపించలేదు. అమరావతి పోతుందనే భయంతో కనిపించారు. రోడ్డెక్కారు. దీన్ని బట్టే చెప్పొచ్చు…. అమరావతి ఏంటి? అమరావతి ఎవరిదీ? నిన్నటి బెజవాడ బందరు రోడ్డు మహిళా ప్రదర్శన అమరావతి ఎవరి నగరమో, ఆ పోరాటం ఎవరిదో చెప్పేసింది. ఇక మీడియా చెప్పేది కూడా అదే.
పలువురు రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు, మీడియా పెద్దలు కూడా అమరావతిలో చంద్రబాబు చూపించిన ఊహాచిత్రాలను నమ్మి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు రాజధాని అమరావతి కాకపోతే ఆ పెట్టుబడులు వృధా అవుతాయనే భయం వీళ్ళలో ఉంది. అందుకే ఈ పోరాటం. ఈ పోరాటం ఒక కులం కోసం. కులం చేతిలో ఉన్న రాజకీయం కోసం. కులం చేతిలో ఉన్న మీడియా కోసం. కులం చేతిలో ఉన్న పెట్టుబడదారుల కోసం. ఒక సామాజిక వర్గం కోసం జరుగుతున్న నాటకాన్ని ఒక సమాజం చూస్తూ ఉంది.
Written by
-Aditya for TeluguRajyam.com