పోగాలము దాపురించినపుడు రాధాకృష్ణలా మాట్లాడుతారు!

YS Jagan Vs NV Ramana
మాయాబజార్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉన్నది..”ఆహా…కౌరవ హతకుల ఆర్తనాదములు కర్ణపేయములుగా ఉన్నవి”  అంటాడు ఘటోత్కచుడు పరవశంతో చెవుల వద్ద చేతులు పెట్టుకుని!  చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి, వందలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో దోచేసుకున్న రాధాకృష్ణకు గత ఏడాదిన్నరగా నయాపైసా ఆదాయం ప్రభుత్వం నుంచి రాకపోవడంతో పాటు,  తన యజమాని చంద్రబాబుకు ఇక భవిష్యత్తే లేదని నిర్ధారణ కావడంతో గంగవెర్రులెత్తిపోతూ వారం వారం  వృద్ధాప్యం పైబడి విటులు కొరవడిన  వారాంగన వలె నిష్టూరాలు, శాపనార్ధాలతో కాలం గడుపుతూ,  చిచ్చరపిడుగులా దూసుకునిపోతున్న జగన్మోహన్ రెడ్డి ప్రళయ  ఝOఝను భరించలేక విలవిలలాడిపోతూ  మరోసారి తన “వినాశకాలే విపరీతబుద్ధి” ని ప్రదర్శించుకున్నాడు! 
 
YS Jagan Vs NV Ramana
 
“””భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావలసి ఉన్న జస్టిస్‌ రమణపై జగన్‌ చేసిన ఫిర్యాదును న్యాయవాదుల సంఘాలతో పాటు పలువురు న్యాయ నిపుణులు తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే సదరు ఫిర్యాదును విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రభుత్వం బహిర్గతం చేయడాన్ని పలువురు ఆక్షేపించారు. “”””
 
జస్టిస్ రమణపై ఫిర్యాదులు చేసినంతమాత్రానే అంత ఉలికిపాటు దేనికి?  ఆ ఆరోపణలపై ఏమి చెయ్యాలో సుప్రీమ్ కోర్ట్ నిర్ణయిస్తుంది కదా!  న్యాయవాదుల సంఘాలు, న్యాయనిపుణులు తప్పు పట్టినంతమాత్రాన తప్పులు లేకుండా పోతాయా?  ఫిర్యాదు చేసింది ఒక రాష్ట్ర ప్రభుత్వం.  ఖండించింది భారత న్యాయవ్యవస్థ కాదు.  ఎవరో కొందరు న్యాయవాదులు.  వారు ఖండిస్తే అది  తీర్పు అవుతుందా?  అలా ఫిర్యాదు చెయ్యడం తప్పు అంటూనే మరొకవైపు ఫిర్యాదు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది అనే ఒక సన్నాయినొక్కు.. ఇంతకూ ఫిర్యాదు చెయ్యడం తప్పా?  విలేకరుల సమావేశం పెట్టి వెల్లడించడం తప్పా అనే క్లారిటీ రాధాకృష్ణ ఇవ్వలేదు.  ఆయనకే లేనపుడు మనకెలా ఇస్తారు?  
****
 
“””జస్టిస్‌ రమణపై ఫిర్యాదు చేసే నైతికత జగన్మోహన్‌ రెడ్డికి ఉందా? సదరు ఫిర్యాదులో పస ఉందా? ఫిర్యాదు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? జగన్‌ను ఈ దుస్సాహసానికి ప్రేరేపించింది ఎవరు అన్నది ఇప్పుడు చూద్దాం. జస్టిస్‌ బోబ్డే పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్‌ రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సి ఉంది.””””
 
నైతికత గూర్చి రాధాకృష్ణ మాట్లాడటం అంటే భూతాలు, పిశాచాలు మంగళవాయిద్యాలు వాయించినట్లుంది.  జగన్ మీద ఎవరో పనికిమాలిన ఆరోపణలు చేసి, ఎనిమిదేళ్ల నుంచి విచారణ జరిపి ఒక్క రూపాయి కూడా అవినీతిని తేల్చలేక సిబిఐ ఏనాడో చేతులు ఎత్తేసింది.  సిబిఐ ఆరోపించిన క్విడ్ ప్రో కో కు ఆధారాలు లేవని విచారణ జరిపించిన సిబిఐ స్వయంగా కోర్టుకు వెల్లడించింది.  అయినా నేరాలు ఆరోపించబడినంత మాత్రాన నైతికత లోపించినట్లా?  మరి అలా అయితే ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా దొరికిపోయిన చంద్రబాబుకు మాట్లాడే నైతిక అర్హత ఉన్నట్లా?  జస్టిస్ రమణ మీద కూడా విచారణ జరిపించి ఆయన నిరపరాధిగా బయటపడితే అది ఆయన జీవితానికే మంచిది కదా!  మచ్చలేని మహోన్నత న్యాయమూర్తిగా ఆయన ప్రభలు వెలిగిపోతాయి కదా?  ఏ విచారణ లేకుండానే జస్టిస్ రమణ మీద ఆరోపణలు చెయ్యడమే నేరం అన్నట్లుగా రాధాకృష్ణ ఏ నైతికతతో తీర్పులు ఇస్తున్నారు?  
****
 
