మన భారతీయ సంస్కృతిలో జ్యోతిష శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే వాస్తు శాస్త్రం పట్ల ప్రజలు ఎంతో నమ్మకంగా ఉంటూ ఇప్పటికీ వాస్తనియమాలను పాటిస్తూ ఉంటారు. అలాగే కొన్ని శకునాల పట్ల కూడా ప్రజలకు చాలా నమ్మకం ఉంటుంది. ఆ శకునాలు భవిష్యత్తును సూచిస్తాయని, మార్పును సూచించే సంకేతాలుగా చాలా మంది నమ్ముతారు. ఇక వీటిలో కొన్ని మంచి శకునాలు, కొన్ని అపశకునాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో మహిళలకు కుడి కన్ను , మగవారికి ఎడమ కన్ను కొట్టుకుంటే అపశకునంగా భావిస్తారు. కుడి కన్ను అదిరితే ఒక అర్థం, ఎడమ కన్ను అదిరితే మరో అర్థం ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నమ్ముతారు. మరి ఈ క్రమంలో స్త్రీపురుషులలో ఏ కన్ను కొట్టుకుంటే మంచిది..? ఏ కన్ను అదిరితే అపశకునం అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషుల కళ్లు అదరడం: పురుషులకు కుడి కన్ను కొట్టుకుంటే అది మంచి శకునంగ భావిస్తారు. ఇలా కుడి కన్ను అదిరితే అతని చిరకాల వాంఛ త్వరలో నెరవేరుతుందని, తనకు ఇష్టమైన వారిని కలవడం లేదా ఏదైనా అదృష్టం కలిసి రావడం వంటివి సంభవిస్తాయని పెద్దలు చెబుతారు. అలాగే సంపద వస్తుందని చెప్పటానికి సూచనగా దీనిని పరిగణిస్తారు. అలాగే పురుషులకు ఎడమ కన్ను కొట్టుకుంటే అపశకునంగా భావిస్తారు. ఇలా జరిగితే దురదృష్టం రాబోతుందని తెలిపే సూచన. ఎడమ కన్ను కొట్టుకోవడం వల్ల పురుషులు ఊహించని ఇబ్బందులకు గురవుతారని ప్రజల నమ్మకం.
స్త్రీల కళ్లు అదరడం: ఇక స్త్రీల విషయానికి వస్తే… స్త్రీలకు కుడి కన్ను కొట్టుకోవడం మంచిది కాదని మన పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ స్త్రీలకు కుడి కన్ను కొట్టుకుంటే అది శుభప్రదం కాదని, దురదృష్టమని ప్రజల నమ్మకం. మహిళలకు కుడి కన్ను కొట్టుకుంటే అనారోగ్య సూచకంగా కూడా చెబుతున్నారు. అలాగే స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే శుభం జరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించిన లేదంటే పని గురించి ఆలోచన వచ్చిన అది విజయవంతం అవుతుందని నమ్మకం.