200 రోజుల అమరావతి రైతుల ఉద్యమం.. చలనం లేని ప్రభుత్వం

చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆమరావతిని కొత్త రాజధానిగా నిర్మించాలని సంకల్పించారు.  అనుకున్నదే తడవుగా ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారు.  కొన్ని ఒడి దుడుకుల నడుమ భూసేకరణ జరిగింది.  29 గ్రామాలకు చెందిన 29,000 మందికి పైగా రైతులు 34,500 ఎకరాల భూములను రాజధాని కోసం ప్రభుత్వం చేతిలో పెట్టారు.  ప్రభుత్వం కూడా వారికి అన్ని రకాల హామీలను ఇచ్చారు.  ఎన్ని హామీలు ఇచ్చినా తరతరాల వారసత్వంగా వచ్చిన ఆస్తిని, జీవనాధారమైన తల్లి లాంటి భూమిని వేరొకరి చేతిలో పెట్టడమంటే మామూలు విషయం కాదు.  పూలింగ్ జరుగుతుండగానే ప్రభుత్వం పనులు స్టార్ట్ చేసింది.  10,000 కోట్ల రూపాయల పనులు పూర్తికావొచ్చాయి.  
 
 
ఒక్క మాటతో కూల్చేసిన జగన్: కానీ 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.  అంతే రాజధాని పనులన్నీ దశల వారీగా నిలిచిపోతూ వచ్చాయి.  రాజధానిగా అమరావతి ఉండదనే పుకారు మొదలైంది.  దాంతో భూములిచ్చిన రైతుల్లో ఆందోళన మొదలైంది.  రాజధాని ఉంటుందో ఉండదో అనే అనుమానం.  చివరికి 2019 డిసెంబర్ 17న శాసన సభలో వైఎస్ జగన్ తన మనసులో ఉన్న మూడు రాజధానుల నిర్ణయాన్ని బయటపెట్టారు.  ఆమరావతి పూర్తిస్థాయి రాజధాని కాదని అది కేవలం శాసన రాజధాని అని దాంతో పాటే విశాఖ, కర్నూల్ కూడా కలిపి మూడు రాజధానులని ప్రకటించారు.  దాంతో భవిష్యత్తు మీద బోలెడు ఆశలు పెట్టుకున్న 29,000 మంది రైతుల ఆశలు పేక మేడల్లా కూలిపోయాయి. 
 
 
ఉద్యమ బాటే శరణ్యమైంది: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి పూర్తి మద్దతు తెలిపిన జగన్ కనీసం ఎన్నికల ముందు కూడా తాను అధికారంలోకి వస్తే మూడు రాజధానులని చెప్పలేదు.  తీరా కుర్చీలో కూర్చున్నాక మాట మార్చారు.  దీంతో రైతులు వికేంద్రీకరణ పేరుతో తమ కుటుంబాల కడుపు కొట్టవద్దని, భూమిలిచ్చిన తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నారు.  అయినా సర్కార్ నిర్ణయం మారలేదు.  రైతుకు తమ గోడును గట్టిగా వినిపించాలని రోడ్ల మీదికి వచ్చారు.  ఫలితం… పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు, బూటు కాళ్ల తన్నులే మిగిలాయి కానీ ప్రభుత్వంలో మార్పు రాలేదు.  అయినా రైతులు వెనక్కు తగ్గలేదు.  ఇక ఉద్యమమే శరణ్యం అనుకుని దీక్షలకు దిగారు.  
 
 
200 రోజుల ఉద్యమంమొదట్లో బహిరంగ నిరసనలు, దీక్షలు చేశారు.  జేఏసీని ఏర్పాటు చేసుకుని కార్యాచరణను నిర్ణయించుకున్నారు.  ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో కరోనా లాక్ డౌన్ పడింది.  అయినా రైతులు దీక్షలు ఆపలేదు.  ఇళ్లలోనే దీక్షలకు, నిరసనకు దిగారు.  కానీ మీడియా మొహం చాటేసింది.  ఉద్యమం గురించి బయటి ప్రపంచం మర్చిపోయే పరిస్థితి.  అయినా రైతులు నిరుత్సాం చెందలేదు.  దీక్షల రూపంలో ఉద్యమం కొనసాగించారు.  ఈరోజు శనివారంతో ఉద్యమం 200 రోజులకు చేరుకుంది.  ఈ సంధర్భంగా పలు రాజకీయ పార్టీలు, సంఘాలు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.  ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రావాలని కోరుతున్నారు.