“””ఈ కొనుగోలు ప్రక్రియ ఏ చట్టం కింద నేరమవుతుందో జగన్‌ చర్యలను సమర్థించేవారితో పాటు జగన్‌ లేఖపై విచారణ జరపాలని కోరుతున్న వారు చెప్పాలి. ప్రభుత్వ ప్రకటనకు ముందు అక్కడ భూమి కొనుగోలు చేసినా చట్ట ప్రకారం నేరం కాదు. కాకపోతే అనైతికమని నిందించవచ్చు. అయినా జగన్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని కొంతమంది న్యాయ నిపుణులు కోరడం వింతగా ఉంది. “””
 
మనం ఏదైనా కేసు పెట్టాలనుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ కు వెళ్తాము.  మన ఆరోపణలు ఏ చట్టం కిందికి వస్తాయో పోలీసులు నిర్ణయించి కేసులు నమోదు చేస్తారు.  అంతే తప్ప ఫలానా చట్టం, ఫలానా సెక్షన్ కింద కేసులు నమోదు చెయ్యమని మనమే పోలీసులకు సలహా ఇస్తామా?  జగన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు ఏ చట్టం కింద నేరమవుతుందో న్యాయస్థానం చెప్పాలి కానీ, ఆరోపించినవారే చెబుతారా?  జస్టిస్ రమణ మీద వచ్చిన ఆరోపణలు అబద్ధమని ఏ చట్టం కింద రాధాకృష్ణ చెప్పగలుగుతున్నారు?   రేపొకవేళ సుప్రీమ్ కోర్టు విచారణ జరిపించి, ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిజమని తేలితే రాధాకృష్ణ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? 
****
 
“”””తనకు శిక్షపడే అవకాశం ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయడం నచ్చని కారణంగానే జస్టిస్‌ రమణను ముఖ్యమంత్రి టార్గెట్‌ చేసుకున్నారన్నది బహిరంగ రహస్యం.””””
 
జగన్ కు శిక్ష పడటానికి జస్టిస్ రమణకు సంబంధం ఏమిటి?  రాధాకృష్ణ ఈ రెండింటికి ముడి పెడుతున్నారంటే జగన్ పై ఉన్న కేసులను జస్టిస్ రమణ ప్రభావితం చేస్తారని, విచారణ జరిపి జగన్ కు వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని రాధాకృష్ణ కు సమాచారం ఉన్నదా? 
 లేక  జగన్ మీద అందరూ కలిసి కుట్ర చేస్తున్నారా?  ఈ వాక్యం ద్వారా జస్టిస్ రమణను అనుమానితుడిగా నిలబెడుతున్నానన్న అనుమానం రాధాకృష్ణకు రాలేదా? 
****
 
“””రాజ్యాంగం వెసులుబాటు కల్పించినంత మాత్రాన పలు కేసులలో నిందితుడిగా ఉన్నా కూడా ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని న్యాయమూర్తులపై ఫిర్యాదు చేయవచ్చా? అలాంటి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలని కోరడం న్యాయవ్యవస్థ నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడమవదా? భూములు కొనుక్కోవడమే నేరమైతే జగన్‌రెడ్డిపై ఉన్న కేసులలో విచారణ కూడా అవసరం లేదు,””””
 
రాధాకృష్ణకు మతి స్థిమితంగా లేదని పై వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.  న్యాయమూర్తులపై ఫిర్యాదు చెయ్యడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించిందని రాజ్యాంగపండితుడు  రాధాకృష్ణ అంగీకరిస్తున్నారు.  అయితే రాజ్యాంగ నిర్మాతలు చేసిన పొరబాటు ఏమిటంటే నిందితులు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించడం నేరమవుతుందని  2020 సంవత్సరంలో రాధాకృష్ణ లాంటి మహా మేధావి ఒకరు తమను ప్రశ్నిస్తారని ఊహించలేకపోవడం!   ఫిర్యాదులు పరిగణనలోకి తీసుంటే న్యాయవ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం ఎలా అవుతుంది?  ప్రభుత్వ నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడానికి న్యాయవ్యవస్థకు హక్కు ఉన్నదా మరి?    
****
 
