కార్తీకస్నానం వెనుక సైన్స్ ఇదే !

కార్తీకం అంటేనే స్నాన, దాన, ఉపవాస నియమాల మాసం. ఈ మాసంలో నదీస్నానం అత్యంత విశేషమైనది దీని వెనుక శాస్త్రీయత పరిశీలిద్దాం… జ్యోతిష శాస్త్ర రీత్యా నీటి మీద, మానవుల మనసు మీదా చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటి చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడట. అందుకే ఈ మాసానికి `కౌముది మాసం` అని కూడా పేరు. అలాంటి చంద్ర కిరణాలతో, ఔషధులతో రాత్రంతా తడిసిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అనాదిగా మన పూర్వీకులు నదులకు గొప్ప స్థానాన్ని అందించారు. వాటిని దేవతలుగా భావించి కొలిచారు. ఇంటిలో స్నానం చేసినా సరే… ఆ నీటిని
‘’గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు’’

అనే మంత్రాన్ని పఠిస్తూ స్నానమాచరించాలి. గంగ, యమున, సరస్వతి వంటి పుణ్యనదులన్నీ కూడా తాను స్పృశించిన నీటిలో ఉండుగాక అని దీని అర్థం. వర్షాకాలం పూర్తయిపోయిన వేళ కార్తీకం వస్తుంది. నదులలో, తటాకాలలో ఉండే నీరు కొత్తది. ఇది అనేక కొండలు, కోనలు, చెట్లు, ఔషధీ గుణాలున్న వాటి గుండా ప్రవహించడంతో ఈ నీరు చాలా శక్తివంతంగా ఉంటుంది. అనేక ఔషధగుణాలను కలిగి ఉంటుంది. దీనిలో స్నానం చేయడం వల్ల మనకు శక్తి వస్తుంది. శరీరానికి కావల్సిన కొన్ని ఔషధాలు అందుతాయి.