టీటీడీకి ఆస్తులు అమ్ముకోవాల్సినంత అగత్యం ఏమోచ్చింది ?

 

టీటీడీకి ఆస్తులు అమ్ముకోవాల్సినంత అగత్యం ఏమోచ్చింది ?

 
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను విక్రయించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.  శ్రీవారికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆస్తులున్నాయి.  అవన్నీ భక్తులు శ్రీవారికి ఎంతో భక్తితో రాసిచ్చినవి.  వాటిలో నిరర్థకమైనవని చూపుతూ తమిళనాడులో 23 చోట్ల ఉన్న భూములను అమ్మాలని టీటీడీ పాలక మండలి ప్రణాళిక వేసుకుంది.  నిజానికి ఐదేళ్ల కిందటే భూముల అమ్మకం ప్రక్రియ చర్చకు వచ్చింది.  2015లో బోర్డ్ కొన్ని ఆస్తులను గుర్తించి వేలానికి రెడీ కాగా అప్పటి ప్రభుత్వం అమ్మడానికి సంకోచించి వెనక్కు తగ్గింది.  మళ్లీ ఇప్పుడు ఆ ప్రక్రియ ఊపందుకుంది.  
 
తమిళనాడులోని కాంచీపురం, వేలూరు, కోయబంత్తూరు, విల్లుపురం, తిరువణ్నామలై, నాగపట్నం తదితర జిల్లాల్లో ఉన్న ఆస్తుల వివరాలను సర్వేయర్ల ద్వారా సేకరించారు.  వీటి వేలానికి  టీటీడీలో కిందిస్థాయి అధికారులతో టీమ్‌-ఏ, టీమ్‌-బీ అనే రెండు బృందాలు ఏర్పాటయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.  దీంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది.  ప్రతిపక్షాలు సైతం శ్రీవారి ఆస్తులను అమ్మాల్సినంత పనేమోచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు. 
News
 
నిజమే.. శ్రీవారికి నిధుల కొరత ఎప్పుడూ లేదు.  కరోనా లాక్ డౌన్ కాబట్టి రోజువారీ హుండీ ఆదాయం లేకపోవచ్చు.  అది దేవస్థానం ఖజానా మీద పెను ప్రభావమేమీ చూపదు.  నిజానికి ఇంకొన్ని రోజులు హుండీ ఆదాయం లేకపోయినా నిధుల కొరత రాదు.  అంత దృఢంగా ఉంది టీటీడీ ఆర్థిక స్థితి.  అలాంటిది పాలకమండలి ఆస్తులను అమ్మాలనుకోవడంలో అర్థం ఏముంది.  ఈ ప్రశ్నకి పాలకమండలి చెబుతున్న సమాధానం దూరంగా ఉన్న ఆస్తుల నిర్వహణ కష్టంగా ఉంది.. అందుకే విక్రయిస్తున్నాం అంటున్నారు.  
 
ఈ కారణంలో అసలు బలమే లేదు.  శ్రీవారి ఆస్తుల నిర్వహణకు, పరిరక్షణకు ఒక పెద్ద విభాగమే ఉంది.  అలాంటిది నిర్వహణ కష్టంగా ఉందని సాకు చెప్పి ఆస్తుల విక్రయానికి పూనుకోవడం ఎంతవరకు కరెక్టో పాలకమండలి ఆలోచించుకోవాలి.  ఇక టీటీడీ మాజీ సభ్యులైతే అసలు భక్తులిచ్చిన ఆస్తులను విక్రయించే హక్కు దేవస్థానానికి లేదని, అలా చేస్తే ఉద్యమం తప్పదని, కొన్ని ఆస్తులు గొడవల్లో ఉన్నాయని ముందు వాటిని పరిష్కరించాలని అంటున్నారు.  
 
పైగా గతంలో ఆస్తులు దానంగా వచ్చినవి, వాటిని దేవస్థానం కొనలేదు కాబట్టి అమ్మే హక్కు కూడా లేదు అంటూ హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి.  వాటిని విచారించిన కోర్టు అనుమతులు లేకుండా దేవాదాయ శాఖ ఆస్తులను అమ్మరాదని ఉత్తర్వులు ఇచ్చింది.  ఇది టీటీడీకి కూడా వర్తిస్తుంది.  మరి ఇన్ని సంకటాల మధ్య పాలకమండలి కేవలం అరకొర ఆదాయం కోసం ఆస్తులను అమ్మి భక్తుల్లో బ్యాడ్ అవడం, రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవడం కంటే వెనక్కి తగ్గడం ఉత్తమంగా కనిపిస్తోంది.