“””” న్యాయమూర్తి కావడానికి ముందు జస్టిస్‌ రమణ తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలిగేవారని, ఆ కారణంగానే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీకి మేలు చేయడం కోసం హైకోర్టును ప్రభావితం చేస్తున్నారన్నది మరో ఆరోపణ. న్యాయమూర్తులు ఆ పదవిలో నియమితులు కావడానికి ముందు రాజకీయ పార్టీలకు సంబంధించిన కేసులను వాదించడం సర్వ సాధారణం.””””
 
జస్టిస్ రమణ తెలుగుదేశంతో సన్నిహితంగా మెలిగేవారనే విషయం ఆరోపణ ఏమిటి?  అది వాస్తవమే కదా!   అయినా విచారణ జరిపించి జగన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు అబద్ధమని తీర్పు ఇస్తే అది న్యాయవ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది కదా!   దానికి భయం దేనికి? 
****
 
“”” ఏకంగా కాబోయే భారత ప్రధాన న్యాయమూర్తినే ఆత్మరక్షణలోకి నెట్టగలిగితే, మొత్తం న్యాయ వ్యవస్థనే ఆత్మరక్షణలోకి నెట్టవచ్చన్నది ఆయన ఉద్దేశం కాబోలు.  కేంద్ర హోంమంత్రిని, భారత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత మాత్రమే జస్టిస్‌ రమణపై ఫిర్యాదును ప్రధాన న్యాయమూర్తికి అందించడం వెనుక కూడా వ్యూహం దాగి ఉంది. తన చర్యలకు నరేంద్ర మోదీ, అమిత్‌ షాల మద్దతు ఉందని న్యాయ వ్యవస్థను నమ్మించాలనుకోవడం ఆ వ్యూహం. నిజంగా ఇందులో వాస్తవం లేదు. న్యాయవ్యవస్థతో పరిహాసమాడాల్సిందిగా ప్రధానమంత్రి చెబుతారా? ప్రజలను తప్పుదారి పట్టించడానికే జగన్‌ అండ్‌ కో ఆ సమయాన్ని ఎంచుకున్నారు.”””” 
 
ఎప్పటిలాగానే మళ్ళీ కాబోలు…కావచ్చు…అట..అనే పడికట్టు పదాలతో ఊహాగానాలు, పైత్యాన్ని వాంతి చేసుకోవడాలు!   జగన్ చేసినవి  పసలేని ఆరోపణలు అంటూనే న్యాయవ్యవస్థ ఆత్మరక్షణలో పడుతుంది అంటూ దొంగ ఏడుపులు ఎందుకంటా???  ఇక ప్రధానితో, హోమ్ మంత్రితో కలిసిన తరువాత ఈ ఫిర్యాదును చేసారంటూ చెబుతూ మళ్ళీ మోడీకి, అమిత్ షాకు ఆగ్రహం రాకుండా వారికేమీ సంబంధం ఉండదని ఒక సర్టిఫికెట్ ఇవ్వడం!  హహ్హాహ్….మోడీమీద చిన్న ఆరోపణ చేయాలంటేనే చంద్రబాబు, రాధాకృష్ణకు ముచ్చెమటలు పడుతున్నాయి!  కాలమహిమ మరి…
*****
 
“””తన ఫిర్యాదుపై జాతీయ మీడియాలో రచ్చ జరుగుతుందని, ఫలితంగా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకుండా జస్టిస్‌ రమణను అడ్డుకోవచ్చన్న జగన్‌ ప్రయత్నం వికటించింది. ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా జగన్‌ తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయారు. ఆర్థిక నేరాలకు సంబంధించి తీవ్రమైన అభియోగాలు జగన్మోహన్‌ రెడ్డిపై ఉన్నాయన్న విషయం సుప్రీంకోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు న్యాయమూర్తులకు తెలియదు””””
 
