ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే దిక్కార స్వరం వినిపించారో.. నాటి నుంచి ప్రతిపక్ష టీడీపీ ఫుల్ ఫాం లోకి వచ్చేసింది. ఈ నలుగురే కాదు.. నలభైమంది వైకాపా నేతలు తమతో టచ్ లో ఉన్నారు.. ఇంకా వస్తారు.. అంటూ వైకాపాను టీజ్ చేస్తుంది. ఇదే క్రమంలో.. ఈసారి 175 నియోజకవర్గాల్లోనూ వైకాపాను ఓడిస్తామనేవరకూ వెళ్లింది. దీంతో… ఏపీ పొలిటికల్ వాతావరణం రోహిణీ కార్తి ఎండలను మించుతుంది.
ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ – ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల దాడి రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇరుపార్టీలూ రకరకాల ట్రిక్స్ చేస్తున్నారని.. ఆపరేషన్ ఆకర్ష అని ఒకరంటే.. వికర్ష కాకుండా మరొకరు చూసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మైడ్ గేం పాలిటిక్స్ లో ఎక్స్ పర్ట్ అయిన చంద్రబాబు వ్యూహాల నుంచి తప్పుంచుకునే పనిలో వైకాపా ఉందని అంటున్నారు.
వ్యక్తిగత కారణాలతోనో, వ్యవస్థాగత సమస్యలతోనో నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఈ విషయమే ఇప్పుడు టీడీపీకి బలమై కూర్చుంది. ఇక ఆలస్యం చేయని బాబు… మైండ్ గేం స్టార్ట్ చేశారు. మరోపక్క బలమైన మీడియా సపోర్ట్ కూడా బాబుకి ఉండటంతో… దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండనే స్థాయిలో వ్యవహారం సాగుతుంది! అయితే… ఈ విషయంలో వైకాపా నేతలు కూడా మాటల దాడి చేసి, బాబుపై పరోక్షంగా ట్రిక్స్ ప్లే చేస్తున్నారు.
వైసీపీకి చెందిన నలభై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్న టీడీపీ నేతలు… వారెవరో చెప్పే సాహసం చేయగలరా అని ప్రశ్నిస్తున్నారు వైకాపా నేతలు. రాబోయే ఎన్నికల్లో కుప్పమే అనుమానంగా ఉన్న పరిస్థితుల్లో… వైకాపాను వీడి టీడీపీలోకి ఎందుకు వెళ్తారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. అక్కడితో ఆగని వైకాపా నేతలు… తమకు కూడా టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు.
తమకు కూడా టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని.. తాము కూడా తలుపులు బార్లా తీస్తే… చంద్రబాబు – అచ్చెన్నాయుడు తప్ప మిగిలినవారంతా ఫ్యాన్ కిందకు చేరిపోతారని అంటున్నారు వైకాపా నేతలు. “నిజంగా బాబు చెబుతున్నట్లు 40మంది టచ్ లో ఉంటే… ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారు.. ఇప్పుడే లాక్కుంటే కార్యకర్తలకూ క్లారిటీ వస్తుంది.. మీ పార్టీలో ఇప్పటికే ఆస్థానాల్లో ఉన్న అభ్యర్థులకూ స్పష్టత వస్తుంది..” అంటూ సూచిస్తున్నారు.
మరి ఈ ఆపరేషన్ ఆకర్షలకు సంబందించి, గోడమీద పిల్లుల్లా చూస్తున్నారని చెబుతున్న జంపింగ్ జఫాంగుల గురించి నడుస్తున్న ఈ పాలి”ట్రిక్స్”.. ముందు ముందు మరెన్ని మలుపులు తీసుకుంటాయి… ఇంతకూ ఎవరికి ఎవరు టచ్ లో ఉన్నారు.. వంటి విషయాలు తెలియాలంటే… వేచి చూడక తప్పదు!