Ugadi 2024: హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి. అంతే కాకుండా హిందువుల మొట్టమొదటి పండుగ అని కూడా చెప్పవచ్చు. కాగా బ్రహ్మదేవుడు తన భూత సృష్టిని ప్రారంభించిన సృష్ట్వాది నుంచి లేక కలియుగం ప్రారంభం మొదలు నుండి గాని పంచాంగాలలో లెక్కించటం వాడుకగా వస్తున్న ఆచారం. ఈ బ్రహ్మ సృష్టిలో ప్రళభయం అయిపోయిన తరువాత తిరిగి ఆరంభించే ఆధ్యాయాన్ని బ్రహ్మ కల్పం అని అంటారు. ఈ ప్రారంభకాలాన్ని కల్పాది అని వ్యవహరిస్తారు. ప్రతీ కల్పంలోను మొదట వచ్చే ఆది సమయమే ఉగాది పండుగ.
దీని గురించి సూర్య సిద్ధాంతము అనే జ్యోతిష్య గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. నాటి నుండి నేటి వరకు ఈ పద్ధతినే అనుసరిస్తూ ప్రతీ తెలుగు సంవత్సర ఆరంభదినం నాడు మనం ఉగాది పర్వదినం జరుపుకునే ఆచారం ఏర్పడింది. తెలుగు సంవత్సరం చైత్రం నుండి శిశిరం వరకు ఆరు రుతువులుగా విభజించారు. సంవత్సరం పొడవునా అనేక ఒడిదుడుకులు అనుభవించిన ప్రకృతిలో చెట్లు శిశిర రుతువులో ఆకులు రాల్చి జడత్వాన్ని పొందుతాయి. చైత్ర మాసంలో కొత్త చిగురు తొడిగి చైతన్యవంతంగా కనిపిస్తాయి.
ఈ విధంగా ప్రకృతిలో సంభవించే నూతన వత్సరం చైత్ర మాసం. ఇకపోతే ఈ ఉగాది పండుగ రోజున ఆచరించాల్సిన నియమాల విషయానికి వస్తే.. ఉగాది పర్వదినాన అభ్యంగనము, పుణ్యకాల సంకల్పం, ఉగాది పచ్చడి సేవనం, ధర్మకుంభం, సృష్టి క్రమవర్ణన, కల్పాది వైవస్వత మన్వంతర వివరములతో కూడిన పంచాంగ శ్రవణం అనే ముఖ్యమైన విధులను అనుసరించవలసి ఉంటుంది. సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె తలకి పట్టించి ఉసిరి కాయ, పెసరపిండి, పసుపు, భావపంచాలు, కచ్చూరాలు మొదలైన వాటిని ఉపయోగించి శిరస్నానం చేయాలి. ఈ దినం వేడినీటి స్నానం శ్రేష్టం. అనంతరం తిలకం దిద్దుకుని, కొత్త బట్టలు ధరించి సంకల్పం చెప్పుకోవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి. సూర్యునికి అర్ఘ్యం, దీపం, ధూపం, పుష్పాంజలి సమర్పించాలి.
అయితే ఈ సంకల్పములో ముఖ్యమైన దేశము, కాలము ధ్యానించి, బ్రహ్మ సృష్టి సంకల్పం యొక్క సంకల్ప సిద్ధిని ధ్యానించి, మనము తలపెట్టిన కార్యక్రమాలకు శుభఫలితాలు ఇవ్వాలని కోరుకుంటారు. హైందవ సంకల్ప మంత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఉగాది రోజు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. రానున్న రోజులలో పూర్ణ మనోరథ సిద్ధి, సకల సౌభాగ్యాలు కలుగుతాయనే సంకల్ప బలంతో పంచలోహాల పాత్రగాని, మట్టి కుండగాని కలశముగా తీసుకోవాలి. సుగంధ జలము, చందనం, పుష్పాక్షతలు వేసి అవాహన చేసి పుణ్యాహ మంత్రములతో బియ్యము పోసిన ఒక పళ్ళెములో కలశము ఉంచి నూతన వస్త్రము చుట్టి ఉపరి భాగమున నారికేళము ఉంచి, కుంకుమ, పసుపు చందనములు సమర్పించాలి. దీన్ని పురోహితునకు గాని, గురువునకు గాని లేక గుడిలోని ఇష్టదైవమునకు గాని దానమిచ్చి వారి ఆశీర్వాదములు పొందాలి. దీనినే ధర్మఘట దానం లేక ప్రపాదానం అంటారు.