ఈ పేరా చదివితే జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల మీద సుప్రీమ్ కోర్ట్ జరిపించి విచారణలో  రుజువు కాలేదని, జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోలేకపోయారని, జగన్ లక్ష్యం నెరవేకపోవడంతో జగన్ తనగోతిలో తానె పడిపోయారని పొరపాటు పడతారు!   ఇది రాధాకృష్ణ మనసులోని కోరిక అని మనం సరిపెట్టుకోవాలి.   ఇక జగన్ మీద అభియోగాలు ఉన్న విషయం సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులకు తెలియదని రాధాకృష్ణ న్యాయమూర్తుల అజ్ఞానం పట్ల తెగ జాలి పడుతున్నాడు.  ఈ దేశంలో లక్షలమంది మీద ఆరోపణలు ఉంటాయి.  అవన్నీ న్యాయమూర్తులకు తెలుస్తాయా?  తమ ముందుకు వస్తే న్యాయమూర్తులు విచారిస్తారు తప్ప ఎవరెవరి మీద ఎలాంటి కేసులు ఉన్నాయో తెలుసుకోవడం న్యాయమూర్తుల బాధ్యతా?  అంతెందుకు?  జస్టిస్ రమణ కుమార్తెలు, కొందరు హైకోర్టు న్యాయమూర్తులు అమరావతిలో భూములు కొన్నారన్న విషయం గౌరవ సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులకు తెలుసేమో రాధాకృష్ణ గారు చెబితే బాగుణ్ణు! 
****
 
“””జగన్మోహన్‌ రెడ్డికి ఇంత ఘన చరిత్ర ఉందా? అని న్యాయమూర్తులతో పాటు న్యాయ నిపుణులు కూడా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. 50 శాతం ఓట్లతో 151 మంది ఎమ్మెల్యేలతో అసాధారణ విజయం సాధించిన నాయకుడిగానే జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో పలువురికి తెలుసు. ఆయనపై ఇన్ని కేసులు ఉన్నాయా? అని ఇప్పుడు తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. జస్టిస్‌ రమణను ఏదో చేయాలనుకుని చేసిన ఫిర్యాదు ఆయన మెడకే చుట్టుకోబోతున్నది.””””
 
ఓహోహో….అయితే జగన్ మోహన్ రెడ్డి యాభై శాతం ఓట్లతో 151  సీట్లు గెల్చుకుని అసాధారణ విజయం సాధించిన నాయకుడుగా ఢిల్లీలో అందరికీ తెలుసన్నమాట!  శెభాష్…అదే సమయంలో తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు, ఢిల్లీలో చక్రాలు తిప్పిన చంద్రబాబు ఇరవై మూడు సీట్లకే పరిమితం అయ్యారని, కనీసం సొంత కుమారుడిని కూడా గెలిపించుకోలేక చతికిల పడ్డారని కూడా ఢిల్లీలో తెలుసా?  అలాగే ఓటుకు ఓటు కేసులో దొరికిపోయి, కేసీఆర్ ఆగ్రహించగానే పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును కూడా వదులుకుని రాత్రికి రాత్రే అమరావతి పారిపోయిన చంద్రబాబు ఘనచరిత్ర కూడా ఢిల్లీలో తెలుసో లేదో పాపం! 
****
 
“””వ్యవస్థ తనకు అన్యాయం చేసిందని జస్టిస్‌ చలమేశ్వర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కూడా బాధపడేవారట. ఈ నేపథ్యంలోనే జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్‌ చలమేశ్వర్‌ మరో ముగ్గురు సహచర న్యాయమూర్తులతో కలిసి ఆయనపై తిరుగుబాటు చేసినంత పనిచేశారు. “”””
 
దీనిద్వారా ఏమి చెప్పదలచుకున్నారు రాధాకృష్ణ గారు?  సాక్షాత్తూ నలుగురు సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులే వ్యవస్థ తమకు అన్యాయం చేసిందని బాధపడినపుడు ఇక సామాన్యులు బాధపడరా?  నలుగురు న్యాయమూర్తులే అలా తమకు అన్యాయం జరిగిందని బహిరంగంగా వాపోయినపుడు జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చెయ్యడంలో తప్పేముంది?  
****
 
“””న్యాయమూర్తిగా జస్టిస్‌ చలమేశ్వర్‌ ఎంపిక కావడానికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరోక్ష సహకారం ఉంది. “””””
 
భలే..భలే…ప్రతివారం లానే ఎక్కడో ఒకచోట మన రాధాకృష్ణ నిజం కక్కి దొరికిపోతాడు.  జస్టిస్ చలమేశ్వర్ న్యాయమూర్తిగా ఎంపిక కావడానికి చంద్రబాబు సహకారం ఉన్నది అని చెప్పేశాడు.  అదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది…సామాన్యులు కూడా నమ్ముతున్నది.  చంద్రబాబు వివిధ వ్యవస్థలలో బలమైన విత్తనాలు వేశారు అని సామాన్యుల అభిప్రాయాన్ని నిజమని సమర్ధించారు రాధాకృష్ణ!  
****
 
