రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నిర్లక్ష్యం చేసిన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీయే. ఆవిర్భావం నుండి జనసేనను ఇదే సమస్య వెంటాడుతూ ఉంది. జనంలో ఆదరణ ఉన్న మూడవ పెద్ద పొలిటికల్ పార్టీ అయినా కూడా మీడియా మాత్రం దూరం పాటిస్తూనే ఉంది. పార్టీ తరపున ఏ కార్యక్రమం జరిగినా టీవీ ఛానెళ్లు లేదా పత్రికలు పెద్దగా కవర్ చేయవు. స్వయంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయటికొచ్చి మాట్లాడితే ఛానెళ్లలో ఏదో నిమిషం కవరేజ్, పత్రికల్లో ఏదో ఒక మూల చిన్న వార్త అంతే. ఈ సమస్య పార్టీ జనంలోకి వెళ్లడానికి పెద్ద అవరోధంలా మారింది.
రాష్ట్ర మీడియా వ్యవస్థ మొత్తం మొదటి రెండు ప్రధాన పార్టీల మధ్య చీలిపోయి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను మొదట్లోనే గుర్తించిన పవన్, ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని పార్టీని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఆమేరకు ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటి ఫ్లాట్ ఫామ్స్ మీద పనిచేయడం మొదలుపెట్టారు. అప్పటివరకు షోషల్ మీడియాలో పవన్ సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టిన ఫ్యాన్స్ ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. ఎవరికి వారు స్వచ్చంధంగా పార్టీ సిద్దాంతాల్ని, పార్టీ కార్యకలాపాల్ని ప్రచారం చేసే భాద్యతను భుజాలకెత్తుకున్నారు.
అధినాయకత్వం నుండి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండానే అనతి కాలంలోనే సోషల్ మీడియాలో అత్యధికంగా చర్చకు వచ్చిన అంశాల జాబితాలో జనసేన పార్టీని నిలబెట్టారు. పార్టీకి సంబంధించిన ఏ చిన్న సమాచారమైనా జనసైనికుల సామాజిక మాధ్యమాల అకౌంట్ల నుండే బయటి ప్రపంచానికి తెలిసేదంటే వారి పనితీరు ఎంత విశేషంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైకాపా, టీడీపీలు సోషల్ మీడియా ప్రచారం కోసం పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తే జనసేనకు మాత్రం ఆ అవసరం లేకుండా పోయింది. కారణం పార్టీ తరపున నిర్వహించే ఇతర కార్యకలాపాలతో పాటు ప్రచారం అనే భాద్యతను కూడా జనసైనికులు స్వఛ్ఛందంగానే నిర్వహించారు.
సాధారణ రోజుల్లో పవన్ బయట తిరుగుతున్న సమయంలోనే సీత కన్నేసిన మీడియా సంస్థలు ఈ లాక్ డౌన్ తరుణంలో పార్టీని పూర్తిగా విస్మరించాయి. దీంతో జనసైనికులు మరింత అప్రమత్తమయ్యారు. తమ నాయకుడు బయట కనిపించకపోయినా తమ పార్టీ నిర్ణయాలు, కార్యకలాపాలు టీవీ ఛానెళ్ళలో, వార్తా పత్రికల్లో వినిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా ప్రతిధ్వనించేలా చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ నుండి అధికారికంగా ఏ విషయం బయటికొచ్చినా దాన్ని బయటకి తీసుకొస్తూ కరెంట్ ఇష్యూల మీద పార్టీ స్టాండ్ ఏమిటో జనానికి చెబుతున్నారు.
అధికార పార్టీ నిర్ణయాలను, విధానాలను, పని తీరును పార్టీ ఐడియాలజీని దృష్టిలో పెట్టుకుని విశ్లేషిస్తూ లోపాల్ని ఎత్తి చూపుతున్నారు. అంతేకాదు అన్ని జిల్లాలోని శ్రేణులు ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే ఒకరినొకరు సమన్వయ పరుచుకుంటూ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ప్రజల ముందుంచుతున్నారు. పార్టీ నాయకులు సైతం ఈ మాధ్యమాల ద్వారానే శ్రేణులతో అనుసంధానమవుతున్నారు. మొత్తం మీద ఈ లాక్ డౌన్ తమ నాయకుడి చేతులు కట్టేసినా జనసైనికులు మాత్రం పార్టీ ఉనికిని సోషల్ మీడియా ద్వారా చాటుతూనే ఉన్నారు.