వైఎస్ జగన్ బీసీలను ఆకట్టుకోవాలని ఉద్దేశ్యంతో బీసీల్లోని అన్ని వర్గాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వారి అభ్యున్నతికి తొడపడతామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఇప్పుడు బీసీ కార్పొరేషన్లను ప్రకటించారు. మొత్తం 139 బీసీల కులాలకు గాను 56 కార్పొరేషన్లను ఏర్పాటుచేశారు. ఇందులో ఒక్కో కార్పొరేషన్ కు ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లు ఉంటారు. ఇలా మొత్తం 56 కార్పొరేషనల్లో 728 మంది బీసీలకు పదవులు కట్టబెట్టారు. అందులో మహిళలకు 50 శాతం అవకాశం కల్పించడం విశేషం. ఇలా బీసీలోని అన్ని కులాలకు వెతికి వాటికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి.
గత ప్రభుత్వంలో బీసీలోని అన్ని కులాలు ఒకే కార్పొరేషన్ కింద ఉండేవి. దాని మూలంగా అత్యధిక జనాభాలో లబ్ది పొందడానికి అర్హులెవరో గుర్తించడం, వారికి సహాయం అందించడం కష్టంగా ఉండేది. ఈ పద్దతి వలన అనేక కులాలు ఎలాంటి లబ్ది పొందలేక ఒట్టి చేతులతో మిగిలాయన్నది వాస్తవం. అందుకే బీసీలు సగం మంది ఎన్నికల్లో వైసీపీకి జైకొట్టారు. జగన్ సైతం బ్యాంకును కాపాడుకోవడం కోసం చెప్పినట్టే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక కార్పొరేషన్ల విధానం వలన ప్రతి కులంలో వెనుకబడినవారిని, సహాయం పొందడానికి అర్హులను గుర్తించడం సులభతరం కానుంది. ఇదే బీసీ జనాలకు బాగా నచ్చింది. అయితే ఇందులోనూ కొన్ని చిక్కులు లేకపోలేదు.
ఈ కార్పొరేషన్లను కంపెనీ చట్టాల కింద నమోదు చేయకుండా స్వచ్ఛంద సంస్థలుగా, సొసైటీలుగా రిజిస్టర్ చేశారు. స్వచ్చంద సంస్థలు అనేవి ప్రభుత్వం దయతలచి నిధులు ఇస్తే తీసుకోవాలే తప్ప డిమాండ్ చేసి తీసుకోలేవు. అంటే నిధుల రాక పరంగా కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పోరాటం చేయడం అనేది జరగని పని. కనుక ప్రభుత్వమే ఎప్పటికప్పుడు కులాల అవసరాలను గుర్తించి నిధులు కేటాయిస్తూ ఉండాలి. సరే జగన్ ప్రత్యేక శ్రద్ద పెట్టి నిధులు కేటాయిస్తారనే అనుకున్నా ఆ నిధులు ఇతర సంక్షేమ పథకాల నుండి మళ్లిస్తున్నవా లేకపోతే ప్రత్యేకంగా కేటాయిస్తున్నవా అనేది తేలాల్సి ఉంది. బీసీల డిమాండ్ ప్రకారం అందరికీ ఇచ్చే సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా వారికంటూ ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి.
ఇప్పటికే బీసీల అభివృద్ధి కోసం 33,500 కోట్లు ఖర్చుపెట్టామని ప్రభుత్వం అంటోంది. కానీ ప్రతిపక్షాలు, వాటికి అనుకూలంగా ఉన్న బీసీ సంఘాలు మాత్రం అందరికీ ఇస్తున్న సంక్షేమ పథకాలే బీసీలకు ఇచ్చి ప్రత్యేకంగా మేలు చేస్తున్నట్టు జగన్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటోంది అంటూ ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు ప్రభుత్వం ఇప్పటివరకు లెక్కలతో సమాధానం చెప్పలేదు. అంటే రెగ్యులర్ సంక్షేమ పథకాల్లో బీసీలు పొందిన లబ్దినే వేరుగా లెక్కగట్టి చూపుతున్నారని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఉదాహరణకు జగనన్న చేయూతతో ఒక బీసీ కుటుంబం లబ్ది పొందితే అది ప్రత్యేకమైన మేలు కిందకి రాదు. దానితో పాటే బీసీలకు మాత్రమే అదనంగా ఏదైనా చేస్తే అదే వారి అభ్యున్నతికి సహకరిస్తుందని బీసీల వాదన.
మరి ఈ వాదన ప్రకారం వైసీపీ నాయకులు చెబుతున్నట్టు ఏడాదికి 20 వేల కోట్లను ప్రభుత్వం అందరితో పాటు ఇచ్ఛే సంక్షేమ లబ్ది నుండి తీసి ఇవ్వకుండా ఆ పథకాలతో పాటే జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారానో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగానో ప్రత్యేక నిధులు కేటాయిస్తేనే ఈ 56 కార్పొరేషన్ల వలన అందులోని 139 కులాలకు ఏమైనా ప్రయోజనం ఒనగూరుతుంది. అలాకాకుండా అందరికీ ఇచ్చే దాంట్లో బీసీలు పొందే నిధులను బీసీ కార్పొరేషన్లకు మళ్లించి డబ్బు పంపిణీ చేస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పైగా కార్పొరేషన్ల పేరుతో హైడ్రామా నడిపి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారనే అపవాదును మూటగట్టుకోవాల్సి ఉంటుంది.