“”””అయితే ఆ లేఖ రాసిన రెండేళ్ల తర్వాత అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గజేంద్ర గడ్కర్‌ హైకోర్టును సందర్శించి జస్టిస్‌ చంద్రారెడ్డిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వడం, ఆ తర్వాత కొంత కాలానికి జస్టిస్‌ చంద్రారెడ్డిని మద్రాసు హైకోర్టుకు బదిలీ చేయడం జరిగింది. “”””
 
మరి ఇంకేమి?  అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఆనాటి ముఖ్యమంత్రి లేఖపై విచారణ జరిపించి ఆ ఆరోపణలు నిజమని రుజువు కావడంతో జస్టిస్ చంద్రారెడ్డిపై బదిలీ వేటు వేశారని సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా!  అంటే ముఖ్యమంత్రి స్థాయిలో చేసే ఫిర్యాదులకు విలువ ఇవ్వాలని రాధాకృష్ణగారు అంగీకరిస్తున్నారు కదా!   మరి విచారణ జరగకుండానే, ఫిర్యాదు చేసినవారికి దురుద్దేశ్యాలు ఆపాదించడం దేనికి? 
****
 
“”” ఇప్పుడు జగన్‌ రెడ్డి విషయంలో జరుగుతున్నది ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసైనా న్యాయ వ్యవస్థతో ఎలా వ్యవహరించాలో జగన్‌ రెడ్డి తెలుసుకోవడం అవసరం.”””
 
అవును..కేసీఆర్ ను చూసి జగన్ నేర్చుకోవాల్సిందే.  తప్పేమి లేదు.  కేసీఆర్ ఎంతో అనుభవజ్ఞులు.  పెద్దవారిని  చూసి నేర్చుకోవడం నేరం కాదు.  అలాగే “ప్రభుత్వ వ్యవహారాల్లో, కేబినెట్ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోము” అని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టును చూసి ఆంధ్రప్రదేశ్ హై కోర్టు కూడా నేర్చుకోవాలని ఒక సలహా ఇస్తే రాధాకృష్ణ సొమ్మేం పోతుంది? 
***
 
“”””చరిత్ర సృష్టించిన వారు చరిత్రహీనులుగా మారాలనుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? తనను తాను రక్షించుకుని న్యాయాన్ని రక్షించే సత్తా మన న్యాయ వ్యవస్థకు ఉంది. జగన్మోహన్‌ రెడ్డి వంటి నిందితుల బెదిరింపులకు, ఫిర్యాదులకు భయపడి పారిపోయే బీరువులు కావు మన న్యాయస్థానాలు. జగన్‌ చర్యలను గమనిస్తున్నవారు వినాశకాలే విపరీత బుద్ధి అని వ్యాఖ్యానించకుండా ఉండలేరు. న్యాయవ్యవస్థలో పనిచేసిన వారు కొందరు అదే న్యాయ వ్యవస్థను చెరబట్టాలనుకునే వారి వైపు నిలబడాలనుకోవడం నిజంగా విషాదం.””””
 
పాపం!  ఎంత దాచుకుందామన్నా నిప్పు గుప్పెట్లో దాగుతుందా?  జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని రాధాకృష్ణ ఏడుస్తూనే ఒప్పుకుంటున్నాడు.  మరి ఆయన చరిత్ర హీనులుగా మిగులుతారో, మరింత గొప్ప చరిత్రను సృష్టిస్తారో కొన్నాలు వేచి చూడచ్చు కదా!  న్యాయస్థానాలను భీరువులుగా ఎందుకు అభివర్ణిస్తున్నారు రాధాకృష్ణ?  న్యాయస్థానాలను ఇపుడు ఎవ్వరూ విమర్శించడం లేదు, భయపెట్టడం లేదు.  కొందరు న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేస్తున్నారు.  వాటికి కంగారు దేనికి?  పత్రికారంగంలో సుదీర్ఘకాలం పనిచేసి, ముఖ్యమంత్రులకు, కులగజ్జికి దాసోహం అని వందల కోట్ల రూపాయలు దోచేసినవారు,  పనిగట్టుకుని ఒక యువకుడి మీద నీచాతినీచమైన ఆరోపణలు చేస్తూ,  పొద్దస్తమానం బురద జల్లుతూ,  పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హరించడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ,  అవినీతిపరులు, వెన్నుపోటుదార్లకు భజనలు చేస్తూ,   పత్రికావిలువలను సర్వనాశనం చేసినవారు ఎలా ఉన్నారో, న్యాయవ్యవస్థలో కూడా  అలాంటివారే ఉన్నారనుకుని ఒక్క నిట్టూర్పు విడిస్తే పోలేదా రాధాకృష్ణగారు!  ఏమంటారు??
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు